మూవీ : ప్రణయ గోదారి
రిలీజ్ డేట్ : 13 డిసెంబర్ 2024
దర్శకత్వం : పీఎల్ విఘ్నేష్
నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయి కుమార్, పృథ్వి, సునిల్‌తో పాటు తదితరలు
నిర్మాత : పారమళ్ల లింగయ్య
నిర్మాణ సంస్థ : పీఎల్వీ క్రియేషన్స్
Pranaya Godari Movie Rating : 1.5/5
Pranaya Godari Movie Review and Rating : సదన్, ప్రియాంక ప్రసాద్ హీరో హీరోయిన్లుగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ మూవీ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్, నటుడు సోహెల్, తీన్మార్ మల్లన్న వంటి వారు అతిధులుగా హాజరు కావడంతో… ప్రమోషన్స్ పరంగా కొంతవరకు జనాల దృష్టిని ఆకర్షించగలిగారు మేకర్స్. ఓవైపు ‘పుష్ప 2’ ఫీవర్ నడుస్తుండగానే, డిసెంబర్ 13న చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘ప్రణయ గోదారి’ ప్రేక్షకులను మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
గోదారిలో 1000 ఎకరాల ఆసామి పెదకాపు. ఆయన కేవలం ఆసామి మాత్రమే కాదు దాదాపు 40 చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద కూడా. కాబట్టి అక్కడ ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటుంది. అయితే ఆయన చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుంటుంది. కానీ తన భర్త చనిపోవడంతో కొడుకు శ్రీనుతో కలిసి పెదాకాపు దగ్గరికి వచ్చేస్తుంది చెల్లెలు. దీంతో పెద్దకాపు తన అల్లుడు శ్రీనుకి కూతురు లలితను ఇచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ శ్రీను మాత్రం ఆ ఊర్లో జాలరి కూతురుపై మనసు పడతాడు. తన ఫ్రెండ్ గోచిగాడితో కలిసిగా గోదారి గట్టుపై ఆ అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. దీంతో విషయం పెద్దకాపుకు తెలుస్తుంది. పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చే పెదకాపు మేనల్లుడి ప్రేమ విషయం తెలిసి ఏం చేశాడు? ప్రేమికులు ఇద్దరినీ కలపడానికి గోచి ఏం చేశాడు? అనేది మూవీ స్టోరీ.
విశ్లేషణ :
పరువు హత్యల నేపథ్యంలో సాగే ప్రేమ కథలను ఇప్పటిదాకా మనం ఎన్నో సినిమాలను చూసాము. ‘ప్రణయ గోదావరి’ కూడా అదే స్టోరీ. కాకపోతే దీనికి పునర్జన్మ నేపథ్యం ఇచ్చి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ ఇలాంటి కథలు కూడా ఇప్పటిదాకా లెక్కలేనన్ని వచ్చాయి. ఇంత పాత పాయింట్ తీసుకున్నప్పటికీ డైరెక్టర్ దాన్ని తెరపై ఆకట్టుకునే విధంగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. సినిమా మొదట్లోనే రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల ప్రేమ చుట్టూనే సాగుతుంది స్టోరీ. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్లేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా, పెదకాపు పంతం నెగ్గించుకునే సీన్లతో నడుస్తుంది. అక్కడక్కడా గోచిగాడు చేసే కామెడీ కాస్త రిలీఫ్ ను ఇస్తుంది. కాపుకి తన మేనల్లుడి ప్రేమ వ్యవహారం తెలిసి, అతను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ట్రై చేయడం, క్లైమాక్స్ లో గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కానీ స్క్రీన్ ప్లే బలహీనంగా కనిపిస్తుంది. సినిమా మొత్తం చాలావరకు తెలియని ముఖాలు కావడంతో పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. ఇక టెక్నికల్ గా చూస్తే మార్కండేయ అందించిన పాటలు ఓకే, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా అన్పించదు. సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలెట్. గోదావరి అందాలను తెరపై చూడచక్కగా, కను విందుగా చూపించే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు కూడా పర్లేదు అన్నట్టుగా ఉన్నాయి.
హీరో హీరోయిన్లు సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే. కానీ తమ పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక పెదకాపుగా సాయికుమార్ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించారు. సినిమా మొత్తంలోనూ అట్రాక్షన్ అంటే కేవలం సాయికుమార్ మాత్రమే. ఇక గోచి పాత్రలో సునీల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా నటీనటులు ఓకే ఓకే.
మొత్తానికి ఇదొక రొటీన్ లవ్ స్టోరీ. థియేటర్లలో చూడడం కష్టమే. ‘పుష్ప 2’ ఫీవర్ లో ఈ సినిమా జనాల దృష్టిలో పడడం అసాధ్యం.
ప్లస్ పాయింట్స్ :
సాయి కుమార్ యాక్టింగ్
రియలిస్టిక్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
ల్యాగ్ సన్నివేశాలు
లవ్ స్టోరీలో డెప్త్ లేకపోవడం
రిపీటెడ్ సీన్స్
Pranaya Godari Movie Rating : 1.5/5