National Award Movie: ఒకప్పుడు ఉగ్రవాదిగా మారాలని భావించిన యువకుడు. తర్వాత తప్పుడు కేసులో అరెస్టై ఏళ్ల తరబడి జైలులో గడిపిన వ్యక్తి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే వ్యక్తి న్యాయశాస్త్రం చదివి, అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ల తరఫున కోర్టులో పోరాడే లాయర్ గా మారతాడు. నిజ జీవితంలోని ఈ ప్రయాణాన్ని తెరపైకి తీసుకొచ్చిన సినిమా ‘షాహిద్’ (Shahid). విడుదలైన పదమూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం వల్ల ఇప్పుడు ఈ సినిమా మరోసారి వైరల్ అవుతోంది. జాతీయ అవార్డు దక్కిన ఈ సినిమాకు ఓటీటీ మోక్షం దక్కడానికి మాత్రం ఇన్నేళ్ళు పట్టింది. మరి తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం.
షాహిద్ అజ్మీ చిన్నప్పటి నుంచే మతపరమైన హింసను చూస్తూ పెరుగుతాడు. ముంబై అల్లర్ల సమయంలో జరిగిన హింస అతని ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కోపంతో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లి మిలిటెంట్ శిక్షణ శిబిరంలో కొంతకాలం గడిపినా, అక్కడి జీవితం అతనికి నచ్చదు. తిరిగి ముంబై వచ్చిన తర్వాత అతన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలతో అరెస్టు చేస్తారు.
జైలులో షాహిద్ ఏళ్ల తరబడి గడుపుతాడు. అక్కడే అతని జీవితం మరో మలుపు తిరుగుతుంది. ఓ తోటి ఖైదీ అతనిలో చదువుకోవాలనే ఆసక్తిని పెంచుతాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత షాహిద్ న్యాయశాస్త్రం చదివి లాయర్ గా మారాలని నిర్ణయించుకుంటాడు. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ముస్లిం యువకుల కేసులను తీసుకుంటాడు. చాలా కేసుల్లో ఆధారాలు లేకపోయినా, వ్యక్తులు సంవత్సరాల తరబడి జైలులో ఉంటున్నారని అతను గమనిస్తాడు. డబ్బు కోసం మాత్రమే కాకుండా న్యాయం కోసం కూడా కేసులు వాదించడం ప్రారంభిస్తాడు.
షాహిద్ కొన్ని కీలక కేసుల్లో విజయం సాధిస్తాడు. దీంతో అతని పేరు మార్మోగుతుంది. అదే సమయంలో అతనిపై విమర్శలు కూడా మొదలవుతాయి. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు, బెదిరింపు ఫోన్లు, కోర్టు బయట దాడులు అతని కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అయినా అతను తన పని ఆపకుండా చేస్తాడు. ముంబై పేలుళ్లు, ఉగ్రవాద ఆరోపణలు, అరెస్టులు వంటి సున్నితమైన కేసుల్లో నిందితుల తరఫున వాదిస్తూ న్యాయ వ్యవస్థలో తన పోరాటాన్ని కొనసాగిస్తాడు తనకు ఎదురైన అన్యాయాన్ని మరో వ్యక్తి జీవితంలో జరగకుండా చూడాలనే ప్రయత్నమే షాహిద్ ప్రయాణంగా మారుతుంది. మరి చివరికి అతని జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటి ? క్లైమాక్స్ లో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao), మహ్మద్ జీషాన్ అయూబ్ (Mohammed Zeeshan Ayyub), ప్రభ్లీన్ సంధు (Prabhleen Sandhu) ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ‘షాహిద్’కు హన్సల్ మెహతా (Hansal Mehta) దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన ఈ సినిమాకు రాజ్‌కుమార్ రావుకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం, హన్సల్ మెహతాకు ఉత్తమ దర్శకుడి జాతీయ అవార్డు లభించాయి. థియేటర్లలో విడుదలైన 13 ఏళ్ల తర్వాత Prime Videoలో స్ట్రీమింగ్‌కు వచ్చింది మూవీ. IMDbలో ప్రస్తుతం 8.2 రేటింగ్ ఉంది.
Read Also: కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్