Mountain Adventure Documentary: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో అది కూడా ఒకటి… మంచు, గాలులు, ఊహించని వాతావరణం మధ్య శిఖరాన్ని చేరాలనే పట్టుదల… అది కూడా శీతాకాలంలో. 2021లో కె2పై శీతాకాలంలో తొలిసారి శిఖరాన్ని అధిరోహించాలనే ప్రయత్నం చుట్టూ జరిగిన నిజమైన సంఘటనలను తెరపైకి తీసుకొచ్చిన డాక్యుమెంటరీ ‘ది లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2’ (The Last First: Winter K2). ఇది కేవలం పర్వతారోహణ కథ కాదు. విజయం కోసం మనిషి ఎంతటి ప్రమాదాన్నైనా ఎలా ఎదుర్కొంటాడో చూపించే గుండె జారిపోయే ప్రయాణం. మరి కె2 శిఖరంపై చేసిన ఆ చారిత్రాత్మక ప్రయత్నంలో ఏం జరిగింది ? అంటే…
కె2 ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం. అయితే దాని ఎత్తు కంటే ప్రమాదకరమైనది అక్కడి వాతావరణం. ముఖ్యంగా శీతాకాలంలో అక్కడి పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి. అలాంటి సమయంలో కె2 శిఖరాన్ని అధిరోహించడం దాదాపు అసాధ్యమైన సవాలు అని చెప్పవచ్చు. 2021లో ఐస్లాండ్‌కు చెందిన జాన్ స్నోరి సిగుర్జోన్సన్ (John Snorri Sigurjónsson), పాకిస్థాన్‌కు చెందిన అలీ సద్ఫారా (Ali Sadpara), అతడి కుమారుడు సజిద్ సద్ఫారా (Sajid Sadpara) కలిసి శీతాకాలంలో కె2 శిఖరాన్ని చేరాలనే ప్రయత్నం చేస్తారు.
ఇదే సమయంలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ పర్వతారోహకులు కూడా అదే ప్రాంతంలో ఉంటారు. నిమ్స్ పుర్జా (Nirmal “Nims” Purja) నేతృత్వంలోని నేపాలీస్ టీమ్, వాణిజ్య పర్వతారోహణ బృందాలు, సోషల్ మీడియా కోసం ఈ సాహసాన్ని చిత్రీకరించే టీమ్ లు కూడా అక్కడే ఉంటాయి. దీంతో ఒకే శిఖరాన్ని చేరాలనే లక్ష్యంతో అనేక బృందాలు ఒకే ప్రాంతంలో పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కె2 ఎవరినీ వదిలి పెట్టదు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, మంచు తుఫాన్లు, ప్రమాదకరమైన మార్గాలు, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఒక్కో అడుగులో ఎదురవుతాయి.
ఈ డాక్యుమెంటరీలో పర్వతారోహణ వెనుక ఉన్న మరో కోణాన్ని కూడా చూపిస్తారు. ఎవరు ముందుగా శిఖరాన్ని చేరతారు అనే పోటీ మాత్రమే కాదు… ఈ సాహసాన్ని ఎవరు డబ్బుతో సాధిస్తున్నారు ? ఎవరు ఎన్నో సంవత్సరాలుగా ఇతరుల కోసం పని చేస్తూ ఇప్పుడు తమ పేరును చరిత్రలో నిలబెట్టుకోవాలని చూస్తున్నారు ? సోషల్ మీడియా ప్రభావం ఈ ప్రమాదకరమైన క్రీడను ఎలా మార్చింది ? అనే ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఎవరికి తెలియని పరిస్థితుల్లో కె2పై తీసిన అసలైన ఫుటేజ్, పర్వతారోహకుల అనుభవాలు, వారి కుటుంబాల భావోద్వేగాలు కలిసి ఈ డాక్యుమెంటరీని మరింత ప్రభావవంతంగా మారుస్తాయి.
ఈ యాత్రలో చారిత్రాత్మక విజయం ఒకవైపు ఉండగా, ప్రాణాలను కోల్పోయిన పర్వతారోహకుల విషాదం మరోవైపు నిలుస్తుంది. కె2 శిఖరాన్ని చేరాలనే ఈ పోటీలో చివరికి ఎవరు విజయం సాధించారు ? మంచు పర్వతం ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంది ? జాన్ స్నోరి, అలీ సద్ఫారా, సజిద్ సద్ఫారా ప్రయాణం ఎక్కడ ఆగిపోయింది ? చరిత్రలో నిలిచిన ఆ శీతాకాలపు అధిరోహణ వెనుక దాగి ఉన్న విషాదం ఏంటి ? ప్రపంచం చూసిన విజయానికి వెనుక అసలు ఎవరి త్యాగం ఉంది ? కె2పై జరిగిన ఆ చివరి ప్రయాణం అసలు ఎలా ముగిసింది ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ డాక్యుమెంటరీని డోంట్ మిస్.
అమీర్ బార్-లెవ్ (Amir Bar-Lev) దర్శకత్వం వహించిన ‘ది లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2’ డాక్యుమెంటరీ 2021 కె2 శీతాకాల యాత్ర కేంద్రంగా రూపొందింది. అక్టోబర్ 2 నుంచి యాపిల్ టీవీ (Apple TV)లో ఇంగ్షీషులో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: కుక్కను వెతుక్కుంటూ వెళ్లిన బాలుడికి ఊహించని వ్యక్తి జాడ దొరికితే… ఓటీటీలోకి డిఫరెంట్ మిస్టరీ మూవీ