రివ్యూ : గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ
నటీనటులు : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్ తదితరులు
దర్శకత్వం : అధిక్ రవిచంద్రన్
మ్యూజిక్ డైరెక్టర్ : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వైవి రవిశంకర్
Good Bad Ugly Review : కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన తమిళ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. మైత్రి మూవీస్ వారే సినిమాను నిర్మించినప్పటికీ తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. అయినప్పటికీ తెలుగులో అజిత్ కు ఉన్న మార్కెట్.. త్రిష, అర్జున్ దాస్, సునీల్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, జాకీ ష్రాఫ్, ప్రియా ప్రకాష్ వారియర్ వంటి స్టార్ తారాగణం ఉండడంతో భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలను అందుకుందా? అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
ముంబైలో అతిపెద్ద గ్యాంగ్ స్టార్ రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే. భార్య కండిషన్ కారణంగా అతను 18 సంవత్సరాలు జైలులో గడపాల్సి వస్తుంది. ఎట్టకేలకు 18 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని తన కొడుకు విహాన్ ను కలవడానికి బయటకు వస్తాడు. కానీ అంతలోనే కొడుకు విహాన్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యారని తెలుసుకుంటాడు. కొడుకుని ఎలాగైనా సరే ఈ కేసు నుంచి కాపాడాలని ఆలోచనతో ఏకే మరోసారి రెడ్ డ్రాగన్ గా మారి, దీనికి బాధ్యులైన వారిని వెతకడానికి బయలుదేరతాడు. ఈ జర్నీ అతన్ని కవల సోదరులు జామి, జానీల దగ్గరకు తీసుకెళ్తుంది. అసలు ఈ రెడ్ డ్రాగన్ ఎవరు? గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? ముంబైని కుదిపేసే రేంజ్ ఉన్న ఈ గ్యాంగ్స్టర్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? చేయని తప్పుకు జైలుకెళ్ళిన విహాన్ రిలీజ్ అవుతాడా? ఏకే గతంలో దాగివున్న సీక్రెట్స్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ
2023లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’ తరువాత డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ చేసిన మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అయితే ‘మార్క్ ఆంటోనీ’లో అధిక్ కు ప్లస్ పాయింట్ అయిన అంశమే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో మైనస్ పాయింట్ గా మారింది. అయితే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని అజిత్ అభిమానిగా ఆయనను తెరపై ఎలా చూడాలి అనుకుంటున్నానో అలాగే తెరకెక్కిస్తున్నానని డైరెక్టర్ ముందుగానే చెప్పేశాడు. కానీ కథ లేకుండానే సినిమా మొత్తాన్ని నడిపించాడు. పాత సినిమా రిఫరెన్స్ లు, పాటలతో నిండిపోయింది మూవీ. నిజానికి నోస్టాల్జియాను క్రియేట్ చేయడానికి ఇదొక అద్భుతమైన టెక్నిక్. కానీ అతిగా చేస్తే అది బోరింగ్ గా మారి దెబ్బ పడడం ఖాయం. ‘మార్క్ ఆంటోనీ’లో ఈ ఫార్ములాను బాగా ఉపయోగించుకున్నాడు అధిక్. అయితే హిట్ అయింది కదా అని ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అదే రిపీట్ చేయడమే కాకుండా రిఫరెన్స్ లు ఎక్కువగా వాడడం ఆడియన్స్ ను అలరించడానికి బదులు చిరాకు తెప్పిస్తుంది.
ఎలివేషన్ సన్నివేషాలు, స్లో మోషన్ షాట్స్ బలవంతంగా తీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో ప్రతి పాత్ర కూడా డైలాగులతో మోత మోగిస్తుంది. ఆ డైలాగులు వింటుంటే వాట్సాప్ స్టేటస్ లు చూస్తున్నామా ? తమిళ స్టార్ అజిత్ సినిమానే చూస్తున్నామా అనే అయోమయంలో పడతారు ప్రేక్షకులు. యాక్షన్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో మొదలవుతుంది. ఇక ఆ తర్వాత కొన్ని ఎవర్ గ్రీన్ పాటలతో పాటు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి. సినిమా ద్వితీయార్థంలో కొన్ని క్రేజీ యాక్షన్ సీన్స్, పాత్రల రివీలింగ్, సిమ్రాన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే భార్యా, కొడుకులతో హీరో భావోద్వేగ సీన్స్ కనెక్ట్ అవ్వవు. రెడ్ డ్రాగన్ బ్యాగ్రౌండ్ స్టోరీ, రమ్య – ఏకే రిలేషన్ అంత కన్వెన్సింగ్ గా అనిపించవు. ప్రసన్న, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, సునీల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ వంటి నటీనటులను హీరో రోల్ ఎలివేషన్ చేయడానికి వాడుకున్నారు.
మైనస్ పాయింట్సే ఎక్కువ
సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ పేలవంగా ఉంది. అర్జున్ దాస్ బాగానే నటించినప్పటికీ అజిత్ కు సరిపోయే పవర్ ఫుల్ విలన్ కాలేకపోయాడు. జాకీ ష్రాఫ్ ఉన్నా లేకపోయినా ఒకటే. త్రిష తెరపై కనిపించింది కొద్దిసేపే. అధిక్ రవిచంద్రన్ కథపై కంటే అజిత్ ను ఎలివేషన్స్ తో తెరపై స్టైలిష్ గా చూపించడంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. ఫలితంగా కథపై ఆ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా రెండవ భాగంలో ఇంటర్వెల్ బ్యాంగ్ స్పీడ్ ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. కొన్ని ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్ ఏంటంటే అజిత్ అభిమానులు గత కొంతకాలంగా తమ అభిమాన హీరో నుంచి మిస్సయిన మాస్, ఎనర్జిటిక్ ప్రజెన్స్ ను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో సక్సెస్ ఫుల్ గా చూపించారు. అజిత్ వింటేజ్ ఛార్మింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఫ్రేమ్ ని డామినేట్ చేస్తాడు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
Read Also : బిగ్ స్క్రీన్ పై బ్యాన్ అయిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీస్… ఇండియాలో ఏ ఓటిటిలో చూడొచ్చంటే?
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఒక ఫ్యాన్ బాయ్ సంభవం. అజిత్ కుమార్ డైహార్డ్ అభిమానులకు ఇదొక ట్రీట్. కానీ కథను ఆశించి, ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలో అడుగు పెట్టారంటే రోతగా ఫీల్ అవ్వడం ఖాయం.
Good Bad Ugly Rating : 1.25/5