Emotional Musical Drama on OTT: ఒక అమ్మాయి జీవితంలో తాను ఎన్నాళ్లుగానో కలలు కంటున్న పాత్ర దక్కితే… అంతకంటే సంతోషకరమైన రోజు ఇంకేముంటుంది ? కానీ అదే రోజు తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడనే వార్త తెలిస్తే ? స్టేజ్‌పై వేల మంది ముందు నవ్వుతూ నటించాలి… కానీ స్టేజ్ దిగిన తర్వాత కన్నీళ్లతో పోరాడాల్సి వస్తే ? కలను గెలుచుకున్న ఆనందం, కుటుంబాన్ని కోల్పోతామనే భయం ఒకేసారి ఎదురైతే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇలాంటి భావోద్వేగాల మధ్య ఓ టీనేజ్ అమ్మాయి చేసే ప్రయాణాన్ని చూపించిన హాలీవుడ్ మ్యూజికల్ డ్రామా ‘డోంట్ సే గుడ్ లక్’ (Don’t Say Good Luck). మరి ఈ ఎమోషనల్ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
సోఫీ బిరెన్‌బామ్ ఓ హైస్కూల్ అమ్మాయి. చదువుతో పాటు ఆమె ప్రపంచం మొత్తం థియేటర్ చుట్టూనే తిరుగుతుంటుంది. స్టేజ్‌పై నిలబడి నటించడం, పాటలు పాడటం, ప్రేక్షకుల ముందు తన ప్రతిభను చూపించడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. తన స్కూల్‌లో ప్రదర్శించబోయే ప్రముఖ మ్యూజికల్ ‘వెయిట్రెస్’లో లీడ్ రోల్ దక్కించుకోవాలన్నది ఆమె పెద్ద కల. ఆ పాత్ర కోసం సోఫీ ఎంతో కష్టపడుతుంది. ఆడిషన్ కోసం ప్రాక్టీస్ చేస్తుంది. తనలో ఉన్న టాలెంట్‌ను పూర్తిగా బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఆమె ప్రతిభ థియేటర్ డైరెక్టర్ పార్కర్‌ను ఆకట్టుకుంటుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం సోఫీ చేతికి వస్తుంది. లీడ్ రోల్ ఆమెకే దక్కుతుంది.
సోఫీకి అది జీవితంలో మర్చిపోలేని ఆనందం. తన కల నిజమైందనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. కానీ ఆ సంతోషం పూర్తిగా ఆస్వాదించేలోపే ఆమె జీవితాన్ని కుదిపేసే మరో వార్త తెలుస్తుంది. సోఫీ తల్లి ఎలిజబెత్ గతంలో క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. కుటుంబం అంతా ఆ కష్టకాలం నుంచి బయటపడిందని భావిస్తున్న సమయంలో… ఆమెకు మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిందనే విషయం బయటపడుతుంది. ఒక్కసారిగా సోఫీ ప్రపంచమే మారిపోతుంది.
ఒకవైపు తన జీవితంలోనే అతిపెద్ద కల నెరవేరింది. మరోవైపు తన తల్లి మళ్లీ ప్రాణాపాయంలోకి వెళ్లింది. ఏది సంతోషించాలో… దేనికి బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో సోఫీ చిక్కుకుపోతుంది. స్టేజ్‌పై మాత్రం ఆమె తన పాత్రలో పూర్తిగా లీనమవ్వాలి. పాటలు పాడాలి. నవ్వుతూ నటించాలి. ప్రేక్షకుల చప్పట్లను అందుకోవాలి. కానీ స్టేజ్ వెనుక ఆమె కుటుంబంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తల్లి అనారోగ్యం, కుటుంబంలో పెరుగుతున్న ఆందోళన సోఫీని లోపల నుంచి కుంగదీస్తుంటాయి.
తండ్రి టెడ్ కుటుంబాన్ని నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ సోఫీ మాత్రం తనలోని బాధను బయటకు చెప్పుకోలేకపోతుంది. తన స్నేహితుల ముందు కూడా అన్నీ బాగున్నట్టే నటించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పేస్తే తన కల కూడా చేతుల నుంచి జారిపోతుందేమో అనే భయం ఆమెను వెంటాడుతుంది. ఇలాంటి సమయంలో సోఫీకి తన బెస్ట్ ఫ్రెండ్ కరోలిన్ అండగా నిలుస్తుంది. నాటకంలో తనతో కలిసి నటించే జాక్ కూడా ఆమె జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారతాడు. వారి స్నేహం, సహకారం సోఫీకి క్రమంగా తన బాధను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి.
కానీ అసలు పోరాటం మాత్రం సోఫీ మనసులోనే జరుగుతుంది. తల్లిని కాపాడుకోవాలనే ఆందోళన ఒకవైపు… తన కలను వదులుకోవద్దనే కోరిక మరోవైపు ఆమెను లాగుతుంటాయి. తాను సంతోషంగా ఉండటం కూడా తప్పేనా ? తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే తాను స్టేజ్‌పై ఆనందంగా ఎలా నటించగలదు ? అనే ప్రశ్నలు ఆమెను వెంటాడుతుంటాయి. అక్కడే ఈ సినిమా అసలు భావోద్వేగాన్ని చూపిస్తుంది. జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్టుగా జరగదు. కొన్ని సందర్భాల్లో ఆనందం, బాధ రెండూ ఒకేసారి మన ముందుకు వస్తాయి. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం కంటే… రెండింటినీ అంగీకరించి ముందుకు సాగాల్సి వస్తుంది.
సోఫీ కూడా అదే నేర్చుకోవాల్సి వస్తుంది. తన తల్లి పరిస్థితిని ఎదుర్కొంటూనే, తనలోని కళాకారిణిని చంపుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. స్టేజ్ ఆమెకు కేవలం ఓ ప్రదర్శన వేదికగా కాకుండా… తనలో పేరుకుపోయిన బాధను బయటకు పంపించుకునే మార్గంగా మారుతుంది. తన కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దాచిపెట్టడం కంటే వాటిని అర్థం చేసుకోవడం, తన భావోద్వేగాలను అంగీకరించడం, చుట్టూ ఉన్న మనుషుల సహాయాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో సోఫీ ప్రయాణం చెబుతుంది.
చివరకు స్టేజ్‌పై సోఫీ చేసే ప్రదర్శన కేవలం ఒక మ్యూజికల్ పెర్ఫార్మెన్స్‌గా మిగలదు. ఆమె జీవితంలో ఎదురైన బాధ, భయం, ప్రేమ, ఆశ అన్నీ ఆ ప్రదర్శనలో కలిసిపోతాయి. తనకు ఎదురైన పరిస్థితులు తన కలలను ఆపలేవని ఆమె ఎలా నిరూపించింది ? తల్లి అనారోగ్యాన్ని కుటుంబం ఎలా ఎదుర్కొంది ? సోఫీ తన వ్యక్తిగత జీవితాన్ని, స్టేజ్ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంది ? అనేదే సినిమా క్లైమాక్స్ లో తెలుస్తుంది.
‘డోంట్ సే గుడ్ లక్’ కేవలం టీనేజ్ మ్యూజికల్ మూవీ కాదు. ఒక యువతి జీవితంలో ఒక్కసారిగా వచ్చే ఆనందం, భయం, కుటుంబ బాధ్యతలు, స్నేహం, ప్రేమ, కళపై ఉన్న నమ్మకాన్ని కలిపిన ఎమోషనల్ కథ. ముఖ్యంగా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మన కలలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదనే భావనను సినిమా బలంగా చెబుతుంది. ప్రస్తుతం ‘డోంట్ సే గుడ్ లక్’ Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. సన్నీ సాండ్లర్ ప్రధాన పాత్రలో నటించింది.
Read Also: పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే