ఇదే ఒరవడిని ఇక ముందూ సర్కార్ కొనసాగించాలి. సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు పెట్టుబడి సాయం అందితే ఆ ఆనందమే వేరు. అప్పుల కోసం దిక్కులు చూసే పరిస్థితి ఉండదు. అదేంటీ..! మొన్ననే కదా ధాన్యం అమ్ముకున్నది. పెట్టుబడికి సొమ్మే లేకుండా రైతులున్నారా? అని అడిగితే.. వారికి క్షేత్రస్థాయిలో కర్షకులు ఎదుర్కొనే ఇబ్బందులు తెలియవని అర్థం చేసుకోవాలి.
బోనస్ అమౌంటు పడి ఉంటే కొంత ఉపశమనం ఉండేది. కానీ ఆ ముచ్చట తీయడం లేదు సర్కార్. అదెప్పుడు వేస్తారో వారికే క్లారిటీ లేదు. పెట్టుబడి సాయం అందించగానే.. ఆ సొమ్ముతోనే రూపాయి భారం లేకుండా..ఎవుసమంతా పూర్తి అవుతందునుకుంటే వారికి ఆ సాగు మీద జీరో నాలెడ్జి ఉందన్నమాట.
వచ్చిన పైకం ఇలా చేతిలో పట్టుమని పది రోజులు కూడా ఉండవు రైతుల దగ్గర. పాత అప్పులు, కొత్త నారుమళ్లు.. బాకీలు తీర్చుడు.. మళ్లీ ఎవుసం కోసం ఆర్థిక భారం మోసేందుకు సిద్దం కావడం… ప్రతీ సీజన్‌లో ఇవి కామనే. అయితే సర్కార్ అందించే ఈ రైతు భరోసాతో ఎకరాకు రూ. 6వేల పెట్టుబడిసాయం.. ఉడతా భక్తిగా రైతుకు ఉపయోగపడుతుందన్నమాట. అవి ఏ మూలకు సరిపోకున్నా.. ఆసరాగా మాత్రం నిలుస్తాయనడంలో సందేహం లేదు.
అవి కూడా సరిగ్గా సమయానికి పడితే.. రైతుల ముఖాల్లో ఆనందానికి అంతు ఉండదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి ఈ విషయంలో బాలారిష్టాలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఏ ఒక్క టర్ము కూడా సరిగ్గా ఈ సర్కార్ రైతు భరోసా వేయలేదు. కొన్ని సీజన్లు ఎగవేసింది కూడా. కానీ ఇకపై ఇది చెల్లదు. రైతులు ఇప్పటికే విసిగి పోయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితి లేదు. ఇంకా పదేళ్ల పాలన వల్లే అని సర్దిచెప్పుకుని, సమర్థించుకునే పనిని బంద్ చేయాలి. గతంలో వేసిన భరోసాలో కూడా రెండెకరాలకే పరిమితవుతూ వస్తోంది సర్కార్. గణాంకాలు మాత్రం బాగానే చెబుతున్నా.. తొమ్మది వేల కోట్లు వేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నా.. అవి చివరి రైతు వరకు చేరడం లేదు.
అందరి రైతుల ఫోన్లూ టకీ టకీ మనడం లేదు. ఈ పథకం ఊపు, ఉత్సాహాన్ని కాంగ్రెస్ సర్కార్ నీరు గార్చిందనే చెప్పాలి. గతంలో కేసీఆర్ బహిరంగ వేదికల మీద ఈ పథకం గురించి చెబుతూ.. టింగ్ టింగ్‌మని రైతుల ఫోన్లు పైసలు పడ్డ మెసేజ్‌లతో మోగుతాయని.. చెప్పడం బాగా కనెక్టయ్యింది. ఇది అచ్చంగా దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి.. 108 గురించి వివరించే క్రమంలో కుయ్యి.. కుయ్యి.. కుయ్యి మంటూ వాహనాలు చేసే శబ్దాలను చేసి మరీ వినిపించడం కూడా జనాలకు బాగా కనెక్టయ్యింది.
కానీ రేవంత్‌రెడ్డి టకీ టకీ మాత్రం అంతలా ఆదరణ పొందలేదు. కారణం.. ఈ సర్కార్ ఏ సీజన్‌కూ సరిగ్గా సమయానికి పెట్టుబడి సాయం అందించలేదు. అందరికీ రైతు భరోసా ఇస్తున్నామని చెబుతున్నా.. అవి రెండెకరాలకు, మూడెకరాల వరకే పరిమితవడం.. రైతులను తీవ్ర నిరాశకు లోను చేస్తున్నది.
గతంలో కేసీఆర్ కూడా ఒకేసారి అమౌంట్‌ను సర్దుబాటు చేయలేకపోయాడు. నెల రోజుల పాటు వేస్తూ పోయాడు. కానీ అందరికీ రైతు బంధు వచ్చింది. రాళ్లు, రప్పలు, రియల్ భూములకు కూడా పెట్టుబడి సాయం అందింది. ఇక్కడే కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రజలకు కూడా ఇది నచ్చలేదు. కాంగ్రెస్ దీన్ని మారుస్తామన్నది. కానీ వ్యవసాయం చేసుకునే వారికి కూడా పూర్తి స్థాయిలో భరోసా రాకపోవడమే వారిని షాక్ కు గురి చేస్తున్నది.