Period Drama Series on OTT : సమాజం చెప్పిన దారిలో నడిస్తే కోట్ల ఆస్తి, విలాసవంతమైన జీవితం ఆమె సొంతం అయ్యేది. కానీ తన కల కోసం ఆ సంపదనే కాదని చెప్పిన ఓ యువతి కథే ‘మై బ్రిలియంట్ కెరీర్’ (My Brilliant Career). 1900ల నాటి ఆస్ట్రేలియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో 6 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ నవల ఆధారంగా రూపొందిన ఈ కథలో ప్రేమ, పెళ్లి, మహిళా స్వాతంత్ర్యం, కెరీర్ అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం పదండి.
1900ల నాటి ఆస్ట్రేలియా నేపథ్యంలో కథ సాగుతుంది. సిబిల్లా మెల్విన్ పేద రైతు కుటుంబానికి చెందిన తెలివైన, స్వతంత్ర భావాలు ఉన్న యువతి. ఆ కాలంలో అమ్మాయిలకు మంచి పెళ్లి చేసుకుని భర్త, కుటుంబాన్ని చూసుకోవడమే జీవిత లక్ష్యంగా భావించేవారు. కానీ సిబిల్లా ఆ ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తన జీవితాన్ని తనకు నచ్చినట్లు గడపాలని, ముఖ్యంగా ఒక గొప్ప రచయిత్రిగా పేరు సంపాదించాలని కలలు కంటుంది.
అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమెకు ఆ స్వేచ్ఛను ఇవ్వవు. ఇలాంటి సమయంలో సిబిల్లా సంపన్నమైన అమ్మమ్మ ఆమెను తన గ్రాండ్ ఎస్టేట్‌కు తీసుకెళ్తుంది. అక్కడ సిబిల్లా జీవితాన్ని మార్చే మరో ప్రపంచాన్ని చూస్తుంది. విలాసవంతమైన జీవితం, పెద్ద ఇల్లు, డబ్బు, సమాజంలో గౌరవం అన్నీ ఆమె కళ్లముందు కనిపిస్తాయి. అదే సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సంపన్నుడు హ్యారీ బీచమ్ సిబిల్లాపై ఆసక్తి చూపిస్తాడు. అందంగా, తెలివిగా ఉండే హ్యారీ ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు.
ఆ పెళ్లికి సిబిల్లా అంగీకరిస్తే ఆమెకు జీవితాంతం ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. కుటుంబం కూడా ఆమె భవిష్యత్తు సురక్షితమైందని భావిస్తుంది. కానీ సిబిల్లా మనసులో మాత్రం మరో ఆలోచన ఉంటుంది. డబ్బు, ఆస్తి, విలాసవంతమైన జీవితం కోసం పెళ్లి చేసుకుంటే తన రచయిత్రి కావాలనే కలను వదులుకోవాల్సి వస్తుందని ఆమె భయపడుతుంది. ఒక మహిళ తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకోవచ్చని నిరూపించాలనుకుంటుంది.
అందుకే అందరూ ఊహించినట్లు కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుని సుఖంగా జీవించడానికి బదులుగా, తన స్వేచ్ఛను, తన కలలను ఎంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడే సిరీస్ లో అసలు ఆసక్తి మొదలవుతుంది. ప్రేమ ఒకవైపు, సంపద మరోవైపు, తన కెరీర్, స్వాతంత్ర్యం మరోవైపు నిలిచినప్పుడు సిబిల్లా చివరకు ఏ నిర్ణయం తీసుకుంది ? ఆమె తీసుకున్న నిర్ణయం తర్వాత హ్యారీతో ఆమె బంధం ఎలాంటి మలుపులు తిరిగింది? తన రచయిత్రి కావాలనే కలను నిజం చేసుకోగలిగిందా ? అనేదే మిగిలిన కథ.
Also Read : ఈ బొమ్మను ముట్టుకుంటే బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందే… సీల్ తొలగించగానే మారణహోమం… తెలుగులో స్ట్రీమింగ్
ఫిలిప్పా నార్త్ ఈస్ట్, క్రిస్టోఫర్ చుంగ్, అన్నా చాన్‌సలర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు లిజ్ డోరన్ దర్శకత్వం వహించారు. ప్రేమకథతో పాటు మహిళా స్వాతంత్ర్యం, తన జీవితంపై తానే నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలను చూడాలనుకునేవారికి ‘మై బ్రిలియంట్ కెరీర్’ మంచి ఆప్షన్. 6 ఎపిసోడ్ల ఈ పీరియడ్ డ్రామా సిరీస్‌ను Netflixలో చూడవచ్చు. కానీ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.