Sarvagunn Sampann on OTT: ఒక అమ్మాయి అందంగా ఉందని పెళ్లి సంబంధాలు వస్తాయి… అదే అందం ఓ వింత పోలికతో ముడిపడితే, సమాజం ఆమెను అనుమానంగా చూడటం మొదలు పెడితే ? మనిషి మంచితనం, వ్యక్తిత్వం కంటే ముఖాన్ని బట్టి తీర్పులు చెప్పే సమాజం ఎలా ఉంటుందో సరదాగా, వ్యంగ్యంగా చూపించే సినిమా ‘సర్వగుణ్ సంపన్’ (Sarvagunn Sampann). 90ల కాలం నాటి వాతావరణంలో సాగే ఈ కథ నవ్విస్తూనే.. మనుషుల ఆలోచనా విధానంపై కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.
మన కథానాయిక (వాణీ కపూర్) ఒక చిన్న పట్టణానికి చెందిన సంప్రదాయబద్ధమైన అమ్మాయి. చాలా పద్ధతిగా పెరిగిన ఆమెకు కుటుంబం అంటే ఎంతో గౌరవం. తల్లిదండ్రులు కూడా ఆమెను ఎంతో ప్రేమగా పెంచుతారు. ఇంట్లో ఆమెను చూసినప్పుడల్లా ‘సర్వగుణ సంపన్నురాలు’ అంటూ మురిసిపోతుంటారు. చదువు, ప్రవర్తన, కుటుంబ విలువలు… ఇలా అన్ని విషయాల్లో ఆమెను మంచి అమ్మాయిగానే భావిస్తారు. కూతురికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు మంచి సంబంధం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. తమ కూతురికి మంచి కుటుంబం దొరికితే చాలని భావిస్తారు. పెళ్లి చూపులు, బంధువుల హడావిడి, ఊరి వాళ్ల మాటలు… 90ల కాలం నాటి మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే సాధారణ వాతావరణం మొదలవుతుంది.
కానీ ఆమె జీవితంలోకి ఊహించని సమస్య వచ్చి పడుతుంది. ఆ అమ్మాయి ముఖం అంతర్జాతీయంగా ఎంతో పాపులర్ అయిన ఓ అడల్ట్ ఫిల్మ్ నటిని పోలి ఉంటుంది. ఆమెకు ఈ విషయం గురించి మొదట్లో పెద్దగా పట్టింపు ఉండదు. తన రూపం వల్ల తన జీవితంలో ఇంత పెద్ద సమస్య వస్తుందని కూడా ఊహించదు. కానీ ఈ పోలిక గురించి బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. పెళ్లి సంబంధం కోసం వచ్చే వాళ్లు ఆమెను చూసే విధానం మారుతుంది. ఆమె వ్యక్తిత్వం ఏంటి ? ఆమె ఎలా పెరిగింది ? ఆమె మంచి చెడ్డలు ఏంటి ? అనే విషయాల కంటే… ఆమె ఎవరిని పోలి ఉంది ? అనే ఒక్క ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయని ఓ సాధారణ అమ్మాయి… కేవలం తన ముఖం ఒక వ్యక్తిని పోలి ఉందనే కారణంతో అనుమానాలకు గురవుతుంది. ఆమె కుటుంబం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊరి జనాల గుసగుసలు మొదలవుతాయి. పెళ్లి సంబంధాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. అక్కడే ఈ కథ అసలు పాయింట్ బయటకు వస్తుంది. ఒక మనిషి మంచితనాన్ని అతని రూపం నిర్ణయిస్తుందా ? ఎవరితో పోలిక ఉందన్న కారణంతో ఒక వ్యక్తి క్యారెక్టర్‌పై తీర్పు చెప్పడం ఎంతవరకు సరైనది ? అనే ప్రశ్నలు తలెత్తుతాయి.
మొదట్లో తనకు ఎదురవుతున్న పరిస్థితులను అర్థం చేసుకోలేక ఆ అమ్మాయి బాధపడుతుంది. తాను ఏ తప్పూ చేయకపోయినా ఎందుకు అందరూ తనను విచిత్రంగా చూస్తున్నారో ఆమెకు అర్థం కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ తనపై పడుతున్న ముద్రను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ సమయంలో ఆమె జీవితంలోకి ఇశ్వాక్ సింగ్ పోషించిన యువకుడు వస్తాడు. అతను కూడా మిగతా వాళ్లలా ఆమె ముఖాన్ని చూసి జడ్జ్ చేయకుండా… ఆమెను ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.
కానీ ప్రేమించడం ఒకటి.. ఆ ప్రేమను సమాజం ముందు నిలబెట్టుకోవడం మరోటి. అమ్మాయి గతం గురించి, ఆమె రూపం గురించి, ఆ వింత పోలిక గురించి బయటివాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడికి కూడా కుటుంబం, సమాజం నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. దీంతో వీరి ప్రేమ కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు కూడా ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతారు. తమ కూతురు మంచిదేనని తెలిసినా… సమాజం ఏం అనుకుంటుందో అనే భయం వారిని వెంటాడుతుంది. కూతురి భవిష్యత్తు కోసం వాళ్లు ఏం నిర్ణయం తీసుకున్నారు? చివరకు ఆమెకు అండగా నిలిచారా? ముఖం తనదే అయినా… దానికి ఇతరులు పెట్టిన అర్థాన్ని ఎందుకు తాను మోయాలి ? చివరకు ఆ అమ్మాయి తనపై పడిన ముద్రను ఎలా తొలగించుకుంది? ఆమెను ప్రేమించిన వ్యక్తి సమాజానికి ఎదురుగా నిలబడి ఆమెను పెళ్లి చేసుకున్నాడా? తల్లిదండ్రులు తమ కూతురి నిర్ణయాన్ని అంగీకరించారా? అన్నింటికంటే ముఖ్యంగా.. ఒక మనిషి గుర్తింపు అతని ముఖంలో ఉంటుందా? లేక అతని వ్యక్తిత్వంలో ఉంటుందా? అనే ప్రశ్నకు సినిమా ఎలాంటి సమాధానం ఇచ్చిందనేదే ‘సర్వగుణ్ సంపన్’లో చూడాల్సిన అసలు విషయం.
‘సర్వగుణ్ సంపన్’ మూవీ కేవలం నవ్వించడమే కాకుండా… సమాజం మనుషులపై వేసే లేబుల్స్, రూపాన్ని బట్టి ఇచ్చే తీర్పులు, ముఖ్యంగా మహిళల విషయంలో ఉండే ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించే సోషల్ సెటైర్. ప్రస్తుతం ZEE5లో హిందీ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు.
Read Also: పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్