Korean Legal Thriller : సాధారణంగా చిన్నపిల్లలు పెద్ద తప్పులు చేసినా, వాళ్ళ వయసును దృష్టిలో పెట్టుకుని మైనర్లు అంటూ చాలా తక్కువ శిక్షను విధిస్తారు. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు ఒళ్ళు రక్తంతో మరిగిపోతుంది. అలాంటి వారికి కూడా పెద్దలకు పడే కఠినమైన శిక్షలు వేయాలని అనిపిస్తూ ఉంటుంది. అచ్చం ఇలాంటి స్టోరీ లైన్ తో రూపొందిన క్రేజీ కొరియన్ లీగల్ డ్రామా సిరీస్ ‘జువైనల్ జస్టిస్’ (Juvenile Justice). 2022లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్లో మైనర్ నేరస్తులు చేసే దారుణమైన నేరాలు, వాటి వెనక ఉన్న సామాజిక కారణాలు, న్యాయ వ్యవస్థ లోపాలను ఇంటెన్స్ గా చూపించారు. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
సిమ్ ఉన్-సియోక్ అనే జడ్జి చాలా కఠినంగా, నిక్కచ్చిగా ఉంటుంది ఆమెకు మైనర్ నేరస్థులు అంటే తీవ్రమైన ద్వేషం. “నేను జువెనైల్ నేరస్థులను అసహ్యించుకుంటాను” అని ఆమె బహిరంగంగానే చెబుతుంది. ఎందుకంటే మైనర్లు ఎంత పెద్ద తప్పు చేసినా, దేశ చట్టాల ప్రకారం వారికి కఠినమైన శిక్షలు పడవని, దానిని వారు అడ్వాంటేజ్‌గా తీసుకుని మరింత క్రూరంగా మారుతున్నారని ఆమె నమ్ముతుంది. ఆమె జియోంగి జిల్లాలోని జువెనైల్ కోర్టుకు అసోసియేట్ జడ్జిగా బదిలీపై వస్తుంది.
ఆ కోర్టులోనే చా టే-జూ అనే మరో జడ్జి కూడా పని చేస్తుంటాడు. అతను చాలా మృదుస్వభావి. మైనర్ నేరస్థులను కేవలం నేరస్థులుగా చూడకుండా, వారు అలా మారడానికి గల పరిస్థితులను అర్థం చేసుకోవాలని, వారికి ఇంకో అవకాశం ఇచ్చి సంస్కరించాలని భావిస్తాడు. ఒకే కోర్టులో భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన ఈ ఇద్దరు జడ్జీల మధ్య జరిగే వైరుధ్యం కథను ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ నేపథ్యంలోనే భయంకరమైన కేసులు బయట పడతాయి. సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ లో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన విభిన్నమైన కేసులు కోర్టు ముందుకు వస్తాయి.
అందులో భాగంగా 8 ఏళ్ల బాలుడిని అత్యంత క్రూరంగా హత్య చేసిన కేసులో ఒక స్కూల్ అమ్మాయి తానే నేరం చేశానని ఒప్పుకుంటుంది. కానీ ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని చట్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. జడ్జి సిమ్ ఉన్-సియోక్ స్వయంగా రంగంలోకి దిగి, ఈ హత్య వెనుక మరొక మైనర్ ఉన్నాడని క్లూస్ ఆధారంగా నిరూపిస్తుంది. అలాగే పరీక్షల పేపర్ లీకేజీ, హింస – అమ్మాయిలపై గ్యాంగ్ అఘాయిత్యం వంటి ఘోరమైన కేసులు కూడా ఈ జడ్జిల ముందుకు వస్తాయి.
సిమ్ ఉన్-సియోక్ కేవలం కోర్టు రూమ్‌కే పరిమితం కాకుండా, పోలీసుల కంటే వేగంగా క్షేత్రస్థాయికి వెళ్లి సాక్ష్యాలను సేకరిస్తుంది. నేరస్థుల తల్లిదండ్రులకు కూడా బాధ్యత గుర్తుచేస్తూ కోర్టులోనే గట్టిగా నిలదీస్తుంది. జడ్జి సిమ్ ఉన్-సియోక్‌కు మైనర్ నేరస్థులపై అంత కసి, ద్వేషం ఉండటానికి కారణం ఆమె గతంలో జరిగిన ఒక ట్రాజెడీ. మరి ఆ ట్రాజెడీ ఏంటి ? మైనర్లమనే ధైర్యంతో దారుణాలకు ఒడిగట్టే పిల్లలకు ఆమె ఎలాంటి శిక్షలు విధించింది ? అన్నది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.
Read Also : బొమ్మను చూసుకోవడానికి వచ్చే బేబీ సిట్టర్… ఊహించని ట్విస్ట్‌లతో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్