14 Days Girlfriend Intlo Movie Review : పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలాంటి టైంలో ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ అనే చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. పలు హిట్ సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య ఈ సినిమాలో కథానాయకుడు. మరి ఈ సినిమాతో అతను హిట్టు కొట్టాడో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి…
కథ:
సినిమా కథ ఏంటి అన్నది ట్రైలర్లోనే చాలా వరకు చెప్పేశారు. హర్ష(అంకిత్ కొయ్య) తన గర్ల్ ఫ్రెండ్ అహానా (శ్రియా కొంతం)ని ప్రైవేట్ కలుసుకునే అవకాశం రావడంతో ఆమె ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్లడం వల్ల.. ప్రైవేట్ గా కలుసుకోవడానికి ఆమె అతన్ని పిలుస్తుంది. ఈ క్రమంలో ఆలస్యంగా పడుకోవడం వల్ల హర్ష ఉదయాన్నే నిద్ర లేవలేకపోతాడు. మరోపక్క హీరోయిన్ అతన్ని నిద్రలేపడం ఇష్టం లేక స్పేర్ ఇంటి తాళం ఒకటి అతనికి అందుబాటులో పెట్టి వెళ్తుంది. ఆమె తన ఫ్యామిలీతో వచ్చేలోపు నిద్రలేచి ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని ఫోన్ చేసి చెబుతుంది. దీంతో హర్ష తన స్నేహితుడు క్రియేటర్ కిస్(వెన్నెల కిషోర్) కి ఫోన్ చేసి పిలుస్తాడు. అతనికి బాల్కనీలోకి వచ్చి కీ ఇచ్చే ప్రాసెస్లో.. కిస్ కీ పడేస్తాడు. దానిని కట్టిపెట్టి కిస్ హీరోని బయటకి తీసుకొచ్చేలోపు హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి తిరిగి వచ్చేస్తారు.దీంతో హీరో అలాగే అతని స్నేహితుడు హీరోయిన్ ఇంట్లో లాక్ అయిపోతారు. 14 రోజుల వరకు వాళ్ళు బయటపడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫైనల్ గా వాళ్ళు ఎలా బయటపడ్డారు.. ఈ మధ్యలో వాళ్లకి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ మిగిలిన కథ.
విశ్లేషణ :
చెప్పుకోవడానికి కథ ఏమీ లేని ఈ సినిమాని దర్శకుడు శ్రీహర్ష మన్నే తన టేకింగ్ తో మేనేజ్ చేయాలి అని ప్రయత్నించాడు. ఇందులో భాగంగా కామెడీని మిక్స్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ దురదృష్టానికి అది ఎంత మాత్రం పేలలేదు. యూట్యూబ్లో వదలాల్సిన ఒక ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిలింని అతను ఓటీటీ కోసం చేశాడు అని చెప్పడమే కన్విన్సింగ్ గా అనిపించదు. అలాంటిది బిగ్ స్క్రీన్ కోసం చేశారు అంటే.. ఎందుకు కన్విన్సింగ్ గా అనిపిస్తుంది? వెన్నెల కిషోర్ వంటి స్టార్ కమెడియన్ ను పెట్టుకుని కూడా అతను కామెడీ పండించలేకపోయాడు అంటే.. రైటింగ్ ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యూత్ ని టార్గెట్ చేసి ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ అనే టైటిల్ ను పెట్టారు. నిబ్బానిబ్బి బ్యాచ్ ను టార్గెట్ చేయడానికి ట్విట్టర్, డిజిటల్ వంటి వాటిలో ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేశారు.వాళ్లకి కావాల్సిన సీన్లు ఏవో సినిమాలో ఉంటాయనే ఆశ కూడా ఆ ప్రమోషన్స్ లోనే చంపేశారు. పోనీ ఒకవేళ సినిమాలో ఇంకేమైనా ఉంటాయేమో అని వారు ఆశపడి వచ్చినా.. కాసేపటికే వాళ్ళు విరక్తితో బయటకి వెళ్లిపోవడం తప్ప.. వాళ్ళు కూడా చేసేది ఏమీ ఉండదు. హాస్యం కూడా అపహాస్యం అయ్యింది కాబట్టి.. ఆ రకంగా కూడా సినిమా ఎంగేజ్ చేయదు. సత్య కోమల్ ఈ సినిమాకి నిర్మాత. కానీ కనీస స్థాయి నిర్మాణ విలువలు లేకుండా ఈ చిత్రాన్ని ఆయన రూపొందించారు. సోమ శేఖర్ సినిమాటోగ్రఫీ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కంటే తక్కువ స్థాయిలో ఉండటం వల్ల.. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. ఇక ప్రదీప్ రాయ్ ఎడిటింగ్ గురించి చెప్పుకోవాలి అంటే..ఉన్న గంటన్నర కంటే కూడా ఇంకాస్త ఎక్కువ కట్ చేసి ఉండాల్సింది కదా అని అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. మొన్నామధ్య వచ్చిన ‘ఆయ్’ సినిమాలో తన గర్ల్ ఫ్రెండ్ కాదు కాదు ఆంటీ ( సరయు) ని కలవడానికి వెళ్లి.. ఆమె భర్త వచ్చే టైంకి ఆమె ఇంట్లో ఇరుక్కుపోతాడు. ఆ ఒక్క లైన్ తోనే ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ సినిమా కూడా ఉంటుంది. ‘ఆయ్’ లో ఆ ఒక్క సీన్ చేశాక కూడా ఈ సినిమా చేయాలని అంకిత్ కొయ్య ఎందుకు అనుకున్నాడో అతనికే తెలియాలి. బహుశా పారితోషికం ఎక్కువ ఆఫర్ చేయడం వల్ల చేసేశాడేమో. ఇక హీరోయిన్ శ్రియ కొంతం ఒకటి, రెండు ఎక్స్ప్రెషన్స్ కే పరిమితమైంది. వెన్నెల కిషోర్ కూడా కొత్తగా చేసింది ఏమీ లేదు. అతని పెర్ఫార్మన్స్ కూడా కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పిస్తుంది. ఇక ఇంద్రజ వంటి సీనియర్ నటీనటులను కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. మిగతా వాళ్ళ పాత్రలు కూడా రిజిస్టర్ కావు.
ప్లస్ పాయింట్స్ :
గంటన్నర రన్ టైం మాత్రమే ఉండటం
మైనస్ పాయింట్స్ :
మిగతావన్నీ
చివరిగా.. ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ సినిమాకి వెళితే ఇందులో హీరో బుక్కైనట్టు ప్రేక్షకులు కూడా బుక్కై పోయినట్టే..!
14 Days Girlfriend Intlo Movie Rating : 0.5 / 5