Mourinho Documentary on OTT: ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆయనను అభిమానించే వాళ్లు ఎంతమంది ఉన్నారో… విమర్శించే వాళ్లు కూడా అంతే మంది ఉంటారు. కానీ జోసే మౌరిన్హో పేరు వినగానే ఫుట్‌బాల్ అభిమానులకు గుర్తొచ్చేది మాత్రం ఒకటే.. విజయాన్ని తనదైన స్టైల్లో సాధించే ‘ది స్పెషల్ వన్’. ఇప్పుడు ఈ దిగ్గజ కోచ్ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు, కెరీర్‌లోని కీలక మలుపులు, ఫుట్‌బాల్ దిగ్గజాలతో ఉన్న సంబంధాల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ఫుట్‌బాల్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన, అదే సమయంలో అత్యంత వివాదాస్పద మేనేజర్లలో ఒకరైన జోసే మౌరిన్హో జీవితంపై రూపొందిన స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్ ‘MOURINHO’. మరి ఫుట్ బాల ప్రియులు ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను ఏ ఓటీటీలో వీక్షించవచ్చు ? అనేది చూద్దాం పదండి.
మౌరిన్హో కెరీర్‌లో ఎన్నో విజయాలు ఉన్నాయి. కానీ ఆ విజయాల వెనుక ఉన్న ఆలోచనలు, నిర్ణయాలు, మైండ్ గేమ్స్ గురించి బయట ప్రపంచానికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో మౌరిన్హో స్వయంగా తన కెరీర్‌లోని కీలక సంఘటనలను గుర్తు చేసుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అందులో ముఖ్యంగా 2013లో జరిగిన మ్యాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్ పదవి అంశం ఆసక్తికరంగా ఉంటుంది. సర్ అలెక్స్ ఫెర్గూసన్ రిటైర్ అయిన తర్వాత ఆయన స్థానంలో మౌరిన్హోను తీసుకురావాలనే ఆలోచన జరిగింది. మౌరిన్హో కూడా తొలుత ఆ అవకాశానికి అంగీకరించినట్లు చెబుతారు. అయితే రియల్ మాడ్రిడ్‌ను వీడిన తర్వాత తనకు అభిమానం, ప్రేమ లభించే క్లబ్‌కు వెళ్లాలని భావించి చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు.
ఇక క్రిస్టియానో రొనాల్డోతో మౌరిన్హోకు ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా ఇందులో కనిపిస్తుంది. రొనాల్డో స్పోర్టింగ్ సీపీ తరఫున తన ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన సమయంలో ధరించిన తొలి జెర్సీని మౌరిన్హో తన వ్యక్తిగత లాకర్‌లో భద్రంగా ఉంచుకున్న విషయాన్ని కూడా ఈ సిరీస్ ప్రస్తావిస్తుంది. రియల్ మాడ్రిడ్‌లో రొనాల్డోతో కలిసి పనిచేసిన రోజుల గురించి కూడా మౌరిన్హో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.
అయితే మౌరిన్హోను ప్రపంచవ్యాప్తంగా ‘ది స్పెషల్ వన్’గా మార్చిన అసలు కథ కూడా ఈ డాక్యుమెంటరీలో కీలకంగా ఉంటుంది. పోర్టోను ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిపిన తర్వాత ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన సమయంలో మీడియా ఆయనకు ఆ పేరు పెట్టింది. ఆ పేరు ఎలా తన బ్రాండ్‌గా మారింది, తనపై ఉన్న అంచనాలను ఎలా ఎదుర్కొన్నారనే విషయాలను మౌరిన్హో వివరిస్తారు.
ఇక సర్ అలెక్స్ ఫెర్గూసన్, జినెడిన్ జిదాన్, జ్లాటన్ ఇబ్రహిమోవిచ్, జాన్ టెర్రీ, ఫ్రాంక్ లాంపార్డ్, డిడియర్ డ్రోగ్బా, ఇకర్ కాసిల్లాస్ వంటి ఫుట్‌బాల్ దిగ్గజాల ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌కు మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. మౌరిన్హో వ్యూహాలు, మైండ్ గేమ్స్, నాయకత్వ శైలి గురించి తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఫుట్ బాల్ లవర్స్ ఖచ్చితంగా ఈ సిరీస్ ను చూడాల్సిందే.
ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం Netflixలో మూడు ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఫుట్‌బాల్‌ను కేవలం ఆటగా కాకుండా, దాని వెనుక ఉండే డ్రామా, వ్యూహాలు, క్లబ్ రాజకీయాలు, మేనేజర్ల మైండ్‌సెట్‌ను కూడా ఆసక్తిగా చూసేవారికి ఈ డాక్యుమెంటరీ మంచి వీకెండ్ వాచ్ అవుతుంది. ఆగస్టు 11 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ లిమిటెడ్ సిరీస్ ను… Beckham’ డాక్యుమెంటరీని నిర్మించిన వెంచర్‌ల్యాండ్ సంస్థ రూపొందించింది. జో పెర్ల్‌మన్ దర్శకత్వం వహించారు. ఇది కేవలం ఒక ఫుట్‌బాల్ కోచ్ జీవితకథ మాత్రమే కాదు. విజయాల వెనుక ఉన్న మానసిక పోరాటం, క్లబ్ రాజకీయాలు, ఆటగాళ్లతో సంబంధాలు, మీడియాతో మైండ్ గేమ్స్, ఒక మేనేజర్ తీసుకునే కఠినమైన నిర్ణయాల గురించి కూడా చూపించే డాక్యుమెంటరీగా నిలుస్తుంది.
Read Also: తలుపులు తెరవలేరు… బయట అడుగుపెడితే బతకలేరు… తెలుగులోనే ఈ సై-ఫై సర్వైవల్ థ్రిల్లర్