Jio Hotstar Trending Top 5: ఓటీటీ అంటే సినిమాలే కాదు… ఇప్పుడు సిరీస్‌లకూ అదే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఒక్కో ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకులు కథను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం హాట్‌స్టార్ ట్రెండింగ్ లిస్ట్ చూస్తే ఈ విషయం మరోసారి అర్థమవుతోంది. టాప్ 5లో ఒక్క సినిమా కూడా లేకపోవడం, మొత్తం సిరీస్‌లు, షోలు ఉండటం విశేషం. ఇంతకీ హాట్ స్టార్ లో ఆ టాప్ 5లో ఏవి ఉన్నాయంటే…
టాప్ ప్లేస్‌లో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ సందడి చేస్తోంది. హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్ల మధ్య మాటలు, మనస్పర్థలు, టాస్కులు, ఎమోషనల్ మూమెంట్స్… ఇలా రోజుకో కొత్త పరిణామం కనిపిస్తోంది. ఎవరు ఎవరితో ఎలా ఉంటున్నారు ? టాస్కుల్లో ఎవరు పైచేయి సాధిస్తున్నారు ? ఎవరికి ప్రేక్షకుల సపోర్ట్ పెరుగుతోంది ? అనే విషయాలపై ఆసక్తి ఉండటంతో ఈ షోకు మంచి వ్యూస్ వస్తున్నాయి.
తర్వాతి స్థానంలో ‘పార్ట్ టైమర్స్’ సిరీస్ ఉంది. యువత జీవితంలో ఎదురయ్యే ఉద్యోగం, కెరీర్, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్ సమస్యలను కథలో భాగం చేశారు మేకర్స్. సరదాగా సాగుతూనే కొన్ని సీరియస్ ఎమోషన్స్‌ను కూడా టచ్ చేయడంతో యూత్ ఆడియన్స్‌కు ఈ సిరీస్ కనెక్ట్ అవుతోంది. అందుకే హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఎక్కువగా చూస్తున్న కంటెంట్‌లో ఇది కూడా చేరింది. పైగా ఇందులో బిగ్ బాస్ తనూజ మెయిన్ లీడ్ గా నటించడం విశేషం.
తండ్రీకూతుళ్ల మధ్య వారసత్వ పోరు, కేసులు, న్యాయపరమైన చిక్కులు, వాటి వెనుక దాగిన నిజాలతో ఆసక్తి రేపుతున్న సిరీస్ ‘ది కోర్ట్’. ఒక కేసు చుట్టూ మొదలయ్యే కథ క్రమంగా మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిజం ఎవరి వైపు ఉంది ? అసలు తప్పు చేసింది ఎవరు ? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ లో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే. ఇదే క్యూరియాసిటీ ఈ సిరీస్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది.
ఇక బిగ్ బాస్ కు ముందు సామాన్యులను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి, వాళ్ళను సానబెట్టే షో ‘అగ్నిపరీక్ష’ కూడా టాప్ 5లో చోటు సంపాదించింది. ఇప్పటికే అగ్ని పరీక్ష పూర్తయి, సామాన్యులు హౌస్ లోకి అడుగు పెట్టారు. అగ్నిపరీక్ష పూర్తయినా ఇంకా ట్రెండింగ్ లోనే ఉండడం విశేషం.
యూత్ ఆడియన్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న ‘హార్ట్ బీట్’ మూడో సీజన్ కూడా హాట్‌స్టార్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రేమ, స్నేహం, రిలేషన్‌షిప్స్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు ఈ సీజన్‌లోనూ కథకు ప్రధానంగా మారాయి. గత సీజన్లను ఫాలో అయినవాళ్లతో పాటు కొత్తగా సిరీస్‌ను చూస్తున్నవాళ్లు కూడా దీనిపై ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి హాట్‌స్టార్ తాజా ట్రెండింగ్ లిస్ట్‌లో సినిమాలకు చోటు లేకుండా సిరీస్‌లు, షోలే పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నాయి. బిగ్ బాస్ నుంచి యూత్‌ఫుల్ రిలేషన్‌షిప్ డ్రామాల వరకు ఒక్కో దానికీ ఒక్కో ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంది.
Read Also: భార్యాభర్తల మధ్య రగిలిన గొడవలు… కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ డ్రామా