ఇదేదో సినిమా డైలాగులా ఉందే.. ! నాలుక చివరలోనే ఉంది.. కానీ బయటికి రావడం లేదబ్బా..! మహేశ్ బాబు డైలాగులా ఉంది.. కానీ పూర్తిగా గుర్తుకు రావడం లేదు. సరే, అంత కష్టపడొద్దు గానీ.. నేనే చెప్తా..! నన్ను కన్ఫ్యూజ్ చేయకు.. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో నేను ఎక్కువ కొట్టేస్తాను.. ఆ కన్ఫ్యూజన్‌లో నేనేం చేస్తానో నాకే తెలియదు..! ఇది పూర్తి డైలాగు.
మహేశ్ బాబు హీరో. బిజినెస్‌మెన్ సినిమా. పూరీ జగన్నాథ్ డైరెక్టర్. ఈ డైలాగు రాసింది కూడా పూరీనే. అందులో హీరో పేరు సూర్యాభాయ్. అతను చెప్పే ఈ డైలాగు అందరినీ ఆకట్టుకుంటుంది. మనం ఈ కథనంలో చెప్పుకోబోయే లీడర్ పేరు జగన్ భాయ్! ఇతను చెప్పే ఈ టైటిల్ లాంటి డైలాగు అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. సూర్యాభాయ్.. నన్ను కన్ఫ్యూజ్ చేస్తే ఆ కన్ఫ్యూజన్‌లో నేనేం చేస్తానో నాకే తెలియదు..! అని అంటే… మన జగన్ భాయ్.. తానే కన్ఫ్యూజన్‌లో ఉండి.. ఆ కన్ఫ్యూజన్‌లో జనాన్ని కూడా కన్ఫ్యూజన్ చేయడానికి నేనేం చెప్తానో నాకే తెలియదనే కన్ఫ్యూజన్ కామెంట్లు చేస్తున్నాడని అర్థం.
మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పే కన్ఫ్యూజ్ కథనాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా! అధికారంలోకి వచ్చేదాకా అమరావతికే ఓకే అన్నాడు జగన్ భాయ్! గెలవగానే ఇక తిరుగులేదనుకున్నాడో.. అధికార దర్పంతో వచ్చిన ఆలోచనో, చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు అమరావతి రైతుల భుజాలపై తుపాకీ పెట్టాడు.
అమరావతిని అర్థాంతరంగా ఆపేశాడు. త్రిశంఖు స్వర్గంలోకి నెట్టేశాడు. విశాఖపట్టణం సూపర్ అన్నాడు. ఏపీకి మూడు రాజధానులు బెటర్ అని ఫైనల్ నిర్ణయానికొచ్చాడు. అభివృద్ధి వికేంద్రీకరణలో ఇది తప్పనిసరి అని తనకు తాను సమర్థించుకున్నాడు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం.. దీని వల్ల కోస్తాంధ్రా, రాయలసీమ,, ఉత్తరాంధ్రలు అభివృధ్ది చెందుతాయనే భాష్యం చెప్పాడు.
ఈ మూడు రాజధానుల పేరిట అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాడు. మండలిలో సంఖ్యాబలం లేకపోవడంతో అది వీగిపోయింది. ఆ ఆలోచనకు అలా బ్రేక్ పడింది. కానీ తను మాత్రం విశాఖ రుషికొండలో వందల కోట్లతో సొంత ప్యాలేస్ నిర్మించుకున్నాడు. జగన్ భాయ్‌కు అమరావతి పాపం తగిలినట్టుంది.. ఓడిపోయాడు. ఘోరంగా!
ఇక ఇప్పుడు మళ్లీ మూడ్ మారింది. ఓటమిలో మరింత కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఓ పక్క అక్కడ అమరావతికి కేంద్రం చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ కూడా విడుదల చేస్తే.. ఈయన మాత్రం కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చాడు. మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చి.. జగన్ పేరును పోలి ఉండేలా చూసుకుని.. విజయవాడనే రాజధానికి అన్ని విధాల బెటరనే కొత్త అభిప్రాయాన్ని వెలిబుచ్చి.. వైజాగ్ జనాన్ని గందరగోళానికి గురి చేసి.. విజయవాడ ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించాలనుకుని.. వేదిక ఏదైనా విజయవాడ పేరు తీయకుండా గాని వదలడం లేదు.
మరి వైజాగ్ సంగేతేంది నాయనా.. ? అని అడిగితే.. ! ముసిముసిగా నవ్వుతూ.. ఆ నవ్వు ద్వారా ఇంకా అనేకానేక కన్వ్యూజన్లను క్రియేట్ చేస్తూ.. ఏపీ జనాన్ని కంగారెత్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు విజయవాడ అన్నింటికీ బాగుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇదే రాజధాని. అంతా ఫిక్సయిపోండి… నా పార్టీ మ్యానిఫెస్టోలో కూడా దీన్ని పెడతాను..! అని మరో విఫల ప్రయోగానికి సిద్దపడి, తన పార్టీనే ఓ ప్రయోగశాలగా మార్చి.. ఆయనే ఓ శాస్త్రవేత్తగా మారి.. ఓడినప్పుడల్లా ఓ కొత్త రాజధానిని సృష్టించి.. కన్వ్యూజన్‌కే కన్ఫ్యూజన్ తెప్పించి పిచ్చెక్కించే పనిలో బిజీబిజీగా ఉన్నాడిప్పుడు మన జగన్ భాయ్!