Online shopping safety tips: ప్రస్తుతం మన జీవితంలో ఆన్‌లైన్ షాపింగ్ ఒక భాగమైపోయింది. బట్టల నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్ వరకు ప్రతి ఒక్కరూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింట్రా వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌ల ద్వారానే కొంటూ ఏంటాం. ఇలాంటి సమయంలో ఏదైనా నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేయగానే ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకుని డెలివరీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటాం. అయితే.. ఆర్డర్ చేశాక లేదా పార్శిల్ ఇంటికి వచ్చాక కేవలం స్క్రీన్ షాట్ దాచుకుంటే సరి పోదు. కొన్ని కీలకమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఆర్డర్ చేస్తే డబ్బాలో.. సబ్బు బిళ్లలు లేదా రాయి వచ్చిన ఘటనలు మనం వినే ఉంటాం. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. డెలివరీ బాయ్ ముందే.. లేదా మీ ఇళ్లలో పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు కచ్చితంగా అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయండి. ఒకవేళ .. ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా లేదా వేరే ఐటమ్ వచ్చినా ఈ వీడియోనే.. మీకు పెద్ద ఆధారం అవుతుంది.ఈ చిన్న జాగ్రత్త మిమ్మల్ని వేల రూపాయల నష్టం నుంచి కాపాడుతుంది.
చాలా మంది పార్శిల్ ఓపెన్ చేసి ఐటమ్ నచ్చితే .. బాక్స్‌ను పడేస్తుంటారు. కానీ అందులో .. ఉండే జిరాక్స్ బిల్లు లేదా ఇన్ వాయిస్‌ను కచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ లేదా హోమ్ అప్లయన్సెస్ (వీటి ధరలు మార్కెట్లో సుమారు రూ.5,000 నుంచి రూ.50,000 వరకు ఉంటాయి) కొన్నప్పుడు వారంటీ క్లెయిమ్ చేయడానికి ఈ ఒరిజినల్ బిల్లే మెయిన్ ప్రూఫ్. అలాగే ఆన్‌లైన్‌లో చూపించిన ఎంఆర్‌పీ రేటు, బాక్స్ మీద ఉన్న ప్రైస్ ట్యాగ్ సరిపోలుతున్నాయా లేదా అని ఒక సారి క్రాస్ చెక్ చేసుకోవాలి.
ప్రతి ఈ-కామర్స్ సైట్‌లోనూ ప్రొడక్ట్‌ను బట్టి 7 రోజులు లేదా 10 రోజుల రిటర్న్ లేదా రీప్లేస్‌మెంట్ పాలసీ ఉంటుంది. పార్శిల్ అందిన వెంటనే.. ఆ ఐటమ్ సరిగ్గా పని చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ డిఫెక్ట్ ఉంటే.. రిటర్న్ విండో ముగిసేలోపు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. చాలా మంది బిజీ షెడ్యూల్ వల్ల.. వారం రోజులు పట్టించుకోరు. ఆ తర్వాత రిటర్న్ ఆప్షన్ క్లోజ్ అయిపోయి డబ్బులు నష్ట పోతుంటారు.
Also Read: రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!
కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసే.. ప్రొడక్ట్స్ ప్యాకింగ్ బాక్స్‌లపై మన పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ స్పష్టంగా.. ప్రింట్ అయి ఉంటాయి. ఆ బాక్సులను అలాగే చెత్త బుట్టలో లేదా వీధిలో పడేస్తే.. సైబర్ కేటుగాళ్లు మీ పర్సనల్ వివరాలను సేకరించే ప్రమాదం ఉంది. కాబట్టి బాక్సులను పడేసే ముందు మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఉన్న స్టిక్కర్లను చింపేయడం లేదా పెన్తో పూర్తిగా బ్లాక్ చేయడం మంచిది.
ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో పేమెంట్ చేసేటప్పుడు మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆటో-సేవ్ చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఒక్కో సారి సైబర్ సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. షాపింగ్ పూర్తయిన వెంటనే మీ కార్డ్ వివరాలను యాప్‌ల నుంచి రిమూవ్ చేయడం లేదా ప్రతి సారీ మ్యాన్యువల్‌గా ఎంటర్ చేయడం బెస్ట్.
ఆన్‌లైన్ షాపింగ్ అనేది మనకు ఎంత ఈజీ అయినా కూడా, కొన్నిసార్లు చిన్న పొర పాట్ల వల్ల అంత పెద్ద సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇకపై షాపింగ్ చేసేటప్పుడు కేవలం స్క్రీన్‌షాట్‌తో.. సరిపెట్టకుండా ఈ జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించండి!