Thandel Movie Review : అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఆరంభంలో ‘100 % లవ్’ తో ఓ కంప్లీట్ హిట్ ఇచ్చిన ‘గీతా ఆర్ట్స్’ సంస్థ.. మళ్ళీ ఇప్పుడు అతను ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ సినిమా తీసి అతన్ని రూ.100 కోట్ల క్లబ్లో చేర్చాలని డిసైడ్ అయ్యింది. ప్రమోషన్స్ లో ఎక్కువగా చెప్పుకొచ్చింది ఇదే. మరి వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ‘తండేల్’ ఉందా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
ఉత్తరాంధ్ర, శ్రీకాకుళానికి చెందిన రాజు (నాగ చైతన్య) సత్య(సాయి పల్లవి) ఇద్దరూ ప్రేమికులు. మరోపక్క రాజు నిత్యం చేపల వేటకి వెళ్లి వస్తుంటాడు. ఒకానొక టైంలో అతను తన ప్రజల కోసం ‘తండేల్’ (మత్సకారులకి నాయకుడు) అవ్వాల్సి వస్తుంది. గుజరాత్ పరిసర ప్రాంతాల్లో చేపలు వేటకి వెళ్లే ప్రజలకి అతను ‘తండేల్’ గా వ్యవహరిస్తాడు. 9 నెలలపాటు వేటకి వెళ్లే రాజు.. మూడు నెలలు తన ప్రేయసి సత్యతో గడుపుతూ ఉంటాడు. వీళ్ళు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన టైంకి రాజు మళ్ళీ పెద్ద వేటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఈ క్రమంలో అతను అలాగే అతనితో పాటు ఉన్నవాళ్లు పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ కి చిక్కుతారు. వాళ్ళ చేతిలో చిత్ర హింసలకు కూడా గురవుతారు. ఆ తర్వాత సత్య ఏం చేసింది? రాజు అలాగే అతని జనం పాకిస్తాన్ సైన్యం నుండి ఎలా బయటపడ్డారు అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
‘తండేల్’ కథ ఏంటి అన్నది దర్శకుడు ముందుగానే చెప్పేశాడు. ఇది నిజంగా శ్రీకాకుళంలో జరిగిన కథ. సో ప్రేక్షకుడు ఈ సినిమాకి వెళ్తున్నప్పుడు స్క్రీన్ ప్లే కోసం ప్రిపేర్ అయ్యి వెళ్తాడు అనడంలో సందేహం లేదు. అయితే ఆ బాధ్యతని దర్శకుడు చందూ మొండేటి పూర్తిగా తీసుకోలేదు. టెక్నికల్ టీంపై పడేశాడు. సాయి పల్లవి- రాజు..ల లవ్ స్టోరీని బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు.. వాళ్ళ పాత్రలకి మంచి సంభాషణలు కూడా రాసుకున్నాడు. అవి యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. మిగిలిన ట్రాక్..లు అంతగా అతికినట్టు లేవు. ముఖ్యంగా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి దేశభక్తి ఎలిమెంట్ ను జోడించడం పూర్తిగా సెట్ అయినట్టు అనిపించదు.పాకిస్థాన్ జైలు సీక్వెన్స్ కి అంతా కనెక్ట్ అవుతారని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ ఓకే! బాగానే టైం పాస్ అయిపోతుంది. పాటలు వినడానికే కాదు చూడటానికి కూడా బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ చాలా సందర్భాల్లో తన మార్క్ చూపించాడు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఔట్పుట్ అతను మరో సినిమాకి ఇవ్వలేదు అని అనుకున్నా జనాలు ఆశ్చర్య పోనవసరం లేదు. శామ్ దత్ సినిమాటోగ్రఫీ కి కూడా మంచి మార్కులు పడతాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా కుదిరింది. సినిమా చివరి 20 నిమిషాలు బాగా ఆకట్టుకుంటుంది. బన్నీ వాస్, అల్లు అరవింద్.. ఎక్కడా క్వాలిటీ విషయంలో తగ్గలేదు.
నటీనటుల విషయానికి వస్తే.. నాగ చైతన్య ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. లుక్ విషయంలో కావచ్చు బాడీ లాంగ్వేజ్ విషయంలో కావచ్చు.. కొత్త నాగ చైతన్య కనిపిస్తాడు. సాయి పల్లవి మంచి పెర్ఫార్మర్. అలాంటి పెర్ఫార్మర్ ను కూడా కొన్ని సందర్భాల్లో నాగ చైతన్య డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు అంటే.. అతను ఎంత ఇంప్రూవ్ అయ్యాడో అర్ధం చేసుకోవచ్చు. అలా అని సాయి పల్లవి ఎక్కడా తగ్గలేదు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో సత్య పాత్రకి మరింత అందాన్ని తీసుకొచ్చింది. మెయిన్ గా శ్రీకాకుళం స్లాంగ్ విషయంలో వీళ్ళు ఎక్కడా తడబడలేదు. ‘మంగళవారం’ ఫేమ్ దివ్య పిళ్ళై పాత్ర పర్వాలేదు.బబ్లు పృథ్వీ రాజ్ కూడా ఓకే. మహేష్ ఆచంట వంటి వాళ్ళు కూడా బాగానే చేశారు.
మొత్తంగా.. ‘తండేల్’ ఒక యావరేజ్ మూవీ.. సెకండాఫ్(క్లైమాక్స్ తప్ప) వీక్, అయినప్పటికీ నాగ చైతన్య, సాయి పల్లవి..ల నటన కోసం ఒకసారి చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్ :
నాగ చైతన్య, సాయి పల్లవి నటన
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
మొదటి 45 నిమిషాలు స్లోగా ఉండటం
సెకండాఫ్లో జైలు ఎపిసోడ్ సీన్స్
Thandel Movie Rating 2.25/5