Pixel 11 Series: గూగుల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త Pixel 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి. తాజాగా జరిగిన ఓ ప్రత్యేక వేదికపై గూగుల్ తమ కొత్త లైనప్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఇందులో Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL మోడళ్లు ఉన్నాయి. ఈసారి డిజైన్ పరంగానే కాకుండా.. పనితీరులోనూ మెరుగైన అనుభూతిని అందించేలా గూగుల్ వీటిని తీర్చిదిద్దింది.
Pixel 11 బేస్ వేరియంట్ (12GB RAM + 256GB) ప్రారంభ ధర రూ.89,999 కాగా, 512GB వేరియంట్ ధర రూ.1,04,999గా నిర్ణయించారు. ఇక Pixel 11 Pro మోడల్స్ రూ.1,19,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. టాప్ ఎండ్ Pixel 11 Pro XL (512GB) మోడల్ ధర రూ.1,49,999 వరకు ఉంది. ఆగస్టు 20 నుంచి గూగుల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. HDFC కార్డ్ వాడేవారికి రూ.10,000 తక్షణ డిస్కౌంట్, పాత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్, ఉచితంగా 6 నెలల Google AI Pro సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తాయి.
Also Read: ఆరోగ్యంపై గూగుల్ స్పెషల్ ఫోకస్.. Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ మ్యాజిక్!
ఈ కొత్త సిరీస్‌లోని Pro మోడళ్లలో గూగుల్ ఒక వినూత్నమైన ‘హైలైట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్ వెనుక కెమెరా పక్కన ఉండే లైట్లు మనం ఫోన్ కింద పడేసినప్పుడు లేదా బోర్లా పెట్టినప్పుడు నోటిఫికేషన్‌లను లైటింగ్ రూపంలో చూపిస్తాయి. ముఖ్యంగా Gemini AI ప్రాసెస్ అవుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఈ లైట్లు వేర్వేరు రంగుల్లో మెరుస్తాయి. మనకు కావాల్సిన ముఖ్యమైన కాంటాక్టులకు వేర్వేరు రంగులను సెట్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంది.
అన్ని మోడళ్లలోనూ గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన ‘టెన్సర్ జి6’ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్ భద్రత కోసం టైటాన్ ఎం3 చిప్‌సెట్ ఉంది. డిస్‌ప్లే రక్షణ కోసం గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 వాడారు. ఇవి ఐపి68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తున్నాయి. అంటే.. నీటిలో పడినా లేదా ధూళి పడినా ఫోన్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ ఫోన్లు అత్యాధునిక ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.
ఫొటోగ్రఫీ ప్రేమికులను పిక్సెల్ కెమెరాలు ఎప్పుడూ నిరాశపరచవు. బేస్ మోడల్‌లో 48MP మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. ఇక ప్రో మోడళ్లలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్, టెలిఫోటో కెమెరాలు ఇచ్చారు. వీటితో 120 ఎక్స్ డిజిటల్ జూమ్ ఫొటోలు తీయవచ్చు. రోజంతా సులభంగా పనిచేసే పెద్ద బ్యాటరీలతో పాటు, 30 వాట్స్ వైర్డ్, 25 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
Also Read: రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!