Korean Horror Comedy: చూడటానికి భయంకరంగా కనిపించే ఇద్దరు వ్యక్తులు… వాళ్ళను చూస్తే రౌడీలే అనుకుంటారు. కానీ వాళ్లు చేసిన మంచి పనినే అందరూ కిడ్నాప్‌గా భావిస్తే ? అదే అపార్థం ఒక్కసారిగా వరుస ప్రమాదాలకు దారి తీస్తే ? ఇలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన కొరియన్ కామెడీ చిత్రమే ‘హ్యాండ్సమ్ గైస్ (Handsome Guys)’. హారర్, కామెడీ, యాక్షన్, అపార్థాల చుట్టూ తిరిగే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఆసక్తికరంగా నడుస్తుంది. ప్రతి సన్నివేశం ఊహించని మలుపుతో సాగుతుండటంతో తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది. మరి ఇంతటి ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
జే-పిల్, సాంగ్-గు ఇద్దరూ ప్రాణ స్నేహితులు. చూస్తే చాలా భయంకరంగా కనిపిస్తారు. కానీ నిజానికి వాళ్లు ఎంతో అమాయకులు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతంగా ఉండాలని ఒక పాత ఇంటిని కొని, అక్కడికి వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఒకరోజు మీనా అనే కాలేజ్ విద్యార్థిని ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతుంది. వెంటనే ఆమెను కాపాడిన జే-పిల్, సాంగ్-గు చికిత్స కోసం తమ ఇంటికి తీసుకెళ్తారు. కానీ అక్కడి నుంచే అసలు గందరగోళం మొదలవుతుంది.
ఇద్దరి భయంకరమైన రూపాన్ని చూసిన మీనా స్నేహితులు, స్థానిక పోలీసులు ఆమెను వీళ్లే కిడ్నాప్ చేశారని అనుమానిస్తారు. ఆమెను రక్షించాలనే ఉద్దేశంతో అందరూ ఆ ఇంటి వైపు పరుగులు తీస్తారు. అయితే అక్కడ జరిగే ప్రతి సంఘటన అనుకోకుండా మారిపోతుంది. మీనాను కాపాడటానికి వచ్చిన వాళ్లే ఒక్కొక్కరిగా ప్రమాదాలకు గురవుతుంటారు. జే-పిల్, సాంగ్-గు ఎలాంటి తప్పూ చేయకపోయినా, జరిగిన ప్రతి ఘటనకు వాళ్లే కారణమని అందరూ భావించడం నవ్వు తెప్పిస్తుంది.
ఇంతలో ఆ పాత ఇంటి నేలమాళిగలో దాగి ఉన్న మరో భయంకరమైన రహస్యం బయట పడుతుంది. ఎన్నో ఏళ్లుగా అక్కడ బంధించబడిన ఒక దుష్టశక్తి మేల్కొనడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఒకవైపు తమపై పడిన నేరారోపణల నుంచి తప్పించుకోవాలి… మరోవైపు ఆ దుష్టశక్తిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి జే-పిల్, సాంగ్-గు తాము నిర్దోషులము అని నిరూపించుకోగలిగారా ? మీనాకు నిజం తెలిసిందా ? ఆ ఇంట్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి ? దుష్టశక్తిని ఎలా ఎదుర్కొన్నారు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఈ చిత్రంలో అపార్థాల చుట్టూ నడిచే కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అదే సమయంలో హారర్ అంశాలను కూడా సరదాగా చూపించిన తీరు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇందులో నవ్వులు, ఉత్కంఠ, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.
‘హ్యాండ్సమ్ గైస్’ సినిమాలో లీ సంగ్-మిన్, లీ హీ-జూన్, గాంగ్ స్యుంగ్-యాన్, పార్క్ జి-హ్వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నామ్ డాంగ్-హ్యుప్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆప్షన్ ఉంది. లాజిక్ కంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే హారర్ కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఇది సూపర్ ఆప్షన్. ఒకసారి సినిమా మొదలుపెడితే, ప్రతి అపార్థం ఎలా పెద్ద గందరగోళంగా మారుతుందో చూస్తూ చివరి వరకు నవ్వకుండా ఉండలేరు.
Read Also: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న తెలుగమ్మాయి ‘ఇల్లరికం’ కామెడీ మూవీ.. ఎందులో చూడొచ్చంటే?