iPhone Price Hike India: భారత్‌లో యాపిల్ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేతిలో ఐఫోన్ ఉంటే ఆ స్టేటస్సే వేరు అనుకునే అభిమానులకు యాపిల్ త్వరలోనే ఒక బిగ్ షాక్ ఇవ్వబోతోంది. సాధారణంగా కొత్త మోడల్ రాగానే పాత ఫోన్ల ధరలు తగ్గుతాయని ఆశిస్తారు. కానీ ఈసారి సీన్ రివర్స్ కానుంది. త్వరలో లాంచ్ కాబోయే iPhone 18 Pro సిరీస్‌తో పాటు మార్కెట్లో ఉన్న పాత ఐఫోన్ల ధరలను కూడా దాదాపు రూ.10,000 వరకు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వార్తతో ఐఫోన్ కొందామనుకుంటున్న టెక్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఐఫోన్ల తయారీ ఖర్చులు, విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీ లాభాల శాతం తగ్గిపోకుండా చూసుకునేందుకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ధరలను సవరించిన యాపిల్.. త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లో ఈ పెంపును వర్తింపజేసేలా ప్లాన్ చేసుకుంటోంది.
Also Read: ఏసర్ నుంచి 3 కొత్త ల్యాప్‌టాప్‌లు.. కానీ ఆ ఒక్క మోడల్ జోలికి వెళ్లకపోవడమే బెటర్!
ఒకవేళ రూ.10,000 పెంపు నిజమైతే భారత్‌లో iPhone 17 ప్రారంభ ధర రూ.82,900 నుంచి రూ.92,900కి చేరుతుంది. అలాగే iPhone Air ధర రూ.1.29 లక్షలు, బడ్జెట్ మోడల్ iPhone 17e ధర రూ.74,900 వరకు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొత్త ఫోన్ వస్తే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయి. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.
ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 8న జరగబోయే ఈవెంట్‌లో యాపిల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే ఈవెంట్‌లోనే iPhone 18 Pro, 18 Pro Max మోడళ్లతో పాటు యాపిల్ నుంచి రాబోతున్న మొట్టమొదటి Foldable iPhone కూడా పరిచయం కానుందని సమాచారం.
కొత్త సిరీస్ మార్కెట్లోకి రాగానే పాత మోడళ్లయిన iPhone 17 Pro, 17 Pro Maxల విక్రయాలను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా మార్కెట్లో ఉన్న iPhone 16, 16 Plus మోడళ్లకు కూడా గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై యాపిల్ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కొత్త సిరీస్ లాంచ్ అయ్యే వరకు అసలు ధరలు ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.
Also Read: ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!