Historical Action Movie OTT : దేశం కోసం పోరాడిన వ్యక్తినే ఒకరోజు పోలీసులు బందిపోటుగా వెతకాల్సిన పరిస్థితి వస్తే, అతని కథలో ఎన్నో ప్రశ్నలు దాగి ఉంటాయి. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలిచిన అనుభవం… స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అవినీతిపై మరో యుద్ధంగా మారుతుంది. ఒకప్పుడు విప్లవకారుడిగా గౌరవం పొందిన వ్యక్తి, ఆ తర్వాత నేరస్థుడనే ముద్రను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందనే కోణంలో సాగే బెంగాలీ చారిత్రక యాక్షన్ బయోపిక్ ‘కేయు బోలే బిప్లోబీ కేయు బోలే డాకాట్’ (Keu Bole Biplobi Keu Bole Dakat). ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
ఈ చిత్రం అనంత సింగ్ (Ananta Singh) జీవిత ప్రస్థానం ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారుల్లో ఆయన ఒకరు. మాస్టర్ దా సూర్యసేన్ (Master-da Surya Sen) నేతృత్వంలోని ఉద్యమంతో ఆయనకు సంబంధం ఉంది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై జరిగిన దాడిలో పాల్గొన్న విప్లవకారుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచింది. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన జీవితం మరో మలుపు తిరుగుతుంది.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారందరికీ ఆశించిన మార్పులు వెంటనే రాలేదు. సమాజంలో అవినీతి, అన్యాయం కొనసాగుతుండటంతో అనంత సింగ్ తనదైన మార్గంలో పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఈ క్రమంలో ఆయన చర్యలు వివాదాస్పదమవుతాయి. కొందరికి ఆయన అన్యాయంపై తిరుగుబాటు చేసిన వ్యక్తి; మరికొందరికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న బందిపోటు. 1960ల కలకత్తాలో వరుస దోపిడీలు పోలీసులను అప్రమత్తం చేస్తాయి. వాటి వెనుక అనంత సింగ్ ఉన్నాడని దర్యాప్తులో బయటపడటంతో అతని గతం, వర్తమానం ఒకదానితో ఒకటి ముడిపడతాయి.
బ్రిటిష్ పాలనలో దేశం కోసం పోరాడిన వ్యక్తి, స్వతంత్ర భారతదేశంలో ఎందుకు చట్టానికి ఎదురుగా నిలిచాడనే అంశం కథకు కేంద్రంగా మారుతుంది. ఇది కేవలం దొంగతనాలు, పోలీసుల వేటతో సాగే యాక్షన్ కథ కాదు. విప్లవం తర్వాత కూడా న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తే ఒక మనిషి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే అంశాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించారు. అసలు అతను హీరోనా, నేరస్థుడా అనే తీర్పును ప్రేక్షకుడికే వదిలేస్తుంది. అనంత సింగ్ ను దోపిడీల దారిలోకి నడిపించిన పరిస్థితులు ఏమిటి ? అతని పోరాటం నిజంగా అవినీతికి వ్యతిరేకమా ? విప్లవకారుడిగా మొదలైన ప్రయాణం బందిపోటు అనే ముద్రతో ఎందుకు ముగిసింది ? ఈ సంఘర్షణే ఈ సినిమాలో చూడాల్సిన ప్రధాన అంశం.
2026లో విడుదలైన ఈ బెంగాలీ యాక్షన్ బయోపిక్ కు పాథికృత్ బసు దర్శకత్వం వహించారు. జీత్, టోటా రాయ్ చౌధురి, కౌశిక్ సేన్ తదితరులు నటించారు. ఆగస్టు 14 నుంచి ZEE5లో అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాకి ఓటీటీలో బెంగాలీ ఆడియో ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.