Kill Movie OTT: ఈ ఏడాది విడుదలయిన పలు బాలీవుడ్ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాయి. అందులో తాజాగా విడుదలయిన ‘కిల్’ కూడా ఒకటి. ఇండియాలో థియేటర్లలో విడుదల అవ్వకముందే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఫీచర్ అయ్యింది ఈ మూవీ. ఆ తర్వాత ఇండియాలో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అందుకే ‘కిల్’ను ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి నిర్మాతలు ఒప్పుకోలేదు. ఫైనల్‌గా ఇంతకాలం తర్వాత తాజాగా ఓటీటీలో విడుదలయ్యి సబ్‌స్క్రైబర్లను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యింది ‘కిల్’.
వైలెన్స్ మామూలుగా లేదు
నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించిన ‘కిల్’.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. దీంతో చాలామంది ప్రేక్షకులు ఇప్పటికే ఈ మూవీ స్ట్రీమ్ చేయడానికి సిద్ధమయ్యారు. పూర్తిగా వైలెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం.. యాక్షన్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్‌లో వైలెన్స్ చూపించలేదని ‘కిల్’ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందించారు. జులై 5న థియేటర్లలో విడుదలయ్యింది ‘కిల్’. మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మూడు నెలలలోపు దీనిని ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి మేకర్స్ ఒప్పుకోలేదు. అందుకే ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఇన్నిరోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.
Also Read: మోక్షజ్ఞ బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ మూవీ లుక్స్.. అదుర్స్ కదూ!
ఇద్దరూ ఇద్దరే
‘కిల్’తో లక్ష్య హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా తన లుక్స్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు లక్ష్య. ఇందులో లక్ష్యకు ధీటైన విలన్ రోల్‌లో కనిపించాడు రాఘవ్ జుయల్. ఇప్పటివరకు ఒక డ్యాన్సర్‌గా బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాఘవ్. అలాంటి తనలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడని ‘కిల్’ చూసేవరకు ఆడియన్స్ ఊహించలేదు. అలా లక్ష్య, రాఘవ్.. తమ నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. హీరోయిన్‌గా తాన్యా మనిక్తాలా కూడా తన పాత్రలో మెరిసింది. స్క్రీన్ పై తను కనిపించేది కాసేపే అయినా తన పాత్ర ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా చేసింది తాన్యా.
కరణ్ జోహార్ మహిమ
భారీ బడ్జెట్‌తో ‘కిల్’ను నిర్మించడానికి బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ముందుకొచ్చాడు. ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టడంతో పాటు ముందుగా ఫారిన్‌లోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా స్క్రీనింగ్స్‌ను ఏర్పాటు చేసి దీనికి హైప్ క్రియేట్ అయ్యేలా చేశాడు. అందుకే ఇండియాలో థియేటర్లలో విడుదల అవ్వకముందే ‘కిల్’ గురించి చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసింది. కరణ్ జోహార్‌తో పాటు గునీత్ మోంగా, అపూర్వ మెహతా, అచిన్ జైన్ కూడా ‘కిల్’ నిర్మాణంలో భాగమయ్యారు. ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండగా.. ఇండియాలో మాత్రం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.