Adventure Thriller Series OTT : సముద్ర ప్రయాణం, దాచి పెట్టిన నిధులు, ప్రమాదకరమైన సముద్రపు దొంగలు, నమ్మక ద్రోహాలు… ఈ అంశాలన్నీ కలిసిన సాహస కథలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ఓ యువకుడికి అనుకోకుండా నిధి ఉన్న మ్యాప్ దొరికితే, ఆ నిధి కోసం సముద్రంలోకి ప్రయాణం మొదలుపెడితే ? అతడితో కలిసి ప్రయాణించే వారిలో నిజంగా సహాయం చేసేవారు ఎవరు ? నిధి కోసం ఎప్పుడైనా వెన్నుపోటు పొడిచేవారు ఎవరు ? అనే విషయం తెలియకపోతే… ఇలాంటి ఉత్కంఠభరితమైన సాహసంతో రూపొందిన సిరీస్ ‘Treasure Island Season 1’. మరి ఈ ట్రెజర్ హంట్ సిరీస్ ను ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి చూడొచ్చు ? అంటే…
ఈ సిరీస్ ప్రసిద్ధ రచయిత రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ రాసిన Treasure Island నవల ఆధారంగా రూపొందింది. కథలో జిమ్ హాకిన్స్ అనే యువకుడు కీలక పాత్రలో కనిపిస్తాడు. తన తల్లి బెస్‌తో కలిసి జీవించే జిమ్‌కు ఓ అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. కెప్టెన్ ఫ్లింట్‌కు సంబంధించిన నిధి మ్యాప్ వారి చేతికి చిక్కుతుంది. ఆ మ్యాప్లో దాగి ఉన్న సమాచారం సాధారణ సంపదకు సంబంధించినది కాదు. దాని వెనుక సముద్రపు దొంగల ప్రపంచం, గతంలో జరిగిన రహస్యాలు, ప్రమాదకరమైన వ్యక్తుల కథ దాగి ఉంటాయి.
ఈ నిధి గురించి తెలుసుకున్న తర్వాత జిమ్ జీవితం పూర్తిగా మారిపోతుంది. మ్యాప్ లో చూపించిన ప్రదేశానికి చేరుకుని నిధిని కనుగొనాలనే ఆలోచన అతడిని సాహసయాత్ర వైపు నడిపిస్తుంది. ఈ ప్రయాణం కోసం హిస్పానియోలా అనే నౌకలో బయలుదేరుతారు. అయితే సముద్ర ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగదు. ప్రయాణంలో కలిసే ప్రతి వ్యక్తి వెనుక ఓ కథ ఉంటుంది. కొందరు నిజంగా సహాయం చేయాలనుకుంటారు. మరికొందరు నిధిని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఈ ప్రయాణంలో లాంగ్ జాన్ సిల్వర్ అనే వ్యక్తి పాత్ర ఎంతో కీలకం. అతడు అనుభవజ్ఞుడైన సముద్రపు దొంగ. బయటకు స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ, అతడి అసలు ఉద్దేశాల గురించి జిమ్‌కు పూర్తిగా తెలియదు. అతడిని నమ్మాలా వద్దా అనే సందేహం జిమ్‌ను వెంటాడుతుంది. మరోవైపు బిల్లీ బోన్స్, ఆరోన్ గ్రాహమ్ వంటి వ్యక్తుల పాత్రలు కూడా ప్రయాణంలో కీలకంగా మారతారు.
నిధి కోసం మొదలైన ఈ యాత్ర క్రమంగా ప్రాణాలకు తెగించే పోరాటంగా మారుతుంది. నౌకలో తిరుగుబాటు పరిస్థితులు ఏర్పడతాయి. ఒకరి మీద మరొకరికి నమ్మకం తగ్గిపోతుంది. నిధిని ఎవరు సొంతం చేసుకుంటారు అనే పోటీతో పాటు, ప్రాణాలతో బయటపడాలంటే ఎవరితో చేతులు కలపాలి అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. జిమ్ తన వయసుకు మించిన ధైర్యాన్ని చూపించాల్సి వస్తుంది. అతడు ఎదుర్కొనే ప్రమాదాలు, చేసే తప్పులు, నేర్చుకునే పాఠాలు అతడిని కొత్త వ్యక్తిగా మారుస్తాయి. నిధి నిజంగా ఎక్కడ ఉంది ? లాంగ్ జాన్ సిల్వర్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి ? ప్రయాణంలో జరిగే తిరుగుబాటు నుంచి జిమ్, అతడి తల్లి, సహచరులు బయటపడగలరా ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
Also Read : గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్
‘ట్రెజర్ ఐలాండ్ సీజన్ 1’లో టామ్ స్వీట్ జిమ్ హాకిన్స్ పాత్రలో, హేలీ అట్‌వెల్ బెస్ పాత్రలో, డేవిడ్ ఓయెలోవో లాంగ్ జాన్ సిల్వర్ పాత్రలో, జాక్ హస్టన్ ఆరోన్ గ్రాహమ్ పాత్రలో నటించారు. టోమర్ కపోన్ కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ 2026 అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో అందుబాటులో ఉంటుంది.