Kannada Crime Comedy: ఓ జూదగాడు… ఓ పరిస్థితి కారణంగా ఒకేసారి ఇద్దరు డాన్ల మధ్య ఇరుక్కుంటాడు. బయటకు వస్తే ప్రాణాలకే ప్రమాదం. అక్కడే ఉంటే సమస్య మరింత పెద్దదవుతుంది. ఇలాంటి సమయంలో తల్లికి ఇచ్చిన ఓ మాట అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. క్రైమ్, కామెడీ, గ్యాంగ్‌స్టర్ గందరగోళంతో పాటు తల్లి సెంటిమెంట్‌ను కలిపి తీసిన ఈ కన్నడ మూవీ పేరు ‘మదర్ ప్రామిస్’ (Mother Promise). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాలో ఇద్దరు డాన్ల మధ్య చిక్కుకున్న ఆ గ్యాంబ్లర్ పరిస్థితి ఏంటి ? తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతడు ఎంత దూరం వెళ్తాడు ? అనేది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
బెంగళూరులో జీవించే ఓ గ్యాంబ్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జూదానికి బానిస అవుతాడు హీరో. కానీ ఓ సందర్భంలో తీసుకున్న నిర్ణయం అతడిని ఊహించని క్రైమ్ ప్రపంచంలోకి లాగుతుంది. సాధారణంగా డబ్బు గెలుచుకోవడం, ఓడిపోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యే ఆ జూదం వల్ల అతడి జీవితం ఒక్కసారిగా డాన్లు, స్మగ్లర్లు, నేరస్థులతో సంబంధం పెట్టుకోవాల్సిన పరిస్థితికి చేరుతుంది. ఒక డాన్ తో సమస్య మొదలైన తర్వాత మరో డాన్ కూడా అతడి జీవితంలోకి వస్తాడు. దీంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని తప్పించుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది.
ఒకరి దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తే ఇంకొకరి చేతిలో చిక్కుకుంటాడు. ఈ ప్రమాదకర పరిస్థితులను దర్శకుడు పూర్తిగా సీరియస్‌గా కాకుండా కామెడీ టచ్‌తో చూపించడం ఆకట్టుకుంటుంది. గ్యాంబ్లర్ చేసిన ప్రతి ప్రయత్నం కొత్త సమస్యకు దారి తీస్తుంది. నేరస్థులతో కలిసి తిరుగుతున్నప్పటికీ అతడి లక్ష్యం మాత్రం పెద్ద గ్యాంగ్‌స్టర్ గా మారడం కాదు. తన జీవితాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నంలోనే మరిన్ని చిక్కుల్లో పడుతుంటాడు. ఒక్కో సమస్య నుంచి బయటపడటానికి వేసే ప్లాన్ మరో గందరగోళాన్ని తెస్తుంది.
ఈ క్రైమ్ గందరగోళం మధ్య తల్లి పాత్ర కథకు ఎమోషనల్ బేస్ గా నిలుస్తుంది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం హీరోకు ముఖ్యమైన విషయంగా మారుతుంది. ఒకవైపు డాన్ల ఒత్తిడి, మరోవైపు కుటుంబానికి ఇచ్చిన మాట… ఈ రెండు పరిస్థితుల మధ్య అతడు తీసుకునే నిర్ణయాలే కథను ఆసక్తికరంగా మారుస్తాయి.
ఇద్దరు డాన్ల మధ్య చిక్కుకున్న ఈ గ్యాంబ్లర్ చివరికి ఎలా బయటపడతాడు ? తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతడు ఏం చేస్తాడు ? డాన్లకు ఎదురు తిరిగేంత ధైర్యం అతడికి ఎక్కడి నుంచి వస్తుంది ? అతడి జూదం, క్రైమ్ ప్రపంచం, కుటుంబం మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఈ అరాచకానికి ముగింపు ఎలా ఉంటుంది ? అన్నది తెలుసుకోవాలని ఉంటే ఈ మూవీని చూడాల్సిందే.
ధనంజయ (Dhananjaya), పూర్ణచంద్ర మైసూరు (Poornachandra Mysuru), చి గురు దత్, నాగభూషణ తదితరులు నటించిన ‘మదర్ ప్రామిస్’కు పూర్ణచంద్ర మైసూరు దర్శకత్వం వహించారు. ఈ కన్నడ కామెడీ యాక్షన్ మూవీ అక్టోబర్ 2 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ ఆడియో మాత్రమే ఉంది.