ISRO NVS-03: ఏదైనా తెలియని లోకేషన్ గురించి తెలుసుకోవాలంటే.. వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. ఈ గూగుల్ మ్యాప్స్ పని చేయాలంటే దానికి GPS కావాలి. విమానాలు ప్రయాణించాలన్నా, షిప్స్ సముద్రంలో దారి తెలుసుకోవాలన్నా, మన ఆర్మీ ప్రయోగించే మిసైల్స్ టార్గెట్‌ను రీచ్ అవ్వాలన్నా.. ఇలా ప్రతి దానికి శాటిలైట్ నావిగేషన్ చాలా ముఖ్యం. అయితే ఒక్కసారి ఆలోచించండి.. మన దేశ భద్రతకు, మన ఆర్మీకి అవసరమైన ఈ నావిగేషన్ సిస్టమ్ కోసం మనం వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగానే భారత్ సొంతంగా నావిక్ అనే నావిగేషన్ వ్యవస్థను డెవలప్ చేసింది. అయితే ఈ వ్యవస్థలో కొన్ని ఉపగ్రహాలు, ముఖ్యంగా వాటిలోని అటామిక్ క్లాక్స్ పనిచేయకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌ను ఓవర్‌కమ్ చేసి.. NVS-03ని డెవలప్ చేసింది ఇస్రో. అసలు ఈ శాటిలైట్ ప్రత్యేకత ఏంటి? ఇందులో అటామిక్ క్లాక్ ఎందుకు ఉంటుంది? భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థను ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది?
ముందుగా నావిక్ గురించి తెలుసుకుందాం..
ముందుగా నావిక్ గురించి తెలుసుకుందాం. మనం ఫోన్లలో లొకేషన్ తెలుసుకోవడానికి GPS ఉపయోగిస్తుంటాం. GPS అనేది అమెరికా డెవలప్ చేసిన శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. అలాగే రష్యాకు గ్లోనాస్, యూరప్‌కు గెలిలియో, చైనాకు బైదూ వంటి సొంత నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. కానీ మన ఇండియా పరిస్థితి ఏంటి? అసలు ఇండియాకు ఇలాంటి అవసరం ఉందని 1999 కార్గిల్ యుద్ధం వరకు మనకు గుర్తు కూడా రాలేదు. ఆ వార్ టైమ్‌లో భారత్‌కు అవసరమైన ప్రాంతానికి సంబంధించిన GPS సమాచారం కావాలని అడిగితే.. అమెరికా అందించలేదు. అప్పుడే ఇతర దేశాలపై ఇలాంటి టైమ్‌లో ఆధారపడటం ఎంత ఇబ్బందో మనకు అర్థమైంది. ఫస్ట్ టైమ్ మనకు సొంతంగా నావిగేషన్ వ్యవస్థ అవసరం అనే ఆలోచన వచ్చింది కూడా అప్పుడే.
భారత్ టార్గెట్..
అలా ప్రారంభమైనదే IRNSS. దీనినే ఇప్పుడు నావిక్ అంటే.. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టాలేషన్ అని పిలుస్తున్నాం. ఈ సీరిస్‌లో 2013 నుంచి 2016 మధ్య తొలి ఏడు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 11 శాటిలైట్లను నింగిలోకి పంపారు. బట్ మనం అనుకున్న టార్గెట్‌ను మాత్రం రీచ్ కాలేకపోయాం. ఈ వ్యవస్థ ద్వారా భారత్‌తో పాటు మన దేశ సరిహద్దుల నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి నావిగేషన్ సేవలు అందించాలనేది టార్గెట్. అయితే ఒక నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని నిరంతరం పనిచేసేలా మెయింటేన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడే కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. భూమిపై మన లొకేషన్‌ను కచ్చితంగా గుర్తించాలంటే వాటిలో అత్యంత ఖచ్చితమైన గడియారాలు ఉండాలి. వీటినే అటామిక్ క్లాక్స్ అంటారు.
సొంతంగా అటామిక్ క్లాక్స్ తయారీ..
మొదటి తరం నావిక్ శాటిలైట్స్‌లో ఉపయోగించిన కొన్ని దిగుమతి చేసుకున్న రూబిడియం అటామిక్ క్లాక్స్ అనుకున్నంత కాలం పనిచేయలేదు. 2016-17 నుంచి ఇలాంటి సమస్యలు బయటపడటంతో కొన్ని ఉపగ్రహాల పనితీరు దెబ్బతిన్నది. సో.. నావిక్ సిస్టమ్‌లో పని చేసే శాటిలైట్ నెంబర్ తగ్గింది. అంటే మన దగ్గర నావిగేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ.. దాని సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో తిప్పలు తప్పలేదు. మరి ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటి? అంటే.. అసలు మనమే సొంతంగా అటామిక్ క్లాక్స్ తయారు చేసుకుంటే అయిపోతుంది కదా అని డిసైడ్ అయ్యింది కేంద్రం.
శాటిలైట్‌లో అటామిక్ క్లాక్ లేకపోతే ఏమవుతుంది?
సరే కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఒక శాటిలైట్‌లో అటామిక్ క్లాక్ లేకపోతే ఏమవుతుంది? సింపుల్‌గా చెప్పాలంటే.. మనం ఒక ప్రదేశంలో ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మన ఫోన్‌కు శాటిలైట్ల నుంచి సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్స్ శాటిలైట్ నుంచి మన ఫోన్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందో లెక్కిస్తారు. సిగ్నల్ ప్రయాణించిన సమయాన్ని బట్టి శాటిలైట్‌కు, మన ఫోన్‌కు మధ్య దూరాన్ని అంచనా వేస్తారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారాన్ని కలిపి మనం ఎక్కడున్నామో గుర్తిస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో టైమ్ అనేది చాలా కీలకం.
ఉపగ్రహాల్లో అటామిక్ క్లాక్స్
ఎందుకంటే కాంతి వేగంతో ప్రయాణించే రేడియో సిగ్నల్ విషయంలో ఒక్క నానోసెకన్ అంటే దాదాపు 30 సెంటీమీటర్ల దూరం. సో కొన్ని నానో సెకన్స్ తేడా వచ్చినా.. లోకేషన్ కొన్ని మీటర్లు మారిపోతుంది. అంటే సమయాన్ని కొలవడంలో చిన్న పొరపాటు జరిగినా మన లొకేషన్ గుర్తించడంలో తప్పులు జరుగుతాయి. అందుకే ఉపగ్రహాల్లో అటామిక్ క్లాక్స్ ఉంటాయి. సాధారణ వాచెస్‌లో పెండ్యూలం లేదా క్వార్ట్జ్ క్రిస్టల్ ఆధారంగా టైమ్‌ను కౌంట్ చేస్తారు. కానీ అటామిక్ క్లాక్స్ మాత్రం అణువుల సహజ కంపనాల ఆధారంగా అత్యంత కచ్చితంగా సమయాన్ని లెక్కిస్తాయి. ఇలాంటి క్లాక్స్‌ను స్పేస్‌లో ఉపయోగించడం వల్ల శాటిలైట్స్ మధ్య టైమ్‌ను కో ఆర్డినేట్ చేయవచ్చు.
NVS-03 విషయానికి వద్దాం..
ఇప్పుడు NVS-03 విషయానికి వద్దాం. ఇది ఇస్రో డెవలప్ చేస్తున్న రెండో తరం NavIC శాటిలైట్స్ సిరీస్‌లో మూడోది. ఇంతకుముందు ప్రయోగించిన NVS-01, NVS-02 శాటిలైట్స్‌లో కూడా స్వదేశీ అటామిక్ క్లాక్స్‌ను పంపించారు. ఇప్పుడు NVS-03లో కూడా మనం డెవలప్ చేసిన రూబిడియం అటామిక్ క్లాక్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మరికొన్ని ఇంపోర్ట్ చేసుకున్న అటామిక్ క్లాక్స్ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఒకవైపు మన సొంత టెక్నాలజీని టెస్ట్ చేస్తూనే మరోవైపు నావిగేషన్ సిస్టమ్‌ను స్ట్రెంథన్ చేసే పని చేస్తున్నారు.
కమర్షియల్ నావిగేషన్ డివైజ్‌లలో L1 సిగ్నల్..
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు NavICలో ప్రధానంగా L5, S బ్యాండ్ల సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ కొత్త తరం శాటిలైల్స్ L1 సిగ్నల్‌ను కూడా అందిస్తున్నాయి. ఈ L1 సిగ్నల్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా కమర్షియల్ నావిగేషన్ డివైజ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉపయోగిస్తున్నాయి. దీంతో NavICను సాధారణ ప్రజలు ఉపయోగించే ఫోన్లు, ఇతర పరికరాల్లో మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
Also Read: ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఖతార్, టర్కీల సీక్రెట్ గేమ్ నిజమేనా? షిన్ బెట్ విచారణలో తేలేది ఏంటి?
నావిక్ వ్యవస్థ వల్ల ఉపయోగాలు..
జస్ట్ ఫోన్‌లో లోకేషన్ చూపించడమే నావిక్ వ్యవస్థ పని కాదు. దీని వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వార్ టైమ్‌లో ఆర్మీకి ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తించే చాన్స్ ఉంటుంది. ఎరోప్లేన్స్, షిప్స్ మార్గాలకు ఉపయోగపడుతుంది. మత్స్యకారులకు సముద్రంలో రూట్స్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా విపత్తుల టైమ్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌కు ఉపయోగపడుతుంది. అత్యంత ముఖ్యమైనది.. మనం ఇలాంటి సేవల కోసం విదేశాలపై ఆధారపడే అవసరం ఉండదు.
వన్ నేషన్ వన్ టైమ్..
అంతేకాదు కేంద్రం ఒక టార్గెట్ పెట్టుకుంది.. అది వన్ నేషన్ వన్ టైమ్. అంటే దేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక సమయాన్ని మరింత కచ్చితంగా అమలు చేయాలనే ప్రయత్నం. ప్రస్తుతం మన ఫోన్లు, కంప్యూటర్లు, డిజిటల్ సిస్టమ్‌లు వేర్వేరు సర్వర్లు అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ లేదా విదేశీ నెట్‌వర్క్‌ల సమయాన్ని బట్టి పనిచేస్తున్నాయి. వీటి మధ్య కొన్ని సెకన్లు లేదా మిల్లీసెకన్ల తేడా ఉంటుంది. మనకు ఇది చిన్న విషయంగా అనిపించినా, దేశంలోని కీలక డిజిటల్ వ్యవస్థలకు ఇది పెద్ద సమస్య. అందుకే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, టెలికాం నెట్‌వర్క్స్, విద్యుత్ గ్రిడ్లు, డిజిటల్ పేమెంట్స్ వంటి అనేక రంగాలకు కచ్చితమైన సమయం అవసరం. సో.. ఇది సాధించాలన్న మన నావిక్ వ్యవస్థ సరిగా పని చేయాలి.
ఉపగ్రహాలను ఉపయోగించేందుకు ప్లాన్‌లు రెడీ..
అయితే NVS-03 ఒక్కటే NavIC సమస్యలన్నింటికీ పరిష్కారం కాదు. ఫ్యూచర్‌లో NVS-04, NVS-05 వంటి మరిన్ని ఉపగ్రహాలను కూడా ప్రయోగించేందుకు ఇస్రో ప్లాన్‌లు రెడీ చేస్తోంది. ఎందుకంటే ఒక నావిగేషన్ వ్యవస్థ నిరంతరాయంగా పనిచేయాలంటే చాలా ఉపగ్రహాలు పని చేయాలి. సో.. ఇందుకోసం మనం మరో అడుగు ముందుకేస్తున్నాం.
Also Read: స్పెయిన్ రైలు ప్రమాదం.. భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ఇది ఒక హెచ్చరికనా?