Doctorless AI Clinic: సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండే చైనా.. వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ‘డాక్టర్‌లెస్’ (వైద్యులు లేని) స్మార్ట్ హెల్త్‌కేర్ మిషిన్లను ఆ దేశం అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక చికిత్స కోసం గంటల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒక చిన్న ఏఐ ఆధారిత క్యాబిన్‌లోకి వెళ్తే నిమిషాల్లో రోగ నిర్ధారణ చేసి మందుల ప్రిస్క్రిప్షన్ ఇచ్చేలా ఈ సరికొత్త వ్యవస్థను రూపొందించారు.
చైనా శాస్త్రవేత్తలు ‘ఏఐ కియోస్క్’ పేరిట.. డాక్టర్ లెస్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చూడటానికి ఒక చిన్న టెలిఫోన్ బూత్ లేదా ఏటీఎం కేంద్రంలా ఇది కనిపిస్తుంది. దీనిని ‘ఏఐ క్లినిక్’ లేదా ‘స్మార్ట్ కేర్ క్యాబిన్’ అని కూడా పిలుస్తున్నారు. ఇందులో రోగి లోపలికి వెళ్లగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వర్చువల్ డాక్టర్ (AI Doctor) స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా రోగితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటుంది.
China has introduced AI-powered health kiosks that operate entirely without human doctors. These advanced booths scan vital signs, conduct basic tests, and use AI to diagnose common illnesses within minutes.
Each unit includes sensors, cameras, and automated dispensers for… pic.twitter.com/wharCCgDoB
— Massimo (@Rainmaker1973) June 29, 2026
ఈ ఏఐ మిషన్ కేవలం మాటలతోనే సరిపెట్టదు. ఇందులో అమర్చిన అత్యాధునిక సెన్సార్లు, మెడికల్ పరికరాల సహాయంతో రోగి కంటి రంగు, నాలుక, పల్స్ రేట్, రక్తపోటు (BP), శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలను డిజిటల్ గా లెక్కిస్తుంది. రోగి చెప్పిన లక్షణాలను, సేకరించిన హెల్త్ డేటాను విశ్లేషించి వారికి ఉన్న సమస్య ఏమిటో కొన్ని నిమిషాల్లోనే ‘ఏఐ కియోస్క్’ మిషనర్లు నిర్ధారిస్తాయి.
రోగ నిర్ధారణ పూర్తికాగానే ఈ ఏఐ మిషన్ రోగికి అవసరమైన ప్రిస్క్రిప్షన్‌ను డిజిటల్ రూపంలో అందిస్తుంది. అంతేకాకుండా ఈ క్యాబిన్లలో వందలాది రకాల ప్రాథమిక మందులను స్టాక్ ఉంచుతారు. రోగ నిర్ధారణ ఆధారంగా క్యాబిన్ లోని స్మార్ట్ వెండింగ్ మిషన్ ద్వారా రోగికి తక్షణమే మందులు కూడా చేతికి అందుతాయి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి నిపుణుడైన వైద్యుడి అవసరం ఉందని ఏఐ గుర్తిస్తే.. వెంటనే ఆన్‌లైన్ ద్వారా పెద్ద ఆసుపత్రిలోని అసలైన డాక్టర్‌కు వీడియో కాల్ కనెక్ట్ చేస్తుంది.
చైనా వంటి భారీ జనాభా గల దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏఐ క్లినిక్‌ల ద్వారా అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరితగతిన ప్రాథమిక వైద్యం అందించాలని చైనా అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆసుపత్రుల్లో ఓపీ (OP) క్యూ లైన్లలో నిలబడే అవసరాన్ని ఇది తప్పిస్తుందని పేర్కొంటున్నారు. ఈ ఏఐ హెల్త్ మిషన్లు.. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం పనిచేస్తాయి. అతి తక్కువ ఖర్చుతోనే ప్రాథమిక వైద్యం అందించడం వల్ల సామాన్యులకు సైతం ప్రయోజనం చేకూరనుంది.
ప్రస్తుతానికి ఈ ఏఐ హెల్త్ మిషన్లలను ప్రయోగాత్మకంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి పనితీరు ఆధారంగా లోటుపాట్లను సరిచేసి.. దేశవ్యాప్తంగా విస్తరించాలని అక్కడి వైద్యాధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, కార్యాలయాలు, గ్రామీణ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఎక్కువ మంది ఉండే మాల్స్, రైల్వే స్టేషన్లలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నారు.
Also Read: మళ్లీ సరిహద్దులు దాటనున్న రైళ్లు.. త్వరలో భారత్-బంగ్లాదేశ్ సర్వీసులు ప్రారంభం!
అయితే డాక్టర్ లెస్ సాంకేతికత అద్భుతమైనదే అయినప్పటికీ.. వైద్య నిపుణులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మానవ వైద్యుడికి ఉండే లోతైన దృష్టి, అనుభవం మిషన్లకు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏఐ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వీటిని కేవలం ప్రాథమిక లక్షణాలు (జలుబు, దగ్గు, తలనొప్పి, చిన్నపాటి జ్వరాలు) ఉన్నవారికి మాత్రమే పరిమితం చేసినట్లు చైనా వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఈ ఏఐ మిషన్లు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డాక్టర్ లెస్ మిషన్లు చైనాలో విజయవంతమైతే.. భారత్ వంటి దేశాల్లోనూ ఇవి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో దారుణం.. మేకకు ఎద్దు మాంసం, హెచ్-ఫాస్ట్ బృందం తనిఖీల్లో షాకింగ్ విషయాలు