Romantic Comedy: ప్రేమలో పడటం వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయి ఒక్కసారిగా సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తే ఓ కుర్రాడు ఏం చేస్తాడు ? ఆమెను ఎలాగైనా మళ్లీ కలవాలనే ప్రయత్నంలో తనే సృష్టించుకున్న డేటింగ్ యాప్ తొ చిక్కుల్లో పడితే పరిస్థితి ఎలా మారుతుంది ? ఇలాంటి లవ్, కామెడీకి సస్పెన్స్ కలగలిపి తీసిన కథే ‘రోమాంచకం’ (Romanchakam). మరి గత నెలలోనే థియేటర్లలో సందడి చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందంటే ?
అన్వేష్ హైదరాబాద్ కు చెందిన యువకుడు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని గడపడం కంటే, సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఉంటాడు. అందులో భాగంగానే తన స్నేహితులతో కలిసి ఓ డేటింగ్ స్టార్టప్ మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ప్రేమను పరిచయం చేసే యాప్ ద్వారా డబ్బు సంపాదించాలనేది అతడి ప్లాన్. కానీ ప్రేమను వ్యాపారంగా మార్చాలనుకున్న అన్వేష్‌కి… అదే ప్రేమ ఊహించని చిక్కులు తెచ్చిపెడుతుంది.
డేటింగ్ యాప్ ద్వారా అతడికి మైథిలి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. మొదట పరిచయంగా మొదలైన వీరి ప్రయాణం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారుతుంది. అన్వేష్ కూడా మైథిలిపై మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్న సమయంలో ఆమెను సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో అన్వేష్ చెన్నైకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు గందరగోళం మొదలవుతుంది. సడన్ గా మైతిలి ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది.
సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా అన్వేష్ ను బ్లాక్ చేస్తుంది. నిన్నటి వరకు తనతో ప్రేమగా మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా ఎందుకు ఇలా చేసిందో అన్వేష్ కు అర్థం కాదు. ఆమెను కలవడానికి చేసిన ప్రతి ప్రయత్నం మరింత గందరగోళాన్నే పెంచుతుంది. అసలు మైథిలి ఇలా సడన్ గా ఎందుకు దూరమైంది ? ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదైనా కారణం ఉందా ? అన్వేష్ ఆమెను మళ్లీ కలుసుకున్నాడా ? చివరికి ఇద్దరూ కలిశారా లేదా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీని చూడాల్సిందే.
సుమంత్ ప్రభాస్, అనంతిక సునీల్‌కుమార్, ఉపేంద్ర లిమయే, వెంకటేష్ కాకుమాను తదితరులు నటించిన తెలుగు యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. ఈ సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించగా, సందీప్ రెడ్డి వంగా సమర్పించారు. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది. గత నెల 3న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది.
Read Also: ఒకే కుటుంబంలో వరుస హత్యలు… కోట్ల ఆస్తి కోసం భయంకరమైన కుట్ర… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్