Prepaid vs Postpaid: స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఓ సందేహం వెంటాడుతూనే ఉంటుంది. ప్రీపెయిడ్ వాడితే డబ్బులు మిగులుతాయా? లేక పోస్ట్‌పెయిడ్ మంచిదా? అని తెగ ఆలోచిస్తుంటారు. అయినప్పటికీ చాలామంది నెలానెలా ప్లాన్ రీచార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ రెండింట్లో దేనివల్ల ఎక్కువ బెనిఫిట్ అన్న విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోరు. అయితే ఈ రెండు రకాల ప్లాన్ల వెనుక చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
చాలామంది పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ప్రకటనలు చూసి ఆకర్షితులవుతుంటారు. రూ. 399 లేదా రూ. 499 లకే అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఇస్తున్నామని కంపెనీలు చెబుతుంటాయి. కానీ ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ బిల్లుపై ప్రతి నెలా 18% GST అదనంగా పడుతుంది. ఒకవేళ రూ. 499 ప్లాన్ తీసుకుంటే బిల్లు వచ్చేసరికి అది రూ. 590 దాటుతుంది.
అదే ప్రీపెయిడ్ ప్లాన్ ఎంచుకుంటే ఆ రీఛార్జ్ ధరలోనే పన్నులు కూడా కలిసి ఉంటాయి. రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన పనిలేదు. పైగా పోస్ట్‌పెయిడ్ అయితే మీరు వాడినా వాడకపోయినా ప్రతీ నెలా నిర్ణిత డబ్బు చెల్లించాల్సిందే. అదే ప్రీపెయిడ్‌లో అయితే మీకు అవసరం లేనప్పుడు రీచార్జ్ చేసుకోకుండా ఉండే సదుపాయం ఉంటుంది. బడ్జెట్ ఆదా చేయాలని భావించేవారికి రీపెయిడ్ ఇచ్చే బెనిఫిట్స్.. పోస్ట్‌పెయిడ్‌లో దొరకదని నిపుణులు చెబుతున్నారు.
ప్రీపెయిడ్ ప్లాన్లు విద్యార్థులు, పరిమిత బడ్జెట్ ఉన్నవారు, నెలానెలా ఎంత ఖర్చు అవుతుందో కచ్చితంగా లెక్కలు వేసుకునేవారికి చాలా బాగా ఉపయోగపడతాయి. పరిమితిని బట్టి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ప్రీపెయిడ్ ప్లాన్లలో ఉంటుంది. బిల్లు ఎక్కువ వస్తుందన్న భయం ఇందులో ఉండదు. పైగా మార్కెట్లో 28, 84, 365 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి రోజుకి 1.5GB లేదా 2GB డేటా ప్లాన్లను ఎంచుకోవచ్చు.
పోస్ట్ పెయిడ్ ప్లాన్ల వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంట్లో ముగ్గురు లేదా నలుగురు సభ్యులు ఉన్నప్పుడు విడివిడిగా ప్రీపెయిడ్ రీచార్జ్ చేసేకంటే ఒకే పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఈ నెలలో మిగిలిపోయిన డేటాను తదుపరి నెలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే సౌకర్యం పోస్ట్‌పెయిడ్‌లో ఉంటుంది. ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలు తరచు చూసేవారికి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ద్వారా అవి ఫ్రీగా లభిస్తాయి. పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే డేటా అయిపోయినా, వ్యాలిడిటీ ముగిసినా సర్వీస్ ఆగిపోదు. బిజినెస్ చేసేవారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
Also Read: 1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!
ఓటీటీలు, అపరిమిత డేటాతో పనిలేకుండా బడ్జెట్ లో రీఛార్జ్ ప్లాన్లు కోరుకుంటే ప్రీపెయిడ్ ప్లాన్లు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఒకవేళ ఇంట్లో నలుగురైదుగురు ఉండి ఫ్యామిలీ ప్లాన్ వాడాలనుకున్నా, ఓటీటీలు చూస్తూ నెలానెలా రీచార్జ్ చేసుకునే టెన్షన్ వద్దనుకుంటే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వైపు వెళ్లడం మంచిది. మీ వాడకాన్ని బట్టి ప్లాన్ ఎంచుకుంటే ఏటా రూ. వేలల్లో ఆదా చేసుకోవచ్చు.
Also Read: ఇక OTTల పని ఖేల్ ఖతం.. గూగుల్ టీవీలో ఉచితంగా 10,000 సినిమాలు, షోలు!