Action Comedy Thriller OTT : ఒకరికి ఒకరు పూర్తిగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో భార్యాభర్తలుగా జీవించాల్సి వస్తే ఎలా ఉంటుంది ? పైగా అది సాధారణ ఉద్యోగం కాదు… రహస్య గూఢచారి సంస్థ కోసం ప్రమాదకరమైన మిషన్లు పూర్తి చేయాల్సిన పని. బయట ప్రపంచానికి వారు ఆదర్శ దంపతుల్లా కనిపించాలి. ఇంట్లో మాత్రం ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ, తమ రహస్యాలను దాచుకుంటూ ముందుకు సాగాలి. ఈ క్రమంలో నిజంగానే ప్రేమ పుడితే ? ఇలాంటి ఆసక్తికరమైన మలుపులతో రూపొందిన యాక్షన్ కామెడీ సిరీస్ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ (Mr & Mrs Smith). మరి ఈ ఇంట్రస్టింగ్ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
జాన్ స్మిత్, జేన్ స్మిత్ అనే ఇద్దరు వ్యక్తులకు తమ జీవితాలను మార్చుకునే అవకాశం వస్తుంది. ఒక రహస్య సంస్థ వారిని గూఢచారులుగా నియమిస్తుంది. అయితే ఈ ఉద్యోగానికి ఒక ప్రత్యేకమైన షరతు ఉంటుంది. వారు కొత్త గుర్తింపులతో జీవించాలి. అంతేకాదు, భార్యాభర్తలుగా నటిస్తూ ఒకే ఇంట్లో ఉండాలి. బయటివారికి వారి బంధం నిజమైన వివాహంలా కనిపించాలి. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి పరిచయం ఉండదు.
ఈ కొత్త జీవితంలో వారికి విలాసవంతమైన ఇల్లు, ప్రయాణాలు, మంచి సౌకర్యాలు లభిస్తాయి. వాటికి ప్రతిఫలంగా సంస్థ అప్పగించే ప్రమాదకరమైన పనులను పూర్తి చేయాలి. ప్రతి మిషన్‌కు ప్రత్యేక లక్ష్యం ఉంటుంది. అనుమానితులను గమనించడం, రహస్య సమాచారాన్ని సేకరించడం, ప్రమాదకరమైన వ్యక్తులను ఎదుర్కోవడం వంటి పనులు వారి దినచర్యలో భాగమవుతాయి. అయితే ఏ పని కూడా వారు ఊహించినంత సులభంగా ముగియదు.
మిషన్ల మధ్య జాన్, జేన్ తమ ఇంటి జీవితాన్ని కూడా సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చకపోవచ్చు. నిర్ణయాలు తీసుకునే విధానంలో తేడాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు పని విషయంలో వారి అభిప్రాయాలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. అయినప్పటికీ ఒకే బృందంగా పని చేయాల్సి రావడంతో పరస్పరం అర్థం చేసుకోవడం తప్పనిసరి అవుతుంది.
కాలం గడిచేకొద్దీ వారి మధ్య పరిచయం పెరుగుతుంది. మిషన్లలో ఒకరిపై మరొకరు ఆధార పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రమాద సమయంలో చూపించే ధైర్యం, కష్టాల్లో ఇచ్చే తోడ్పాటు వారి బంధాన్ని మార్చడం మొదలు పెడతాయి. మొదట నటనగా ప్రారంభమైన దాంపత్యం క్రమంగా నిజమైన భావోద్వేగాలకు దగ్గరవుతుంది. కానీ గూఢచారి ప్రపంచంలో నమ్మకం ఎంత ముఖ్యమో, అదే సమయంలో ఎంత ప్రమాదకరమో కూడా వారు తెలుసుకుంటారు.
వారి ఉద్యోగంలో విఫలమైతే పరిణామాలు తీవ్రమవుతాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరిగినా, తదుపరి మిషన్‌ను పూర్తి చేయాల్సిందే. మరోవైపు తమకు అప్పగించిన పనుల వెనుక సంస్థ ఉద్దేశం ఏమిటనే సందేహాలు కూడా తలెత్తుతాయి. ఇతర గూఢచారి జంటలతో ఎదురయ్యే పరిచయాలు పరిస్థితులను మరింత గందరగోళం చేస్తాయి. మరి ఇంతకీ వీళ్ళిద్దరూ కలిసి చేపట్టిన మిషన్లు ఏంటి ? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా ? జాన్, జేన్ నిజమైన దంపతులుగా మారగలరా? వారి ఉద్యోగంలో దాగి ఉన్న ప్రమాదాలు ఎంత దూరం వెళ్తాయి? ఒకరిపై మరొకరు పెట్టుకున్న నమ్మకం చివరకు వారిని కాపాడుతుందా, లేక అదే వారికి సమస్యగా మారుతుందా? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’ 2024లో విడుదలైన ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఓటీటీలో తెలుగు ఆడియో ఉంది. డొనాల్డ్ గ్లోవర్, మాయా ఎర్స్‌కిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్, జంటల మధ్య సరదా గొడవలు, అనూహ్యమైన మలుపులు ఇష్టపడేవారు ఈ సిరీస్ డోంట్ మిస్.