నిన్న సీఎం రేవంత్ మాట్లాడిన మాటలకు, చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు కేటీఆర్ బాగానే ప్రిపేరై వచ్చాడు. గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశాడు. పదేండ్లుగా చేసిన అప్పులు, పథకాలకు కేటాయించిన మొత్తం.. రైతులకు అందించిన మొత్తం నిధుల లెక్కలు.. అన్నీ లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశాడు.
రేవంత్ పదేళ్ల పాలనపై చేసిన ఆరోపణలను కూడా తిప్పికొట్టేందుకు సక్సెస్‌ఫుల్‌గా ప్రయత్నం చేశాడు. దీన్ని బట్టి నిన్న సీఎం మాట్లాడిన ప్రతీ మాటను విని క్షుణ్ణంగా దీనిపై అధ్యయనం చేసి.. ఎలా దీన్ని తిప్పికొట్టాలో ఫర్‌ఫెక్ట్‌గా ప్రిపేరై వచ్చినట్టున్నాడు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి దాదాపు గంట పాటు కేటీఆర్ మాట్లాడాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా తడబడకుండా.. తడుముకోకుండా బాగానే సమాధానాలు చెప్పాడు.
రేవంత్‌ను అపరిచితుడన్నాడు. అల్పుడు, అంగుష్ఠ మాత్రుడు, తుచ్చుడు.. దరిద్రుడు.. ఇలా నోటికొచ్చినట్టు తనూ తిట్టి కచ్చ తీర్చుకున్నాడు. కేసీఆర్‌ను అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చితే.. రేవంత్‌ను బాహుబలి సినిమాలో బల్లాలదేవుడితో పోల్చాడు కేటీఆర్. దెబ్బకు దెబ్బ. మాటకు మాట. ఆరోపణకు కౌంటర్.. చర్చకు సవాల్! అన్నీ చేశాడు.
టైం, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే, అసెంబ్లీలోనా, అశోక్‌నగర్‌లోనా..? వరంగల్‌లోనా..? లేక నువ్వు కల్లుబట్టి అని అవహేళన చేసిన ప్రెస్‌క్లబ్‌లోనా..? నేను రెడీ, చూసుకుందాం రా నీ ప్రతాపమో, నా ప్రతాపమో..! అని సినిమాలో డైలాగులా సవాల్ విసిరాడు కేటీఆర్.
అప్పుల పై శుద్దతప్పులన్నాడు. రైతుల కోసం ఎంత చేశామో వివరించాడు. పదేండ్లలో మేమింత చేశాం.. కానీ రెండున్నరేండ్లలో ఆయన నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడని ఎదురు తిరిగాడు. మెట్రో డ్రామా వెనుక 280 ఎకరాలను కొల్లగొట్టే కుట్ర అన్నాడు.
రైతుల పండుగ అని .. అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు అర్థశతదినోత్సవ వేడుకలా? అని వెటకారం జోడించాడు. కాగ్ లెక్కలు ఒకటి చెబితే.. కాకిలెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డాడు. తాము మొత్తం చేసిన అప్పు 2.80 లక్షల కోట్ల అప్పు కాగా.. రైతుల కోసం 5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నాడు.
నీకు ఐడెంటిటీ క్రైసిస్ ఉందన్నాడు రేవంత్‌ను. ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతున్నావని, అందుకే కేసీఆర్ బయటకు వస్తే.. తన పరపతి పెరుగుతుందని ఆయన మీద విమర్శలు చేస్తున్నాడన్నాడు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ కూడా ఇస్తలేడంటున్నావ్..? మరి ఎందుకు ఇన్ని సార్లు పోయినవ్..? అని నిలదీశాడు.
అన్ని విషయాలపై తన సహజ శైలికి భిన్నంగా.. ఓపిగ్గా, ఎక్కడా కంట్రోల్ తప్పకుండా రేవంత్ తిట్లకు బదులిచ్చాడు. విమర్శలకు కౌంటర్లిచ్చాడు. ఆరోపణలను తిప్పికొట్టాడు. చర్చకు రెడీ అని తొడలు చరిచాడు. కాస్కో అని రేవంత్‌కు సవాల్ విసిరాడు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క దగ్గరే పోగొట్టుకున్నాడు. గంటపాటు ప్రెస్‌మీట్ బాగానే బోర్ లేకుండా, గణాంకాలతో సహా వచ్చి మరీ చెప్పడం బాగానే కనెక్టయ్యింది.
కానీ.. దివాళా తీశామని పదే పదే ఎందుకు చెబుతున్నావ్.. నువ్వే కదా సీఎంవు.. నీ ఇజ్జతే పోతది కదా..? అని హితబోధ చేసుకుంటూనే.. పుసుక్కున ఓ మాటన్నాడు. ఎవరికీ ఇస్తందుకు పైసలు లేవు గానీ, రాహుల్‌కు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు వెయ్యి కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి..? అన్నాడు కేటీఆర్.
ఇది ఉత్తి చెత్త ఆరోపణ అని అతనికి కూడా తెలుసు. నువ్వింతగా ప్రిపేరై.. గణంకాలతో సహా వచ్చి మరీ మాట్లాడుతున్నప్పుడు.. మధ్యలో ఈ గాలి ఆరోపణ ఎందుకు? ఉట్టిగనే ఓ వెయ్యి కోట్లు రాహుల్‌కు ఇచ్చాడు..? అంటే జనం నమ్మేస్తారా?!
అంటే నువ్వు ఇప్పటిదాకా చెప్పిన గణంకాలన్నీ ఇట్లాంటి గాలి మాటలనే అనుకోవాలా? ఈ రాహుల్‌కు వెయ్యి కోట్లు.. అనే ఆరోపణను బీఆరెస్ ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నది. దీన్ని కేటీఆర్‌తో పాటు ఆరెస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ పార్టీ మీటింగుల వేదికల్లో విరివిగా వాడుతున్నారు. అదెంత చీప్‌గా ఉన్నదంటే.. ధాన్యం నింపేందుకు గోనె సంచులు లేవు.. వాటిల్లో రేవంత్ డబ్బులు నింపి.. ఢిల్లీకి పంపుతున్నాడు.. అని ఆరోపిస్తున్నారిద్దరు.
ఇంతకన్నా చీప్ ఆరోపణ ఉంటుందా? సేమ్, ఇప్పుడూ అలాగే, అంత సీరియస్‌గా కేటీఆర్ తమ పాలన గురించిన వివరాలు చెబుతున్నప్పుడు.. ఈ గాలి ఆరోపణ.. రాహుల్‌కు వెయ్యి కోట్లు.. అని కచ్చితమై ఫిగర్‌తో సహా చెప్పడం.. నువ్వు చెప్పిన గాలి లెక్కల్లో ఇదీ ఓ భాగమే అనుకోవాలా? అందుకే అన్నది.. కొండంత రాగం తీసి.. అని!