Action Spy Thriller OTT : చిన్నప్పుడు స్నేహితులతో కలిసి గడిపిన రోజులు, చేసిన అల్లరి, కలిసి చూసిన కలలు పెద్దయ్యాక కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. కానీ ఎన్నో ఏళ్ల తర్వాత పాత స్నేహితులంతా మళ్లీ కలిసినప్పుడు, ఆ కలయిక ఓ ప్రమాదకరమైన అంతర్జాతీయ మిషన్ కు దారి తీస్తే? సాధారణంగా కనిపించే ఓ వ్యక్తి నిజానికి రహస్య గూఢచారి అని తెలిసి, అతడి స్నేహితులంతా ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తే ? ఇలాంటి థ్రిల్లింగ్ స్టోరీ లైన్ కు యాక్షన్, కామెడీని కలగలిపి రూపొందించిన చిత్రమే ‘Matchbox The Movie’. మరి ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు అంటే…
ఈ సినిమాలో సీన్ వాకర్ అనే వ్యక్తి ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. బయటకు నార్మల్ వ్యక్తిలా కనిపించే సీన్, నిజానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన రహస్య ఏజెంట్. తన పనిలో భాగంగా అతడు అనేక ప్రమాదకరమైన మిషన్లలో పాల్గొంటూ ఉంటాడు. గూఢచారి జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేం. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని అనుమానించాలి అనే విషయాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
ఒక దశలో సీన్ తన స్వస్థలానికి తిరిగి వస్తాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితులైన క్రాస్బీ, టెడ్, చార్మేన్‌లను మళ్లీ కలుసుకుంటాడు. చాలా కాలం తర్వాత స్నేహితులంతా ఒకచోట చేరడంతో మొదట సరదా వాతావరణం నెలకొంటుంది. పాత జ్ఞాపకాలు, చిన్ననాటి అనుభవాలు, ఒకరిపై మరొకరికి ఉన్న అనుబంధం వారి మధ్య మళ్లీ చిగురిస్తాయి. కానీ సీన్ జీవితంలో దాగి ఉన్న అసలు విషయం బయటపడిన తర్వాత ఈ మీటింగ్ ఊహించని మలుపు తిరుగుతుంది.
సీన్ గూఢచారి కావడంతో అతడికి సంబంధించిన ఓ అంతర్జాతీయ కుట్రలో అతడి స్నేహితులు కూడా చిక్కుకుంటారు. మొదట పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో వారికి పూర్తిగా అర్థం కాదు. కానీ క్రమంగా వారు ఎదుర్కొంటున్నది సాధారణ సమస్య కాదని తెలుస్తుంది. తమకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టిన స్నేహితులు, ప్రాణాలను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా ప్రపంచాన్ని ప్రమాదం నుంచి రక్షించడానికి కూడా పోరాడాల్సి వస్తుంది.
ఇక్కడ సీన్‌కు తన వృత్తిపరమైన నైపుణ్యం ఎంత అవసరమో, స్నేహితుల సహకారం కూడా అంతే అవసరం. ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించరు. భయపడేవారు ఉంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు ఉంటారు, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యం చూపేవారు కూడా ఉంటారు. ఇలాంటి భిన్నమైన స్వభావాల మధ్య సమన్వయం సాధించడం సీన్‌కు మరో సవాలుగా మారుతుంది.
ఈ మిషన్‌లో ఏమీ తెలియని స్నేహితులు తమ తెలివితేటలను ఉపయోగించి ఎలా ముందుకు సాగుతారు ? సీన్ తన రహస్య బాధ్యతను పూర్తి చేస్తాడా ? అంతర్జాతీయ కుట్ర వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు ? స్నేహితుల మధ్య ఉన్న అనుబంధం ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో ఎంతవరకు సహాయపడుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను మిస్ అవ్వొద్దు.
Also Read : గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్
‘మ్యాచ్ బాక్స్ ది మూవీ’ జాన్ సీనా సీన్ వాకర్ పాత్రలో నటించగా, సామ్ రిచర్డ్‌సన్, ఆర్టురో కాస్ట్రో, టియోనా పారిస్, జెస్సికా బీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సామ్ హార్గ్రేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా Matchbox బొమ్మల కార్ల బ్రాండ్ నుంచి ప్రేరణ పొందింది. 2026 అక్టోబర్ 9 నుంచి Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.