రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉన్న కేటీఆర్‌కు, సొంత నియోజకవర్గం పెద్ద తలనొప్పిగా మారింది. కేసీఆర్ ఇక్కడ మొత్తం బాధ్యతలు మీదేసి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన నేపథ్యంలో.. అంతా తానై వ్యవహరిస్తున్నాడు రామన్న. ఓ వైపు రేవంత్ రోజుకో రీతిన కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అయితే కేసీఆర్.. లేదా కేటీఆర్.. చివరగా హరీశ్.. ఈ ముగ్గురిని తిట్టని రోజు లేదు సీఎంకు.
ఏ సభ పెట్టినా వీరి తిట్లతోనే ఆరంభమై.. ముగుస్తున్నది. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయల్లో తన పట్టు నిలుపుకునేందుకు, సర్కార్ వైఫల్యాలు ఎండగట్టేందుకు, సోషల్ మీడియా టీమ్‌ను ఉరుకులు పరుగులు పెట్టేంచేందుకు ఇక్కడే సమయం సరిపోవడం లేదు కేటీఆర్‌కు. అంత బిజీగా ఉన్నాడు మరి ఇక్కడి రాజకీయాల్లో.
కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రాన్ని మరిచాడు ఈ బిజీలో రామన్న. తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కేటీఆర్‌కు పొగబెట్టే కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. కవిత దీనికి ఆజ్యం పోశారు. టూరిస్ట్ ఎమ్మెల్యే అని నామకరణం చేశారు అక్కడికి వెళ్లి. ఆ తరువాత నేరెళ్ల బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె.. నేరుగా కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. దీంతో వెంటనే అలర్టయ్యాడు కేటీఆర్.
కంటి వెలుగు పథకాన్ని అక్కడ ప్రారంభించాడు. బీఆరెస్ పార్టీ ఫండ్‌ను ఉపయోగించి ఆ పథకానికి నాంది పలికారు. తరువాత జిల్లా మొత్తంగా దీన్ని అమలు చేస్తానని ప్రకటించాడు. అక్కడి జనంతో పెరుగుతున్న గ్యాప్‌ను పూడ్చుకునేందుకే కంటి వెలుగు పథకంతో వచ్చాడని రాజకీయాల్లో చర్చ మొదలైంది.
పథకం ప్రారంభించి పోతే అయిపోతుందా? అప్పుడు ఎన్నికల్లో ఏమన్నావు..? వారానికి రెండు రోజులు ఇక్కడే బస చేసి సమస్యలను పరిష్కరిస్తానన్నావ్.. ఏమైంది..! అని నిలదీస్తున్నారు కాంగ్రెస్, బీఆరెస్ శ్రేణులు. ఇప్పుడు ఈ రెండు పార్టీలో పోటీలు పడి సిరిసిల్లలో నిరసనలు తెలుపుతున్నారు.
కవిత పెట్టిన టూరిస్ట్ ఎమ్మెల్యే నామకరణాన్ని వీరు ఇలా కొనసాగిస్తున్నారన్నమాట. ఇవాళ బీజేపీ శ్రేణులు.. కేటీఆర్ అసలు నియోజకవర్గానికే రావడం లేదని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం మరోసారి చర్చకు వచ్చింది ఈ అంశం. వారానికి రెండు సార్లేమో గానీ.. ఆరు నెలలకు రెండు సార్లు కూడా రావడం లేదని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.