Jackass Best and Last Movie on OTT: ‘జాకాస్’ పేరు వినగానే ప్రమాదకరమైన స్టంట్స్, విచిత్రమైన ప్రయోగాలు, కొట్టుకోవడం, పడిపోవడం, గాయపడటం… వీటన్నింటినీ కామెడీగా మార్చే ఓ ప్రత్యేకమైన టీమ్ గుర్తొస్తుంది. 2000లో టీవీ షోగా మొదలైన ఈ ఫ్రాంచైజీ దాదాపు పాతికేళ్లుగా ప్రేక్షకులను తనదైన వెరైటీ కామెడీతో అలరిస్తోంది. ఇప్పుడు ఈ సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ ‘జాకాస్: బెస్ట్ అండ్ లాస్ట్’ అనే సినిమాను తీసుకొచ్చారు. జెఫ్ ట్రెమైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘జాకాస్’ మెయిన్‌లైన్ ఫ్రాంచైజీలో ఐదవ, చివరి సినిమాగా రూపొందింది. మరి ఈ మూవీని చిన్న పిల్లలతో కలిసి చూడొచ్చా ? కథ ఏంటి ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
సాధారణ సినిమాల్లా ఇందులో పెద్దగా కథ ఉండదు. జాకాస్ గ్యాంగ్‌కు ప్రత్యేకమైన కథ వారి స్టంట్స్. గత 25 ఏళ్లుగా ప్రేక్షకులను పిచ్చెక్కించిన ప్రమాదకరమైన ప్రయోగాలు, పిచ్చి చేష్టలు, విచిత్రమైన గేమ్స్, శారీరకంగా ఇబ్బంది పెట్టే స్టంట్స్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి కేవలం కొత్త స్టంట్స్ మాత్రమే చూపించలేదు. ఇన్నేళ్ల ప్రయాణంలో చేసిన అత్యంత క్రేజీ స్టంట్స్‌లో కొన్నింటిని మరోసారి గుర్తుచేస్తూ, ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని అన్‌సీన్ ఫుటేజ్, బిహైండ్ ది సీన్స్ క్లిప్స్‌ను కూడా ఇందులో జోడించారు. దీంతో సినిమా ఒకవైపు కొత్త కామెడీని అందిస్తూనే మరోవైపు జాకాస్ గతాన్ని గుర్తుచేసేలా ఉంటుంది.
ఈ గ్యాంగ్‌కు వయసు పెరిగిపోయింది. కానీ ప్రమాదకరమైన పనులు చేయాలనే ఉత్సాహం మాత్రం తగ్గలేదు. దాదాపు 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా తమ శరీరాలను పణంగా పెట్టి స్టంట్స్ చేయడం సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గతంలో చేసిన పనులతో పోలిస్తే ఇప్పుడు వారి వయసు, శారీరక పరిస్థితి కారణంగా కొన్ని స్టంట్స్ మరింత విచిత్రంగా, మరింత కామెడీగా మారుతాయి.
అందులో ‘రోబోటిక్ ప్రాస్టేట్ ఎగ్జామ్’ అనే స్టంట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వయసు పెరిగిన నాక్స్‌విల్లే గ్యాంగ్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ విచిత్రమైన ప్రయోగం ప్రేక్షకులను నవ్వించేలా ఉంటుంది. జాకాస్ సినిమాల్లో ఉండే బౌండరీ లేని కామెడీకి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది. కానీ సినిమా మొత్తం నవ్వించడానికే పరిమితం కాదు. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, ఇన్నేళ్లుగా కలిసి పనిచేసిన ఈ టీమ్ మధ్య ఉన్న స్నేహాన్ని కూడా చూపిస్తుంది. ఒకప్పుడు యువకులుగా ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన స్టంట్స్ నుంచి, ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత చేసిన ప్రయోగాల వరకు వారి ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది.
మరి ఈ చివరి సినిమాలో జాకాస్ గ్యాంగ్ ఎలాంటి పిచ్చి పనులు చేసింది? ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్లు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేయగలిగారా? పాత స్టంట్స్‌లో ఏవి మళ్లీ చూపించారు? కొత్తగా చేసిన ప్రయోగాల్లో ఏవి మరింత షాకింగ్‌గా ఉన్నాయి? అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
జానీ నాక్స్‌విల్లే, స్టీవ్-ఓ, క్రిస్ పొంటియస్, వీ మ్యాన్, ప్రెస్టన్ లేసీ, డేవ్ ఇంగ్లాండ్, డేంజర్ ఎహ్రెన్ తదితరులు ఈ సినిమా చివరి ప్రయాణంలో కనిపిస్తారు. ముఖ్యంగా జానీ నాక్స్‌విల్లే నాయకత్వంలో ఇన్నేళ్లుగా సాగిన జాకాస్ ప్రయాణానికి ఇది ఫేర్‌వెల్‌గా నిలుస్తుంది. ‘జాకాస్: బెస్ట్ అండ్ లాస్ట్’ ప్రస్తుతం Paramount+తో పాటు ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. సినిమా నిడివి సుమారు 1 గంట 32 నిమిషాలు. ఈ చిత్రంలో తీవ్రమైన స్టంట్స్, అసభ్యకరమైన హాస్యం, వయొలెంట్ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. జాకాస్ ఫ్రాంచైజీని మొదటి నుంచి ఫాలో అవుతున్న వారికి ఇది కేవలం మరో కామెడీ సినిమా కాదు.. 25 ఏళ్ల పిచ్చి ప్రయాణానికి చివరి వీడ్కోలు.
Read Also: చిన్న పిల్లలు చూడకూడని యానిమే సిరీస్… ఈ పిల్లులు చేసే పనులు చూస్తే నవ్వి నవ్వి పోతారు