iBomma Ravi: ఇమ్మడి రవి.. అలియాస్ ఐబొమ్మ రవి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది. పైరసీ మాఫియా కింగ్ పీస్ గా గుర్తింపు పొందిన రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలుగు సినిమా పరిశ్రమ పరిశ్రమకు ముచ్చెమటలు పట్టించిన రవి.. కటకటాల్లోకి వెళ్లాడు. గత కొద్ది సంవత్సరాలుగా వేలాది సినిమాలను ఐబొమ్మలో అప్ లోడ్ చేసి, సినిమా పరిశ్రమకు తీరని నష్టాన్ని కలిగించిన రవి.. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకే సవాల్ విసిరే స్థాయికి చేరాడు. ప్రజల అండ ఉందని భావించి.. ‘భయపడని మనిషి కంటే ప్రమాదకారి లేడు’ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. తాజాగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని వలపన్ని పట్టుకున్నారు.
విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి ముంబై యూనివర్సిటీలో MBA చేశాడు. హైదరాబాద్‌లో ఈఆర్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. చిన్నప్పటి నుంచే హ్యాకింగ్ ను ఇష్టపడే రవి.. యూట్యూబ్ లో చూసి, హ్యాకింగ్ లో మెళకువలు నేర్చుకున్నాడు. నెమ్మదిగా సర్వర్లు హ్యాక్ చేయడం మొదలు పెట్టాడు. తొలుత చిన్న చిన్న సర్వర్లను హ్యాక్ చేసిన అతడికి ఓ ఆలోచన వచ్చింది. సినిమా విడుదలకు ముందే చూడాలనే కోరికపుట్టింది. వెంటనే, సినిమా థియేటర్లకు సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేయడం మొదలు పెట్టాడు. విడుదలకు ముందే సినిమాలను చూసేవాడు. ఆ తర్వాత వాటిని టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేస్తే డబ్బులు ఇస్తామనే ఆఫర్లు రావడంతో అక్కడ షేర్ చేయడం మొదలు పెట్టాడు. బయట సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కనిపించిన రవి.. పైరసీ హార్డ్ కోర్ క్రిమినల్ గా మారిపోయాడు. నెమ్మదిగా తన పైరసీ సామ్రాజ్యాన్ని చాపకింద నీరులా విస్తరించాడు.
2018 నుంచి రవి కరీబియన్ దీవులు, ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్‌లో దాక్కుని iBomma, Bappam TV లాంటి సైట్లను నడిపాడు. 110 డొమైన్లు కొనుగోలు చేసి, 65 మిర్రర్ సైట్లు ఏర్పాటు చేశాడు. 1972లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమా నుంచి తాజా ‘ఓజీ’ వరకు 21,000+ సినిమాలను హార్డ్ డిస్క్ ల్లో స్టోర్ చేశాడు.ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ సర్వర్లు హ్యాక్ చేసి వాటిని అప్ లోడ్ చేశాడు. కానీ, చివరకు హైదరాబాద్ లో పోలీసులకు చిక్కాడు. రీసెంట్ గా బెట్టింగ్ యాప్ నుంచి రవికి అందిన అమౌంట్ ఆధారంగా ఐపీ అడ్రస్ ను గుర్తించి, ఆయన ప్లాట్ మీద పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా అతడు తన ప్లాట్ కు రాగానే అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రవి.. పైరసీ ద్వారా రూ. 20 కోట్లు అక్రమ ఆదాయం సంపాదించినట్లు గుర్తించారు. అందులో రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
వాస్తవానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మను ప్రజలకు విపరీతంగా ఆదరించారు. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలు ఐబొమ్మకు అలవాడు పడ్డారు.. థియేటర్లకు వెళ్లాలంటేనే భయపడే వారికి.. సినిమా విడుదలైన గంటల్లోనే HD ప్రింట్లను అందుబాటులో ఉంచాడు. టికెట్ల ధరలు, థియేటర్లలో స్నాక్స్ ధరలు పెంచి ప్రేక్షకుకుల జేబులు ఖాళీ చేసేవారికి, తగిన శాస్తి చేస్తున్నాడని జనాలు భావించారు. అతడిని హీరోలా చూశారు. కానీ, రవి చేయకూడని మరికొన్ని పనులు చేశాడు. ఐబొమ్మ, బప్పం టీవీ సైట్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. ఏకంగా 50 లక్షల మంది యూజర్ల డేటాను స్టోర్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోడానికి కారణమయ్యాడు. మాల్వేర్ ఫైల్స్ ప్రమోట్ చేసి డబ్బులు కూడబెట్టాడు.. ఓవైపు ప్రజలకు మేలు చేస్తున్నాననే ముసుగులో.. మరోవైపు డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. జనాల అండ ఉందనే కారణంతో ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు. లక్షలాది మంది డేటాను బయటపెడతానని వార్నింగ్ ఇచ్చాడు. తన సత్తా ఇది అని చెప్పేందుకు ప్రభుత్వ వెబ్ సైట్లను కూడా హ్యాక్ చేశాడు. అయితే, టెక్నాలజీలోని లొసుగులు వాడుకొని.. జనాల అండంతో దేశద్రోహానికి పాల్పడితే? డబ్బుకు ఆశపడి తీవ్రవాదులకు సహాయపడితే? ఇలాంటివాడిని మనం ప్రోత్సహించాలా? అరెస్టుకు బాధపడాలా? తనను తాను సూపర్ పవర్ గా భావించి ఏదైనా చేస్తాం అంటే.. చివరకు శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లకు తప్పదు. ముమ్మాటికీ ఐబొమ్మ రవి లాంటి వాడు హీరో ఎన్నటికీ కాలేడు. కచ్చితంగా విలనే అవుతాడు.
అదే సమయంలో నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు తక్కువ ధరలో ప్రజలకు వినోదాన్ని అందుబాటులో ఉంచినప్పుడే ప్రైవసీ మాయం అవుతుంది. అడ్డగోలుగా ధరలు పెంచుతాం అంటే, రవి లాంటి వాళ్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటారనే విషయాన్ని గుర్తించడం మంచిది. రవి అరెస్ట్ తర్వాత పోలీసులను కలిసి కృతజ్ఞతలు చెప్పిన టాలీవుడ్ బడా హీరోలు.. నిర్మాతలను, థియేటర్ల యాజమాన్యాలను కలిసి సినిమా టికెట్లు, ఇంటర్వెల్ స్నాక్స్ ధరలు పేద, మధ్యతరగతి ప్రేక్షకులకు అందుబాటులో ఉంచమని చెప్తే జనాలు ఇంకా సంతోషిస్తారు. అటు పోలీసులు టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీలు ఆ యాప్ ద్వారానే జరుగుతున్నాయి.
Read Also: ఐబొమ్మ వల్ల ఎంతో మంది చనిపోయారు, పైరసీతో రవి కోట్లు సంపాదించాడు.. కీలక విషయాలు వెల్లడించిన సజ్జనార్!