Telugu Dark Mythological Thriller: అమ్మవారు కొలువై ఉండే ఏ గుడిని అయినా మనమంతా ఎంతో పవిత్రంగా భావిస్తాము. కానీ అలాంటి అమ్మవారికి కట్టిన ముడుపు నుంచి రక్తం కారితే, అక్కడ కోరికలు కోరితే చస్తారు అనే సెంటిమెంట్ ఉంటే ఎలా ఉంటుంది ? వినడానికే వింతగా ఉంది కదా. కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తోనే ఓ తెలుగు హర్రర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. ఆ సినిమా అర్దరాత్రి నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ రావడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. ఈ హర్రర్ మూవీ పేరు Trikala: Script of God. మరి 2026లో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలీవుడ్ డార్క్ మైథలాజికల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్దాం పదండి.
కథ రెండు కాలాలలో సాగుతుంది. ప్రాచీన కాలం, కలియుగం ఒకేసారి నడుస్తుంది. శతాబ్దాల క్రితం ‘కుమారి ఖండం’ అనే పౌరాణిక భూభాగం ఉంటుంది. అక్కడ శక్తివంతమైన మునులు లోక కళ్యాణం కోసం అత్యంత ప్రమాదకరమైన తాంత్రిక గ్రంథాలు, రహస్యాలను దాచిపెడతారు. వాటిని అసుర శక్తుల నుంచి రక్షించడానికి ‘శక్తి ఏథా’ అనే దైవిక ఆయుధాన్ని సృష్టించి, దానిని మహా వీరుడైన త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసురులతో జరిగిన భయంకర యుద్ధంలో త్రికాల వర్మ వీరమరణం పొందినా, అతని ఆత్మను ‘మాయా అండం’లో బంధించి భవిష్యత్తులో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు మేల్కొల్పేలా చేస్తారు.
ఇప్పుడు కథ ఆధునిక కలియుగానికి వస్తుంది. శివ అనే యువకుడు తన ప్రేయసి నిధి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమెను వెతుకుతూ నగరానికి వస్తాడు. ఈ అన్వేషణలో అతనికి ఒక వింతైన, రహస్య శక్తులున్న మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ ద్వారా అతను కొన్ని రహస్యాలు తెలుసుకుంటాడు. అలాగే ముందుగానే జరగబోయే సంఘటనలు చూస్తాడు. అదే సమయంలో పోర్ఫిరియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ, ఒక పాడుబడిన బంగ్లాలో ఆత్మలాగా సంచరిస్తున్న వైతరణ్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతని శరీరం సూర్యకాంతికి తట్టుకోలేని స్థితిలో ఉంటుంది.
మరోవైపు, సైకియాట్రిస్ట్ మాయ ఆ బంగ్లాలో జరుగుతున్న వింతలను పరిశోధించడానికి వచ్చి అక్కడ చిక్కుకుపోతుంది.ఈ నేపథ్యంలోనే ప్రాచీన రాక్షస రాజు కలియుగంలో తిరిగి అవతరించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఒక దుష్ట తాంత్రిక ముఠా ‘మాయా అండం’ను దక్కించుకుని ఆ దైవిక శక్తులను దుర్వినియోగం చేసి ప్రపంచాన్ని చీకటిలో ముంచేయాలని కుట్ర పన్నుతుంది. శివ తన ప్రేయసి నిధిని కాపాడుకోవడానికి, మాయ తన పరిశోధనల ద్వారా తెలిసిన రహస్యాలతో, వైతరణ్ తన పురాతన ధర్మాన్ని నెరవేర్చడానికి… ముగ్గురూ కలిసి ఈ దుష్ట శక్తులతో పోరాడతారు. మరి వాళ్ళు ఆ రాక్షసుడిని ఎలా ఓడించారు ? క్లైమాక్స్ లో ఏం జరిగింది ? అన్నది తెలియాలంటే ఈ మూవీని డోంట్ మిస్.
‘త్రికాల స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ మూవీ జూలై 9 నుండి Sun NXTలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సనాతన ధర్మం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, కాల చక్రాలను అద్భుతంగా మిళితం చేసిన ఈ మిస్టిక్ డార్క్ ఫాంటసీ చిత్రం ‘తుంబాడ్’, ‘కాంతార’ తరహాలో ఒక విభిన్న అనుభూతి ఇస్తుంది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా, షాజిత్ హుమాయున్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.
Read Also: నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్