ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై… యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్.. ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్…! భర్తృహరి నీతి శతకంలోని సుభాషితం ఇది. తరుచూ ఈ పద్యం కేసీఆర్ పలు వేదికల మీద చాలా సందర్బాల్లో గుర్తు చేస్తూ ఉంటారు. కేసీఆర్ ఉద్దేశ్యం ఏమిటంటే.. తాను పార్టీ పెట్టి.. తెలంగాణ కోసం ప్రాణం పోయే వరకు కొట్టాడిన విధానం.. లక్ష్యం కోసం కొసదాక కొన ఊపిరిని పణంగా పెట్టిన వైనం.. ఇవన్నీ గుర్తుచేస్తూ ఈ పద్యానికి ఆపాదిస్తూ ఉంటారు. తాజాగా తలైవా రజినీకాంత్ చేసిన ఓ కామెంట్ వైరల్‌గా మారింది.
విజయ్‌తో తనను పోల్చొద్దని, ఇద్దరికీ ఏజ్ గ్యాప్ బాగా ఉందని, తను పార్టీ పెట్టడంతోనే గెలిచి చిన్న వయస్సులో విజయం సాధించాడని… అన్నారు. తనకు విజయ్ గెలపు పట్ల కుళ్లు లేదని అన్న ఆయన… కమలహాసన్ గెలిస్తే మాత్రం అసూయపడేవాడినన్నాడు. ఇది కూడా హాస్య దోరణిలోనే. ఇక ఇదంతా ఒకెత్తయితే.. తనూ పార్టీ పెడితే పక్కా గెలిచెటోణ్ణే అని ముక్తాయించడమే చర్చకు దారి తీసింది. ఆథ్యాత్మికత వైపు క్రమంగా తనను తాను మలుచుకుని..అందులోనే లీనమైపోవడానికి సిద్దపడ్డ రజినీ వివాదాలకు దూరం. అన్ని విషయాలపై అపారమైన పట్టు, పరిణతి సాధించాడు. అది ఓకే. కానీ రాజకీయ రంగం పూర్తి భిన్నం. అది అతనికీ తెలుసు. అందుకే 2017 నుంచి మూడేళ్ల పాటు.. ఇదిగో పార్టీ పెడుతున్నా.. అదిగో పెడుతున్నా అని తన ఆరోగ్య కారణాలతో వెనక్కి తగ్గారు.
ఇక పార్టీ పెట్టే ఊహాగానాలకు తెరపడింది. స్నేహితుల కోసం ప్రాణమిచ్చేతత్వం రజినీది. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని తెలిపిన రజినీ.. అతను ఓడిపోగానే వెంటనే అక్కడికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చాడు. ఇక్కడ మోహన్‌బాబుతో కూడా మంది దోస్తానా ఉంటుంది రజినీ. ఆ మాటకొస్తే అంతా రజినీకి ఆత్మీయులే. కానీ మోహన్‌బాబు ఫ్యామిలీతో కొంచెం చనువెక్కువ. ఆత్మీయతా ఎక్కువే. సినిమాల్లో మొత్తం పోగొట్టుకుని అప్పులపాలై ఉన్న తనకు వద్దకు 40 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్లాడని స్వయంగా మోహన్‌బాబే చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక్కడ రజినీతో విజయ్‌న్ పోచ్చలేం. ఇదే అన్నాడు రజినీ కూడా. ఇద్దరి మధ్య ఒక జనరేషన్ ఏజ్ గ్యాప్ ఉందని.
కానీ రజినీలోని అణకువ, వివాదరహిత మనస్తత్వం, ఆథ్యాత్మిక మార్గం, పరిణతి.. ఇవన్నీ విజయ్‌లోనూ ఉండొచ్చు. కానీ వీటికి అదనంగా విజయ్‌లో ఉన్నది డేర్. అదే లేదనాలి రజినీలో. అవును.. రాజకీయ పార్టీ పెడితే నేను గెలిచేటోన్నేలేవోయ్….!అని తీసిపారేసినట్టుగా మాట్లాడే సీన్ లేదు దానికి. ఎందుకంటే.. రాజకీయ పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు. మధ్యలో అది కాదని కాడెత్తిసి పోయిన వాళ్లెంతో మంది ఉన్నారు. చిరంజీవి సహా. చాలా విషయాలను తలైవా ఓపెన్‌గా చెప్పుకుంటాడు. తనలోని లోపాలు సహా. ఈ విజయ్ విషయంలో చేసిన కామెంట్లలో ఇక్కడ ఆ ముచ్చట చెప్పలేదు. తన మీద తనే సెటైర్లు వేసుకుని నవ్వించే మంచి హస్య చలోక్తి కలిగిన రియల్ హీరో రజినీ. అందులో డౌట్ లేదు. పార్టీ పెట్టాలనే ఆలోచన చేయడమే ధైర్యంతో కూడుకున్నది.
పెట్టిన తరువాత వచ్చే ఆటంకాలు, ఇబ్బందులు, రాజకీయ కుతంత్రాలు…. ఇవన్నీ ఎదుర్కోవడం సినిమాలో నటించినంత ఈజీ కాదు. ఆ విషయంవ దూరం నుంచే చూసి తెలుసుకుని వెనకడుగు వేశాడు రజినీ. నిజంగా ఆయన పార్టీ పెట్టి ఉంటే.. గెలిచేవాడే. సీఎం కూడా అయ్యేవాడే. కానీ అది ఎన్నాళ్లపాటు కాపాడుకునేవాడు.. ఎంతకాలం రాజకీయంగా మనుగడ సాధించగలిగేవాడనేదే డౌట్. ఇక్కడ విజయ్‌కు ఆదిలోనే మంచి అనుభవం ఎదురైంది. మరింత రాటుదేలిన రాజకీయ నాయకుడి లక్షణాలు అలవర్చుకోవడం, ఎత్తుకు పైఎత్తు వేయడం.. విమర్శకు ప్రతివిమర్శ.. ఇవన్నీ నేర్చుకుని ముందుకు సాగే గుణం ఉంది కాబట్టి.. డౌట్ లేదు. తెలంగాణలో కవిత.. పార్టీ కూడా ఓ సంచలనమే. ఎంత వరకు దాన్ని నిలబెట్టుకుని, సక్సెస్ దిశగా ముందుకు సాగుతుందనేది భవిష్యత్ తేల్చుతుంది. కానీ పార్టీ పెట్టి.. రాజకీయ లక్ష్యాన్ని సాధించాలనుకోవడం.. ముందడుగు వేయడమే అసలైన ధీరులు చేసే పని. ఆ ధీరుల లిస్టులో రజినీ లేడు..