Veera Dheera Sooran Movie Review : విక్రమ్ హీరోగా ‘చిన్నా’ వంటి రస్టిక్ సినిమా అందించిన ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీర ధీర శూర’. పెద్దగా అంచనాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.
కథ :
రవి(30 ఇయర్స్ పృథ్వీ), కన్నా(సూరజ్ వెంజర్మూడు) తండ్రీ కొడుకులు. తమ స్వార్థం కోసం కపటనాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర పనిచేసే ఓ వ్యక్తి కనిపించకపోవడంతో.. అతని భార్య వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ..’నా భర్త ఎక్కడ? అతన్ని ఏం చేశారు?మీరు నాశనం అయిపోతారు’ అంటూ శాపనార్దాలు పెడుతుంది. తర్వాత ఆమె కనపడకుండా పోతుంది. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా కనిపించకుండా పోతుంది. ఇది తెలుసుకున్న ఆమె భర్త నేరుగా ఎస్.పి ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. రవి, కన్నా..ల పై పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు ఎస్.పి అరుణగిరి(ఎస్.జె.సూర్య). కరెక్ట్ గా రవిపై పోలీస్ కేసు పెట్టడానికి వచ్చిన బాధితుడు కంప్లైంట్ ను ఆధారం చేసుకుని.. రవి ఫ్యామిలీ మొత్తాన్ని ఎంకౌంటర్లో లేపేయాలని చూస్తాడు. విషయం తెలుసుకున్న రవి.. కాళి సాయం కోరతాడు. అసలు కాళి ఎవరు? ఓ కిరాణా కొట్టు నడుపుకునే అతనికి రవి కుటుంబంతో సంబంధం ఏంటి? కాళిని రవి గొడవల్లోకి వెళ్లొద్దు అంటూ అతని భార్య వాణి(దుశారా విజయన్) ఎందుకు బ్రతిమాలుతుంది? ఇంతకీ కాళీ రవి కుటుంబాన్ని కాపాడాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా?
విశ్లేషణ :
సినిమా ఆరంభం చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ వెంటనే ఎస్.జె.సూర్య పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో క్యూరియాసిటీ మొదలవుతుంది. 20 నిమిషాలు దాటాకే హీరో ఎంట్రీ ఉంటుంది. హీరో పోలీసుల బారినుండి 30 ఇయర్స్ పృథ్వీని కాపాడటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే మందుపాతర సీన్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ కి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది. ఓ సిల్లీ సీన్ తోనే ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్లో భాగంగా వచ్చే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే వెళ్తుంది. కానీ క్లైమాక్స్ పోర్షన్ మళ్ళీ ఫ్లాట్ గా ముగుస్తుంది.
హీరో అసలు ఎందుకు పోలీసులకి సాయం చేస్తాడు? ఎందుకు అతని నమ్మి వచ్చిన ఫ్యామిలీని మోసం చేస్తాడు? అనేదానికి సరైన కన్క్లూజన్ ఇవ్వలేదు. బహుశా ఇది సెకండ్ పార్ట్ గా చూపించారు ప్రమోట్ చేశారు కాబట్టి.. ఫస్ట్ పార్ట్లో ఏమైనా చుపిస్తారేమో. కానీ ఫస్ట్ పార్ట్ రావాలి అనే ఆసక్తి కూడా జనాలకి కలిగించేలా ఎటువంటి అంశాలు పెట్టలేదు. జీవి ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైరెక్షన్ చాలా వరకు కన్ఫ్యుజింగ్ గానే ఉంటుంది. నిర్మాణ విలువలు ఓకే. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్ గా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే.. విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది. అతను ఇరక్కొట్టేశాడు. దుశారా విజయన్ కూడా బాగా చేసింది. 30 ఇయర్స్ పృథ్వీ రోల్ ఎటూ కానట్టు ఉంది. ఎస్.జె.సూర్య రోల్ కూడా చాలా వీక్. మిగతా నటీనటులు జస్ట్ ఓకే అనిపిస్తారు. 30 ఇయర్స్ పృథ్వీ ఫ్యామిలీలో లేడీస్ చేసే ఓవర్ యాక్షన్ కి నవ్వాలో.. నెత్తికొట్టుకోవాలో అర్ధం కాదు.
ప్లస్ పాయింట్స్ :
విక్రమ్ నటన
ఫస్ట్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
లాజిక్స్ మిస్ అవ్వడం
హీరో రివెంజ్ ట్రాక్ వర్కౌట్ అవ్వకపోవడం
మొత్తంగా.. ‘వీర ధీర శూర’ టైటిల్ కి కథకి సింక్ లేకుండా ఉంటుంది. దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ అక్కడక్కడా మెరుపులు మెరిపించినా.. కథనం వీక్ గా ఉండటం.. ముఖ్యంగా సెకండాఫ్ తేలిపోవడంతో ఇది సాదా సీదా యాక్షన్ డ్రామాగా ముగుస్తుంది.
Veera Dheera Sooran Telugu Movie Rating : 2/5