OTT Movie : ఎప్పటి నుంచో స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ నే భావన అందరిలో ఉండి పోయింది. శారీరకంగా కొంచెం స్త్రీలు బాలహీనులు కావడంతో ఇప్పటికీ స్త్రీలను చిన్నచూపును చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ స్త్రీలు సమాజంలో ఎదుర్కొనే లింగ వివక్షత, ఒత్తిడి, వ్యక్తిగత గుర్తింపు కోల్పోవడం వంటి అంశాలను లోతుగా చూపిస్తుంది. ఇది దక్షిణ కొరియాలోని సాంప్రదాయక విలువల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘కిమ్ జి యంగ్ బార్న్ 1982’ (Kim Ji young : Born 1982). ఈ సినిమా దక్షిణ కొరియా లో 2019లో విడుదలైన ఒక డ్రామా మూవీ. దీనిని చో నం-జూ రాసిన మిలియన్-సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో జంగ్ యూ-మీ (కిమ్ జీ-యంగ్‌గా), గాంగ్ యూ (జంగ్ డే-హ్యూన్‌గా) నటించారు. ఈ మూవీకి కిమ్ డో యంగ్‌కి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
కిమ్ జీ-యంగ్ అనే ఒక సాధారణ మహిళ 30 ఏళ్ల వయసులో ఉంటుంది. తన భర్త జంగ్ డే-హ్యూన్‌తో కలిసి ఒక కుమార్తెను పెంచుతూ గృహిణిగా జీవిస్తుంది. కిమ్ జీ-యంగ్ తన రోజువారీ గృహ పనులు చేస్తూ కనిపిస్తుంది. ఇంటి పనులతో విసిగి పోయి గతాన్ని గుర్తు చేసుకుటుంది. ఆమె గతంలో మార్కెటింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆ సమయంలో తన కెరీర్‌లో సంతోషంగా ఉండేదని ఫ్లాష్‌బ్యాక్ తలుచుకుంటూ ఉంటుంది. అయితే, కుమార్తె పుట్టిన తర్వాత ఆమె ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఆ తరువాత జీ-యంగ్‌లో ఒక వింత పరిస్థితి కనిపిస్తుంది. ఆమె ఒక్కోసారి తన తల్లి, అమ్మమ్మలా మాట్లాడుతూ, వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆమె వారి స్వరాలను, మాటలను అనుకరిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఒత్తిడి, అసంతృప్తి ఉన్న సమయాల్లో జరుగుతుంది. ఆమె అత్తగారి ఇంటికి వెళ్లినప్పుడు, డే-హ్యూన్ ఎదురుగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ విచిత్రమైన ప్రవర్తన ఆమెకు తెలియకుండానే జరుగుతుంది.
దీనిని గమనించిన డే-హ్యూన్ ఆమెకు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించమని సూచిస్తాడు. అయితే సెషన్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని తెలిసి జీ-యంగ్ అందుకు ఒప్పుకోదు. ఈ సమస్యల వెనుక ఆమె జీవితంలోని ఒత్తిడి, అసంతృప్తి ఉంటుంది. గృహిణిగా ఉంటూ ఆమె మళ్లీ పని చేయాలని ఆలోచిస్తుంది. తన పాత సీనియర్ అయిన టీమ్ లీడర్ కిమ్‌ని సంప్రదిస్తుంది. ఆమె ఇప్పుడు సొంత మార్కెటింగ్ సంస్థను నడుపుతూ ఉంటుంది.
డే-హ్యూన్, జీ-యంగ్‌కి పని ఎంత ముఖ్యమో అర్థం చేసుకుని, ఆమెను తిరిగి ఉద్యోగంలో చేరమని ప్రోత్సహిస్తాడు. అంతేకాదు, తాను ఒక సంవత్సరం పాటు పేరెంటల్ లీవ్ తీసుకుని, కుమార్తెను చూసుకుంటానని కూడా చెబుతాడు. ఈ నిర్ణయంతో జీ-యంగ్ సంతోషంగా పనిలో చేరుతుంది. కొన్ని రోజులకు ఆమె వింత ప్రవర్తనలు పూర్తిగా తగ్గుతాయి. ఆమె మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. సినిమా చివరలో, జీ-యంగ్ ఒక డెస్క్ వద్ద కూర్చుని తన ఆత్మకథ రాయడం ప్రారంభిస్తుంది.