OTT Movie : ఓటీటీలో సినిమాలని ఎలా ఆదరిస్తున్నారో, వెబ్ సిరీస్ లను కూడా అంతకన్నా ఎక్కువగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. భాషతో సంబంధం లేకుండా, కంటెంట్ నచ్చితే వదలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సిరీస్ ఒక వివాహిత ఎదుర్కునే గృహహింస చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
హోయిచోయ్ (Hoichoi)లో
ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘సంపూర్ణ’ (Sampurna). 2022 లో వచ్చిన ఈ సినిమాకి సాయంతన్ ఘోషాల్ దర్శకత్వం వహించారు. ఇందులో సోహిని సర్కార్, రజనందిని పాల్, లబోని సర్కార్, అనుభవ్ కంజిలాల్, ప్రాంతిక్ బెనర్జీ, రజత్ గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. 6ఎపిసోడ్‌లతో సీజన్ 1 ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ 2022 జూలై 29న హోయిచోయ్ (Hoichoi)లో విడుదలైంది. దీని రెండవ సీజన్ కూడా 2023లో విడుదలైంది. ఈ సిరీస్ గృహ హింస, స్త్రీల హక్కులు, సామాజిక న్యాయం వంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ కి IMDb లో 6.8/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
సంపూర్ణ ఒక సాధారణ బెంగాలీ గృహిణి. తన భర్త, అత్తమామలతో కలిసి ఒక సాంప్రదాయ కుటుంబంలో నివసిస్తుంటుంది. ఆమె తన కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎల్లప్పుడూ తపిస్తుంటుంది. ఇక ఈ స్టోరీ మొదటి ఆమె బావమరిది రక్తిమ్, నందిని వివాహం చుట్టూ తిరుగుతుంది. నందిని ఒక సున్నితమైన అమ్మాయి, సంపూర్ణ ఈ వివాహాన్ని జరిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వివాహం తర్వాత, నందిని తన భర్త రక్తిమ్‌తో కలిసి సంపూర్ణ కుటుంబంలో చేరుతుంది. అయితే వివాహం జరిగిన మొదటి రాత్రి, టెర్రస్‌పై నందినిని గందరగోళ స్థితిలో ఉండటాన్ని సంపూర్ణ చూస్తుంది. ఆమె నందినికి ధైర్యం చెప్పి భర్త దగ్గరికి పంపుతుంది. ఆ తరువాత రక్తిమ్, నందిని హనీమూన్‌కు వెళతారు. వెంటనే ఈ జంట హనీమూన్ నుంచి తిరిగి వస్తారు.
ఈ సమయంలో నందిని శారీరక హింసకు గురైనట్లు సంపూర్ణ గమనిస్తుంది. రక్తిమ్ ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడని గ్రహిస్తుంది. ఈ విషయం సంపూర్ణను షాక్‌కు గురి చేస్తుంది. ఎందుకంటే రక్తిమ్ బయటికి చాలా మంచి వ్యక్తిగా కనిపిస్తాడు. సంపూర్ణ ఈ విషయాన్ని తన కుటుంబంతో చర్చించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె అత్త ఆలోకా రక్తిమ్‌ను ‘మా కొడుకు ఏ తప్పు చేయడు’ అనే మనస్తత్వంతో అతన్ని వెనకేసుకొస్తుంది. సంపూర్ణ భర్త కూడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకోడు. సంపూర్ణ నందినికి ధైర్యం చెప్పి, రక్తిమ్ దౌర్జన్యాన్ని బయటపెట్టమని ప్రోత్సహిస్తుంది. నందిని మొదట్లో భయపడినప్పటికీ, సంపూర్ణ అండతో మాట్లాడటానికి ముందుకు వస్తుంది. అయితే ఇంతలో నందిని ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడుతుంది. ఇది కుటుంబంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. సంపూర్ణ ఈ ప్రమాదం అనుకోకుండా జరిగినది కాదని, రక్తిమ్ దాని వెనుక ఉండవచ్చని అనుమానిస్తుంది.
ఈ దశలో సంపూర్ణ తన అత్తమామలు, భర్త, సమాజం నుండి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆమె భర్త ఆమెకు ఒక ఆల్టిమేటం కూడా ఇస్తాడు. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళితే, మన సంబంధం ముగుస్తుందని హెచ్చరిస్తాడు. ఇక నందిని కోసం సంపూర్ణ న్యాయ పోరాటం చేయాలనుకుంటుంది. ఆమె ఒక ప్రముఖ న్యాయవాది సహాయం తీసుకుంటుంది. అయితే ఇక్కడినుంచి అసలు ట్విస్ట్లు మొదలవుతాయి. చివరికి రక్తిమ్ తన భార్య నందినితో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ? నందినికి సంపూర్ణ న్యాయం చేస్తుందా ? ఈ వివాహ బంధం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? సంపూర్ణ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : 30 కోట్ల బడ్జెట్, 300 కోట్ల కలెక్షన్స్… ఆస్కార్ ను అందుకున్న ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?