గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ దేశ స్థాయిలో చర్చకు తెర లేపింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసు విషయంలో ఎంటరై.. కనీసం బూడిదైనా ఇవ్వండి అని అడిగేదాకా తెచ్చుకున్నారంటే ఏపీ పోలీసుల దౌర్జన్య కాండ ఏ విధంగా ఉందో అందరికీ అర్థమైపోయింది. ఏపీ సర్కార్‌పై.. అక్కడి పోలీసు వ్యవస్థపై తీవ్రంగా మండిపడింది ఎన్‌హెచ్ఆర్‌సీ.
ఇదింకా సద్దుమణగనే లేదు… మరో కస్టోడియల్ టార్చర్ కేసు వచ్చి పడింది ఏపీ సర్కార్ ముందు. నెల్లూరుకు చెందిన రవీంద్ర అనే వ్యక్తి.. తనపై పాత కేసు ఉందని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయి రెండు రోజుల పాటు లాకప్‌లోనే ఉంచి నాలుగు లాఠీలు విరిగేదాకా కొట్టారని ఫిర్యాదు చేశాడు. ఓ టీడీపీ నేత చెప్పిన ప్రకారంగా ఎస్సై కాసుల శ్రీనివాస్ తనను కస్టోడియల్ టార్చర్‌కు గురి చేశాడని, తన భార్యను గర్బవతి అని కూడా చూడకుండా.. దుర్భాషలాడాడని, బయట ఎవరికైనా చెబితే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాని చెప్పడం.. అక్కడి పోలీస్ వ్యవస్థ మీద మరింత చర్చకు తావిచ్చినట్టైంది.
ఇలా ఒక్కొక్కటిగా కేసులు బయటపడుతూ ఉండగా.. మరోవైపు.. అమరావతి భూముల లొల్లి మళ్లీ రాజుకుంది. ఉండవల్లి, పెనుమాక గ్రామస్తులు.. తమ వద్ద నుంచి బలవతంగా భూములు లాక్కున్నారని, ఎకరాకు 4 కోట్ల వరకు పలికే భూమికి 25 లక్షల దాకా ఇచ్చి తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై వైఎస్సార్ సీపీ రైతుకు మద్ధతు తెలిపేందుకు అక్కడికి వెళ్లడంతో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
ఇప్పటికే అమరావతి విషయంలో వైఎస్సార్‌సీపీ పూటకో మాట మాట్లాడుతోంది. మావిగన్ అని కొత్త పేరు తెరమీదకు తీసుకురావడం, తాజాగా పేర్ని నాని.. అమరావతి రాజధానిగా ఉండబోదని కామెంట్ చేయడం.. ఇంకా జనాలను గందరగోళ పరుస్తుండగా.. ఈ భూముల లొల్లిని మళ్లీ తెరపైకి తెచ్చారు. వైఎస్సార్ సీపీ రాజకీయంగా ఈ రెండు అస్త్రాలను కూటమి ప్రభుత్వంపై ప్రయోగిస్తున్నది.
దీంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి దాకా కుల రాజకీయం అన్నారు. మతం రంగు ఎందుకు పులుముతున్నారని బాబును టార్గెట్ చేశారు. తాజాగా అమరావతి భూముల లొల్లిని తెరపైకి తెచ్చి రచ్చ చేయడం.. ఇవన్నీ చూస్తే కూటమి ప్రభుత్వాన్ని ఊపిరి మెసలనీయకుండా జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
మధ్యలో పవన్ కళ్యాణ్ వ్యవహారం, రాజకీయంగా ఆయన చేసే కామెంట్లు కూడా చంద్రబాబును ఇరుకున పెడుతున్నాయి. ఉచితాలు తనకు నచ్చవని, అవి మనల్ని గెలిపించలేవనే కామెంట్లు కూడా ఇబ్బందికరంగా మారాయి బాబుకు. ఇన్నేండ్లు సీఎంగా చేసిన బాబుకు తెలుసు.. ఏ సంక్షేమ పథకం ఎలా జనాలను అట్రాక్ట్ చేస్తుందో.. ఉచితాలు ఎలా ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతాయో…!
కానీ ఇక్కడ పవన్ తన సొంత ఆలోచనలతో కూడిన కామెంట్ల ద్వారా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులను తనకు తెలియకుండానే తెచ్చిపెడుతున్నాడనే భావన ఏపీలో మొదలైంది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనుకుంటే… జగన్ పార్టీ ఓడిపోకపోయేదని, దానికి 11 సీట్లే వచ్చాయని పవన్ చేసిన కామెంట్లు కూడా ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారనున్నాయి.