Historical War Movie on OTT: చరిత్రలో గొప్ప నాయకుడిగా ప్రపంచానికి తెలిసిన జార్జ్ వాషింగ్టన్ జీవితంలో కూడా ఒక దశలో ఘోరమైన పరాజయాలు, అవమానాలు ఉన్నాయంటే నమ్మగలరా ? సైనికుడిగా అతను చేసిన ఒక తప్పు ఏకంగా బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య జరిగిన భారీ యుద్ధానికి దారి తీసిందనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన హిస్టారికల్ వార్ డ్రామానే ‘యంగ్ వాషింగ్టన్’(Young Washington 2026). అమెరికా తొలి అధ్యక్షుడిగా ఎదగడానికి ముందు వాషింగ్టన్ ఎదుర్కొన్న కష్టాలు, యుద్ధాల్లో చేసిన పొరపాట్లు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఎంజెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దేశానికి అధ్యక్షుడిగా మారకముందు జార్జ్ వాషింగ్టన్ ఒక సాధారణ యువ సైనికుడు. సుమారు 20 ఏళ్ల వయసులో బ్రిటిష్ ఆర్మీలో సర్వేయర్‌గా పని చేస్తూ తన కెరీర్‌ను ప్రారంభిస్తాడు. 1754లో ఫ్రెంచ్, ఇండియన్ యుద్ధం సమయంలో ఒహియో వ్యాలీ ప్రాంతంలో ఫ్రెంచ్ దళాలను వెనక్కి వెళ్లాలని హెచ్చరించే బాధ్యత వాషింగ్టన్‌కు అప్పగిస్తారు.
అయితే అక్కడ జరిగిన ఒక చిన్న ఘర్షణ ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. అనుభవం తక్కువగా ఉండటంతో వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. చిన్న ఘర్షణగా మొదలైన ఈ సంఘటన క్రమంగా బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య పెద్ద యుద్ధానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తుంది. తన సైనిక జీవితంలో చేసిన ఈ నిర్ణయం వాషింగ్టన్ భవిష్యత్తుపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ తర్వాత వాషింగ్టన్ నిర్మించిన ఫోర్ట్ నెసెసిటీ శత్రువుల చేతిలో చిక్కుకుంటుంది. భారీ దాడిని ఎదుర్కొన్న అతని సైన్యం చివరకు లొంగిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు అమెరికా చరిత్రలో అత్యంత గొప్ప నాయకుడిగా నిలిచిన వ్యక్తి, తన యువకుడి దశలో ఇలాంటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడనే విషయం ఈ కథలో ఆసక్తిని పెంచుతుంది.
అంతటితో వాషింగ్టన్ కష్టాలు ముగియవు. 1755లో జరిగిన మొనొంగాహెలా యుద్ధంలో కూడా అతను ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ యుద్ధంలో పాల్గొంటాడు. అతను ప్రయాణించిన రెండు గుర్రాలు చనిపోవడం, నాలుగు బుల్లెట్లు అతని కోటును దూసుకెళ్లడం వంటి ఘటనలు అతను ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో పోరాడాడో చూపిస్తాయి. అయినప్పటికీ ఒక్క గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడతాడు. అయితే ఈ పరాజయాలే తర్వాత అతని బలంగా మారతాయి. తాను చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటూ, యుద్ధ అనుభవాలను సొంతం చేసుకుంటూ, ఒక సాధారణ యువ సైనికుడి నుంచి భవిష్యత్తులో అమెరికాను నడిపించే నాయకుడిగా ఎలా ఎదిగాడనేదే ‘యంగ్ వాషింగ్టన్’లో చూపించారు.
జాన్ ఇర్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలియం ఫ్రాంక్లిన్ మిల్లర్ జార్జ్ వాషింగ్టన్ పాత్రలో నటించారు. బెన్ కింగ్స్లీ, ఆండీ సెర్కిస్, మెరి లూయిస్ పార్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. సుమారు 2 గంటల 5 నిమిషాల నిడివితో సాగే ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చరిత్ర పుస్తకాల్లో మనం చూసిన గొప్ప నాయకుడి విజయాల వెనుక ఎన్ని వైఫల్యాలు, తప్పులు, అవమానాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలనుకునే వారికి ‘యంగ్ వాషింగ్టన్’ ఆసక్తికరమైన వాచ్ అవుతుంది. ఓటమి మనిషిని చంపదు, దాని నుంచి నేర్చుకుంటే అదే ఓటమి భవిష్యత్తు విజయానికి పునాది అవుతుందనే విషయాన్ని ఈ సినిమా గుర్తుచేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ కి ఇంగ్షీషులో మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also: రియల్టర్‌గా మారిన మాజీ హిట్‌మ్యాన్.. ఒక్క ఎర్ర కవర్‌తో మళ్లీ మొదలైన నరహంతకుల వేట