రివ్యూ : ‘జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్’ హిందీ హీస్ట్ మూవీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్‌ఫ్లిక్స్
దర్శకులు : కూకీ గులాటీ, రాబీ గ్రెవాల్
నటీనటులు : సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్, నికితా దత్త, కునాల్ కపూర్ తదితరులు
నిర్మాత : సిద్ధార్థ్ ఆనంద్
బ్యానర్ : మార్ఫ్లిక్స్ పిక్చర్స్
జానర్ : యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్, హీస్ట్
Jewel Thief – The Heist Begins Review : ‘దేవర’ మూవీలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ హీస్ట్ థ్రిల్లర్ ‘జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్’. ఈ మూవీ ఈరోజు నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్’ హై-ఆక్టేన్ హీస్ట్ థ్రిల్లర్. ఇందులో రెహాన్ రాయ్ (సైఫ్ అలీ ఖాన్) ఒక కాన్ ఆర్టిస్ట్ – మాస్టర్ థీఫ్. అతను ఆఫ్రికాకు చెందిన అత్యంత విలువైన రెడ్ సన్ డైమండ్ ను దొంగిలించే డీల్ ను ఒప్పుకుంటాడు. గ్యాంగ్‌స్టర్ – బిజినెస్‌మన్ రాజన్ ఔలఖ్ (జైదీప్ అహ్లావత్) రెహాన్ కు ఈ డైమండ్ ను దొంగిలించే పనిని అప్పగిస్తాడు. ఇలా అనడం కన్నా బెదిరిస్తాడు అని చెప్పవచ్చు.
మరోవైపు రెహాన్ తండ్రిని బందీగా ఉపయోగిస్తూ, అతన్ని పట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు పోలీసు అధికారి విక్రమ్ పటేల్ (కునాల్ కపూర్). రాజన్ భార్య ఫరా (నికితా దత్త) గ్యాంగ్‌స్టర్ ను పెళ్లైతే చేసుకుంటుంది. కానీ భర్తతో సంతోషంగా ఉండదు. ముంబై, బుడాపెస్ట్, ఇస్తాంబుల్ నగరాల నేపథ్యంలో సాగే ఈ కథ ఒక హీస్ట్ థ్రిల్లర్ గా మొదలై… డబుల్-క్రాస్‌లు, మోసాలు, అనూహ్య ట్విస్ట్‌లతో నిండిన ప్రమాదకరమైన ఆటగా మారుతుంది. అసలు హీరో ఆ గ్యాంగ్ స్టర్ కు డైమండ్ ను తెచ్చి ఇవ్వగలిగాడా? పోలీసులు చివరికి రెహాన్ ను పట్టుకోగలిగారా? హీరోకి, గ్యాంగ్ స్టర్ భార్యకి మధ్య ఉన్న లింకు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ
‘జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్’ను ఒక స్టైలిష్ హీస్ట్ థ్రిల్లర్ గా ప్రమోట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ వంటి టాలెంటెడ్ నటులతో, సిద్ధార్థ్ ఆనంద్ లాంటి హై-ఆక్టేన్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. సాధారణంగానే హీస్ట్ థ్రిల్లర్ అంటే ఆసక్తి పెరుగుతుంది. కానీ ఈ మూవీతో పూర్తిగా నిరాశపరిచారు. కథలోని ట్విస్ట్ లు ఏమాత్రం ఆకట్టుకోవు. పైగా ఫ్లాట్ గా, ముందే ఊహించే ట్విస్ట్ లతో బోర్ కొట్టించారు. హీస్ట్ సన్నివేశాలు చూస్తున్నాం అని ఉత్సాహపడేలోపే అవి పూర్తయిపోతాయి. కథ మధ్యలో నీరసంగా సాగింది. హీస్ట్ ప్లానింగ్ సన్నివేశాలు వివరంగా చూపించకపోవడం వల్ల ఆ థ్రిల్ ఫీలింగ్ మిస్ అయ్యింది. డైలాగ్‌లు చాలా సాధారణంగా, కొన్నిసార్లు కామెడీగా అన్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో వచ్చే జాత్యాహంకార జోక్స్ (జపనీస్ టూరిస్ట్ పై హక్కా నూడుల్స్, సుషీ లాంటివి) అవసరమా అన్పిస్తుంది.
ఇక పాత్రల విషయానికొస్తే స్టీరియోటైపికల్ గా ఉన్నాయి. స్మార్ట్ థీఫ్, క్రూరమైన గ్యాంగ్‌స్టర్, నిస్సహాయ భార్య, వెంటాడే పోలీసు… కథలో కొత్తదనం లేకపోవడం ఒక పెద్ద లోపం. సినిమా విజువల్‌గా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అవసరమైన కథ, కథనం లేకపోవడం నిరాశ పరుస్తుంది. సిద్ధార్థ్ ఆనంద్ మునుపటి సినిమాలు పఠాన్, వార్, ఫైటర్ లాంటి గ్రాండ్ స్కేల్ లోనే ఈ మూవీ కూడా ఉన్నప్పటికీ, ఈ సినిమాలో ఆ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం లేదు.
నటీనటులు, టెక్నికల్ అంశాలు
సైఫ్ అలీ ఖాన్ రెహాన్ రాయ్ పాత్రలో తన సహజమైన చార్మ్‌ను చూపించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, సునాయాసమైన నటన బాగుంది. కానీ స్క్రిప్ట్ పరిమితుల వల్ల అతని పాత్ర పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రాజన్ పాత్రలో జైదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు కొంత బలాన్ని ఇచ్చింది. కానీ మేకర్స్ అతన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. కునాల్ కపూర్, నికితా దత్త సపోర్టింగ్ రోల్స్ ఏదో పేరుకు ఉన్నాయిలే అన్పిస్తుంది. సినిమా ముంబై, బుడాపెస్ట్, ఇస్తాంబుల్ నగరాల్లో తెరకెక్కడంతో విజువల్‌గా గ్రాండ్ లుక్ ను వచ్చింది. నియాన్-పింక్, రెడ్ లైటింగ్ వల్ల సినిమాటోగ్రఫీ కొన్ని సన్నివేశాలకు స్టైలిష్ టచ్ ఇచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, ముఖ్యంగా చేజ్ సీన్స్, హీస్ట్ సన్నివేశాలు పర్లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎనర్జిటిక్ వైబ్‌ను ఇచ్చింది. కొన్ని పాటలు అనవసరంగా అనిపించాయి. ఈ సినిమా చివర్లో “ది హీస్ట్ కంటిన్యూస్” అనే హింట్‌తో ముగుస్తుంది. కానీ ఈ సినిమాను చూశాక సీక్వెల్ కూడానా అనే నీరసం తప్పదు.
Read Also : ‘హవోక్’ మూవీ రివ్యూ
చివరగా
హీస్ట్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారు ఎలాంటి అంచనాలు లేకుండా ఓసారి చూడవచ్చు. ‘ధూమ్ 2’ లాంటి సినిమాల స్థాయి థ్రిల్‌ను ఎక్స్పెక్ట్ చేస్తే 1 గంట 56 నిమిషాల టైమ్ వేస్ట్.
Jewel Thief – The Heist Begins Rating : 1.5/5