రివ్యూ : ముత్తయ్య మూవీ
నటీనటులు : సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చందర్
దర్శకుడు : భాస్కర్ మౌర్య
ఓటీటీ ప్లాట్‌ఫాం : ఈటీవీ విన్
Muthayya Review : భాస్కర్ మౌర్య దర్శకత్వంలో వచ్చిన సోషల్ డ్రామా ‘ముత్తయ్య’. ఇందులో సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ETV Win ఓటీటీలో మే 1న డైరెక్టర్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా మొత్తం ఓ ముసలోడికి ఉన్న సినిమా పిచ్చి చుట్టూ తిరుగుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘ముత్తయ్య’ కథ తెలంగాణలోని వనపర్తి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో నడుస్తుంది. ముత్తయ్య (సుధాకర్ రెడ్డి) 70 ఏళ్ల వృద్ధుడు. అతనికి ఓ ఎకరం భూమి ఉంటుంది. వ్యవసాయంతో పాటు గ్రామంలో చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తాడు. ఈ ముసలాడికి ఉన్న డ్రీమ్ ఒక్కటే… సినిమాల్లో నటించి, తనను తాను వెండితెరపై చూసుకోవడం. యవ్వనంలో హైదరాబాద్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమైన ముత్తయ్య… ఇప్పుడు గ్రామంలో నాటకాలు వేస్తూ, సినిమాలు చూస్తూ ఉంటాడు. ఇక ఈ ముసలాడికి తోడు మల్లి (అరుణ్ రాజ్) అనే మెకానిక్. అతనితో సినిమాల గురించి చర్చిస్తూ రోజులు గడుపుతాడు. ఈ నేపథ్యంలోనే ముత్తయ్య తన కలను నెరవేర్చుకోవడానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం భూమిని కూడా అమ్మాలని ప్లాన్ చేస్తాడు. కానీ అతని కొడుకు (పూర్ణ చందర్) మాత్రం ఒప్పుకోడు. అసలే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఆ ఫ్యామిలీలో ముత్తయ్య ఆలోచన వల్ల గొడవలు మొదలవుతాయి. మరి సినిమాల్లో నటించాలనే ముత్తయ్య కల నెరవేరిందా? అతని సినిమా ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి? చివరికి ఏమయ్యింది ? అనేది కథ.
విశ్లేషణ
ఈ సినిమా ద్వారా ‘కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డు కాదు’ అనే సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు డైరెక్టర్. భాస్కర్ మౌర్య తన తొలి చిత్రంలో గ్రామీణ లైఫ్ స్టైల్ ను సహజంగా చిత్రీకరించడంలో విజయవంతమయ్యాడు. అయితే కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలచడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. సినిమా మొదటి సగం చాలా నెమ్మదిగా సాగుతుంది. కొంతమంది ప్రేక్షకులకు బోర్ కొట్టవచ్చు. రెండవ సగం కొంత వేగం పుంజుకున్నప్పటికీ స్క్రీన్‌ప్లే మరింత టైట్‌గా ఉంటే బాగుండేది. ముత్తయ్య కలల వెనుక భావోద్వేగ బరువును పూర్తిగా చూపించడంలో స్క్రీన్ ప్లే కొంతవరకు తడబడింది. ప్రేక్షకులను ఇక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. మందు చుట్టూ తిరిగే కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందికరంగా అనిపించవచ్చు.
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి ముత్తయ్య పాత్రలో అద్భుతంగా నటించారు. అతని సహజమైన నటన, డైలాగులు పాత్రకు ప్రాణం పోశాయి. మల్లి పాత్రలో అరుణ్ రాజ్ సుధాకర్ కు సమానంగా నిలిచాడు. వారి స్నేహం—వాదనలు, గొడవలు, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం సినిమాకు హైలైట్. ఈ ఇద్దరి కెమిస్ట్రీ కడుపుబ్బా నవ్విస్తుంది. పూర్ణ చందర్ (కొడుకు), మౌనిక బొమ్మ (కోడలు) తదితరులు ఫర్వాలేదు అన్పించారు.
దివాకర్ మణి సినిమాటోగ్రఫీ గ్రామీణ తెలంగాణ అందాన్ని అద్భుతంగా బంధించింది. కార్తీక్ రోడ్రిగేజ్ నేపథ్య సంగీతం సన్నివేశాల భావోద్వేగాన్ని సమర్థవంతంగా పెంచింది. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టుగా సంగీతం సాఫ్ట్‌గా, ఎర్తీగా ఉంది. తెలంగాణ స్థానిక యాసలో రాసిన డైలాగ్స్ చాలా సహజంగా, కామెడిగా ఉన్నాయి. ముత్తయ్య, మల్లి మధ్య జరిగే డిస్కషన్, ముఖ్యంగా సినిమాల గురించి చర్చించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. సాయి మురళి మొదటి సగంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. HY Life Entertainments, Fictionary Entertainment నిర్మాణ విలువలు సాధారణంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
సినిమాటోగ్రఫీ
సంగీతం
డైలాగ్స్
కామెడీ
మైనస్ పాయింట్స్:
స్లో పేస్
ఎమోషనల్ డెప్త్ లేకపోవడం
ఎడిటింగ్
ప్రొడక్షన్ వాల్యూస్
చివరగా
‘ముత్తయ్య’ ఒక సున్నితమైన, నెమ్మదిగా సాగే కథ. ‘బలగం’, ‘C/O కంచరపాలెం’ వంటి సినిమాల అభిమానులు తప్పక చూడాల్సిన సినిమా.
Muthayya Movie Rating : 2/5