Psychological Horror thriller: ఒక వీకెండ్ ట్రిప్ కోసం బయలుదేరిన యువతి స్పృహలోకి వచ్చి చూసేసరికి, తాను ఓ కదులుతున్న క్యాంపర్ వ్యాన్‌లో బంధీగా ఉందని తెలిస్తే? తన శరీరంలో ఓ వింత ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తూ, తనకు కేవలం గంట సమయం మాత్రమే ఉందని తెలిస్తే ? తనను కాపాడుతున్నానని చెప్పే వ్యక్తి నిజంగానే రక్షకుడా ? లేక తనను బంధించిన కిడ్నాపరా ? వ్యాన్‌లో కనిపించిన రక్తపు మరకలు, సంకెళ్లతో ఉన్న మరో మహిళ, భయంకరమైన గాయం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతుక్కుంటూ సాగే సైకలాజికల్ హారర్ రోడ్ థ్రిల్లర్ ‘హెల్‌క్యాట్’ (Hellcat 2026). మరి ఈ భయపెట్టే స్టోరీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
లీనా జీవితంలో ఒకేసారి రెండు విషాదాలు ఎదురవుతాయి. ఒకవైపు తాను గర్భవతి అనే విషయం ఆమెను కలవరపెడుతుంటే… మరోవైపు తన తల్లి మరణం ఆమెను తీవ్రంగా కుంగదీస్తుంది. ఆ బాధ నుంచి కాస్త బయటపడేందుకు ఒక వీకెండ్ ట్రిప్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ ప్రయాణం ఆమె జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవంగా మారుతుందని ఆమెకు తెలియదు.
ఒక దశలో లీనాకు స్పృహ వస్తుంది. కళ్లుతెరిచి చూస్తే… ఆమె ఓ వేగంగా వెళ్తున్న క్యాంపర్ ట్రైలర్‌లో బంధించబడి ఉంటుంది. తాను అక్కడికి ఎలా వచ్చింది ? ఎవరు తీసుకొచ్చారు ? ఏం జరిగింది ? అనే విషయాలేవీ ఆమెకు గుర్తుండవు. బయటకు వెళ్లే మార్గం కనిపించదు. సహాయం కోసం అరుస్తున్నా ప్రయోజనం ఉండదు. అదే సమయంలో తన భుజంపై ఉన్న గాయాన్ని చూసి లీనా మరింత భయపడుతుంది. ఆ గాయం చుట్టూ నల్లటి మార్పులు కనిపిస్తూ… ఏదో వింత ఇన్ఫెక్షన్ ఆమె శరీరంలో వేగంగా వ్యాపిస్తూ ఉంటుంది.
అప్పుడే క్యాంపర్‌ను నడుపుతున్న క్లైవ్ ఇంటర్‌కామ్ ద్వారా ఆమెతో మాట్లాడతాడు. తాను లీనాను కాపాడుతున్నానని అతను చెబుతాడు. క్యాంపింగ్ సైట్ దగ్గర గాయాలతో పడి ఉన్న ఆమెను చూసి అక్కడి నుంచి తీసుకొచ్చానని వివరిస్తాడు. కానీ లీనాకు పరిస్థితి అంత సింపుల్‌గా అనిపించదు. తన శరీరంలో వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్‌కు చికిత్స అందించడానికి తన దగ్గర కేవలం గంట సమయం మాత్రమే ఉందని క్లైవ్ చెప్పడంతో ఆమె భయం మరింత పెరుగుతుంది.
క్లైవ్ నిజంగానే తనను కాపాడుతున్నాడా ? లేక తనను ఏదైనా ప్రయోగం కోసం ఉపయోగించాలని అనుకుంటున్నాడా ? అనే అనుమానం లీనాలో మొదలవుతుంది. ఆ అనుమానాన్ని మరింత బలపరిచేలా క్యాంపర్‌లో కొన్ని భయంకరమైన వస్తువులు కనిపిస్తాయి. ఫ్రిజ్‌లో రక్తంతో ఉన్న పచ్చి మాంసం, స్పృహ తప్పించేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు ఆమెకు కనిపిస్తాయి. అంతేకాదు… క్యాంపర్‌లోని ఒక రహస్య భాగంలో కిటికీలకు ఇనుప గ్రిల్స్, రక్తపు మరకలు, బంధించేందుకు ఉపయోగించిన సంకెళ్లు కనిపిస్తాయి.
అక్కడితో లీనా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రహస్య గదిలో మరో మహిళ బంధించబడి ఉండటం ఆమె చూస్తుంది. ఇంతకాలం క్లైవ్ చెప్పిన మాటలన్నీ నిజమేనా? తాను ప్రమాదంలో ఉన్నందుకే అతను తనను తీసుకెళ్తున్నాడా? లేక ఈ క్యాంపర్‌లోనే అసలు భయంకరమైన కథ దాగి ఉందా? అన్నది అర్థం కాక లీనా అయోమయంలో పడుతుంది. సమయం మాత్రం ఆగదు. తన శరీరంలో మార్పులు వేగంగా జరుగుతుంటాయి. మరోవైపు క్యాంపర్ నుంచి బయటపడటానికి లీనా చేసే ప్రతి ప్రయత్నం కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
ఒక చిన్న క్యాంపర్ ట్రైలర్‌లోనే ఎక్కువ భాగం కథ సాగడంతో… లీనాకు బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోయినట్టే ఉంటుంది. క్లైవ్ చెప్పే మాటల్లో ఏది నిజం? ఏది అబద్ధం? తనను ఎవరు బంధించారు? తన శరీరంలోకి వచ్చిన ఇన్ఫెక్షన్ అసలు ఏంటి? క్యాంపర్‌లో బంధించబడిన మరో మహిళ ఎవరు? వీళ్లందరికీ మధ్య సంబంధం ఏమిటి? అసలు లీనాను కాపాడేది ఎవరు? చంపాలని చూస్తున్నది ఎవరు? ఆమె శరీరంలో వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ వెనుక అసలు రహస్యం ఏంటి? గంట సమయం పూర్తయ్యేలోపు లీనా అక్కడి నుంచి బయటపడగలిగిందా? చివరకు ఆమెకు ఎదురైన ఆ భయంకరమైన పరిణామం ఏంటి? అనేది ‘హెల్‌క్యాట్’లో చూడాల్సిన అసలు విషయం.
క్లాస్ట్రోఫోబిక్ వాతావరణం, సైకలాజికల్ హారర్, సర్వైవల్ థ్రిల్, మైండ్ గేమ్స్ కలిపి తెరకెక్కిన ‘హెల్‌క్యాట్’లో డకోటా గోర్మన్ (Dakota Gorman), టాడ్ టెర్రీ (Todd Terry), లిజ్ అట్వాటర్ (Liz Atwater) ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రాక్ బోడెల్ (Brock Bodell) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు తొలి ఫీచర్ ఫిల్మ్. థియేటర్లు, ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన తర్వాత ఆగస్టు 14 నుంచి షడ్డర్ (Shudder)ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: హాస్పిటల్ లో ఉగ్రవాదుల ఉన్మాదం… పసిపిల్లల కోసం నర్సులు చేసిన సాహసం చూస్తే కన్నీళ్లాగవు