Telegram Removed: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఐఓఎస్ యాప్ స్టోర్ (IOS App Store) నుంచి అకస్మాత్తుగా ఈ యాప్ ను తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు సెర్చ్ రిజల్ట్స్‌లో ఈ యాప్ కనిపించడం లేదు. అయితే దీనిపై యాపిల్ గానీ, టెలిగ్రామ్ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మాత్రం ఎప్పటిలాగే టెలిగ్రామ్ సేవలు అందుబాటులో ఉండటం గమనార్హం.
టెలిగ్రామ్ యాప్ యాపిల్ ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించబడడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అనుచిత కంటెంట్ వ్యాప్తి చెందుతోందన్న కారణంతో యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత టెలిగ్రామ్ అధినేత యాప్ లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో మళ్లీ పునరుద్ధరించారు. ఆ తర్వాత 2023లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన దర్యాప్తులో సమాచారం ఇవ్వలేదనే నెపంతో బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఈ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. అటు 2024లో చైనా ఇంటర్నెట్ రెగ్యులేటర్ ఆదేశాల మేరకు యాపిల్ తన చైనా యాప్ స్టోర్ నుండి వాట్సాప్, సిగ్నల్‌లతో పాటు టెలిగ్రామ్‌ను పూర్తిగా తొలగించింది.
మరోవైపు భారత ప్రభుత్వం సైతం గత కొద్ది కాలంగా టెలిగ్రామ్ సేవలపై నిఘా పెట్టింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈ యాప్ వేదికగా నిలిచిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై టెలిగ్రామ్ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ.. భారత ప్రభుత్వం ఈ టెలిగ్రామ్ పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంలో ప్రభుత్వం వాదిస్తూ.. టెలిగ్రామ్ సైబర్ నేరగాళ్లకు ఒక ‘కొత్త డార్క్ వెబ్’ లాగా మారిపోయిందని ఆరోపించింది.
Also Read: ఇది కలా? నిజమా?.. కళ్లు లేకపోయినా చూడొచ్చట.. మస్క్ కొత్త ‘చిప్’ మాయాజాలం!
ఐఫోన్ యూజర్లకు పలు దేశాల్లో టెలిగ్రామ్ అందుబాటులో లేకుండా పోవడంపై పలు అనుమానాలు తావిస్తోంది. ఇది సాంకేతిక లోపమా? నిబంధనల ఉల్లంఘనా? లేక ప్రభుత్వాల ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయమా? అనే అంశంపై యాపిల్ తో పాటు టెలిగ్రామ్ నుంచి స్పష్టత లేదు. ఆ రెండు సంస్థలు అధికారికంగా స్పందిస్తే తప్ప.. ఈ సస్పెన్స్ వీడేలా కనిపించడం లేదని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!