Hyderabad Metro Rail: హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న సుమారు 500 మంది బాధితులకు రూ. 200 కోట్లకు పైగా చెక్కులు అందజేశారు. చదరపు గజానికి రూ.81,000 నుంచి రూ. 1,00,000 వరకు పరిహారం అందిస్తున్నారు. పునరావాసం కోసం కూడా ఆర్థికసాయం అందిస్తున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో కూల్చివేత ప్రక్రియ కాస్త నెమ్మదిగా కొనసాగుతోంది. విస్తరణ కోసం గుర్తించిన నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లోనే మెట్రోకు అవసరమైన భూమిని సేకరించి మెట్రో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో 8 నెలల్లో ఈ పనులు షురూ అయ్యే అవకాశం ఉంది.
భూ సేకరణకు సుమారు రూ. 1,000 కోట్లు
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 11,00 ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 980 నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఈ పరిధిలో భూసేకరణకు సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. భూ సేకరణ చట్టానికి అనుగుణంగా ఆస్తులకు పరిహారం చెల్లిస్తున్నారు మెట్రో రైలు అధికారులు. మెట్రో నిర్మాణంలో భాగంగా మతపరమైన, ఆధ్యాత్మిక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా నివాసాలు, దుకాణాలు మాత్రమే తొలగిస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన 980 నిర్మాణాల్లో 400 నిర్మాణాలకు నోటీసులు అందజేశారు. 325 మంది కూల్చివేతకు ఒప్పుకున్నారు. వాటిలో 216 ఆస్తులకు పరిహారం ప్రకటించారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు..
మెట్రో రెండు దశలోని మొదటి ఐదు లైన్లను నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని మెట్రో సంస్థ భావిస్తోంది. రెండో దశలో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ప్రధానమైన పనులను చేపట్టేందుకు అనుగుణంగా ఆస్తుల సేకరణతో పాటు రోడ్డు విస్తరణ పనులపై దృష్టిసారించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర ఈ పనులు కొనసాగుతున్నాయి.
Read Also: దశాబ్దాలుగా ఫ్రీ ఫుడ్ అందిస్తున్న ఈ రైలు గురించి మీకు తెలుసా?
పాతబస్తీ మెట్రో నిర్మాణ ఖర్చు ఎంత?
పాతబస్తీ మెట్రోకు సంబంధించి రెండో దశలో మొదటి 5 కారిడార్లకు రూ.24,269 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారికి చెల్లించేపరిహారం కాకుండా సుమారు రూ.2,714 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశారు. మెట్రో నిర్మాణంతో పాతబస్తీ ఆకర్షణీయంగా మారడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మరోవైపు మెట్రో కారణంగా తమ దుకాణాలు పోయి ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Also: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, విశాఖ, విజయవాడ మెట్రో ప్లాన్ కు నిధులు మంజూరు!
Read Also: ఆకట్టుకునే జలపాతాలు, ఆహా అనిపించే మంచుకొండలు.. జీవితంలో ఒక్కసారైనా ఈ రైలు ప్రయాణాలు చేయాల్సిందే!