Mining Department: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర గనుల శాఖలో విచిత్రమైన అధికార కేంద్రీకరణ సాగుతోంది. ఖనిజ సంపదను పర్యవేక్షించాల్సిన, ప్రభుత్వ ఖజానాకు సింహభాగం ఆదాయాన్ని చేకూర్చాల్సిన ఈ కీలక శాఖలో.. ఇప్పుడు ‘ఐటీ’ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విభాగం పెత్తనం నడుస్తోందనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కేవలం సాంకేతిక సాయం అందించడానికే పరిమితం కావాల్సిన కొందరు సిబ్బంది. క్షేత్రస్థాయిలో బల్క్ ఇసుక కేటాయింపులు, రీచ్‌ల నిర్వహణను శాసించే స్థాయికి చేరయనే ప్రచారం జరుగుతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, కొందరు పెద్దల అండదండలతో ఏళ్లుగా ఒకే చోట తిష్టవేసిన కొందరు ఐటీ విభాగం ఉద్యోగులు. మైనింగ్ శాఖను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ వ్యవస్థలోని లోపాలను సాకుగా చూపుతూ సమాంతర వ్యవస్థను నడుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గత కొన్నేళ్లుగా ఇసుక అమ్మకాలు, లీజులు, బల్క్ ఇసుక కేటాయింపులు అన్నీ ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతున్నాయి. పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఈ డిజిటల్ వ్యవస్థే ఇప్పుడు కొందరికి కామధేనువుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఐటీ విభాగానికి చెందిన కొందరు సిబ్బంది టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షేత్రస్థాయిలో రీచ్‌ల కేటాయింపులు, బల్క్ ఆర్డర్ల అప్రూవల్స్ లో చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎవరికి ఏ రీచ్ కేటాయించాలి? ఏ బల్క్ ఆర్డర్ ను ముందుగా క్లియర్ చేయాలి? అనే విషయాల్లో క్షేత్రస్థాయి అధికారుల కంటే ఈ ఐటీ విభాగం నేతృత్వంలోనే స్క్రిప్ట్ నడుస్తోందని మైనింగ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
పారదర్శకంగా జరగాల్సిన కేటాయింపుల్లో లూప్‌హోల్స్ (లోపాలు) సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన వందల కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ లాగ్‌లలో మార్పులు చేయడం, సిస్టమ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా తెరవెనుక భారీగా అవినీతికి ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యల నెపంతో డిజిటల్ లాగ్‌లలో మార్పులు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన వందల కోట్ల ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also read: హనుమకొండలో విషాదం.. పెళ్లింట్లో విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి
అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకత పెంచేందుకు ఐటీ విభాగంలోని కీలక సిబ్బందిని ప్రతి 20 నెలలకు ఒకసారి తప్పనిసరిగా బదిలీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే, ఈ ప్రతిపాదనలు ప్రతిసారీ ఉన్నతాధికారుల టేబుల్స్ పైకి రావడం, అక్కడ నుంచి బుట్టదాఖలు కావడం పరిపాటిగా మారిందనే ప్రచారం జరుగుతుంది.
ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఒకే పోస్టింగ్‌లో గరిష్టంగా మూడేళ్లు, అత్యంత కీలక విభాగాల్లో అయితే ప్రతి 20 నెలలకు (రెండేళ్ల లోపు) ఒకసారి సిబ్బందిని బదిలీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ, మైనింగ్ శాఖలోని ఐటీ విభాగంలో మాత్రం ఈ రూల్స్ గాలికి కొట్టుకుపోయాయనే విమర్శలు వస్తున్నాయి. కొందరు సిబ్బంది ఏళ్లుగా ఒకే చోట, ఒకే సీటుకు అతుక్కుపోయారు. వీరికి శాఖలోని కొందరు ఉన్నతాధికారుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ దీర్ఘకాలిక పోస్టింగుల వల్లే వీరు స్థానిక ఇసుక మాఫియాతో, దళారులతో బలమైన నెట్‌వర్క్ ఏర్పరచుకున్నారని, దీనిపై ఉన్నతాధికారుల నిఘా పూర్తిగా కరువైందని సమాచారం. బదిలీల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘సాంకేతిక నిర్వహణ కష్టమవుతుంది’ అనే సాకుతో కొందరు ఉన్నతాధికారులే ఫైళ్లను తొక్కిపెడుతూ, అవినీతికి పరోక్షంగా ఊతమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Also read: Ramchander Rao: నేటితో ఏడాది పూర్తి.. టీ బీజేపీ ప్రెసిడెంట్ ఇయర్ మార్క్ పాలిటిక్స్ ఇవే..!
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆన్‌లైన్ ఇసుక బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఉద్దేశమే పారదర్శకతను పెంచడం, దళారీ వ్యవస్థను నిర్మూలించడం. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చట్టంలోని లూప్‌హోల్స్‌ను వాడుకుని కొందరు అధికారులు, దళారీలు కలిసి సామాన్యుడిపై ధరల భారంమోపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్ పోర్టల్‌లో సామాన్యుడికి స్టాక్ లేదంటూ ఎర్రర్ లు చూపిస్తూ, మరోవైపు ఎలాంటి అనుమతులు లేని దళారీల బల్క్ ఆర్డర్లకు టీజీఎండీసీలోని కొందరు అధికారులు క్షణాల్లో అప్రూవల్స్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పత్రాల తప్పులను సాకుగా చూపి ఆధార్ పేరుతో దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గత 2025 -2026లో జరిగిన బల్క్ అప్రూవల్స్, స్టాక్యర్డ్స్ నుంచి మరో స్టాక్యర్డ్స్ ట్రాన్స్ఫర్స్ పై సమగ్ర విచారణ జరపకపోతే, ఇసుక పాలసీ అనేది కేవలం సామాన్యుడిని దోచుకోవడానికి, దళారీలను పోషించడానికి మాత్రమే పరిమితం అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎస్అండ్ ఎమ్ ఐటీ లో పనిచేసే వారిని ప్రతి 20నెలలకు ఒకసారి మార్చితే అవినీతి జరగడానికి అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వానికి రావాల్సిన మైనింగ్, ఇసుక ఆదాయాన్ని కాపాడాలంటే.. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఏళ్లుగా ఒకే చోట తిష్టవేసిన ఐటీ విభాగంపై సమగ్ర నిఘా పెట్టాలని, నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సాంకేతికత అనేది పాలనను సులభతరం చేయడానికి, అవినీతిని అరికట్టడానికి ఉపయోగపడాలి కానీ, అదే అవినీతికి ఒక సాధనంగా మారకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఘా పెంచితేనే ఖజనాకు రక్షణ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?