Inverter Care: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఎడతెరిపి లేకుండా కురిసే వానలు, తరచూ పోయే కరెంట్ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండే ఇన్వర్టరే చాలామందికి పెద్ద దిక్కు. అయితే వాతావరణంలో ఉండే విపరీతమైన తేమ వల్ల వర్షాకాలంలో ఇన్వర్టర్, బ్యాటరీ పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో వాటిపై కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వర్టర్, బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా, ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో చూద్దాం.
వర్షాకాలంలో గాలిలో తేమ శాతం (Moisture) చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ ఇన్వర్టర్ లోపలి సర్క్యూట్లలోకి చేరితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇన్వర్టర్, బ్యాటరీలను కిటికీలకు దూరంగా వర్షపు జల్లులు పడని చోట ఉంచాలి. అలాగే గోడలకు ఆనించి కాకుండా కనీసం కొన్ని ఇంచుల దూరంలో ఉంచడం బెటర్.
తేమ వల్ల బ్యాటరీ టెర్మినల్స్ (వైర్లు కనెక్ట్ చేసే చోట) పై తుప్పులాంటి పొర పేరుకుపోతుంది. ఇది పవర్ ఫ్లోను అడ్డుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వర్టర్ స్విచ్ ఆఫ్ చేసి వేడి నీళ్లలో ముంచిన పాత టూత్ బ్రష్‌తో ఆ టెర్మినల్స్‌ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత పొడి గుడ్డతో తుడిచి కొద్దిగా పెట్రోలియం జెల్లీ లేదా వాసెలిన్ రాస్తే తుప్పు పట్టకుండా ఉంటుంది.
చాలామంది ఎండకాలంలోనే బ్యాటరీ వాటర్ చెక్ చేస్తారు. వర్షాకాలంలో దానిని అస్సలు పట్టించుకోరు. కానీ ఈ సీజన్‌లోనూ బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ లెవెల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నీటి స్థాయి తగ్గినట్లు అనిపిస్తే వెంటనే డిస్టిల్డ్ వాటర్ మాత్రమే పోయాలని హితవు పలుకుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మామూలు కుళాయి నీటిని వాడకూడదని సూచిస్తున్నారు.
సాధారణంగా ఇన్వర్టర్ పనిచేస్తున్నప్పుడు కొంత వేడి విడుదలవుతుంది. అయితే వర్షాకాలంలో గదులు మూసి ఉంచడం వల్ల ఆ వేడి బయటకు పోక ఇన్వర్టర్ త్వరగా మరింత వేడెక్కే ఛాన్స్ ఉంది. అందుకే ఇన్వర్టర్ చుట్టూ గాలి ఆడేలా చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇన్వర్టర్ ను మూసి ఉన్న క్యాబిన్లలో, ఇరుకైన ప్రదేశాల్లో పెట్టొద్దని స్పష్టం చేస్తున్నారు.
వర్షాకాలంలో ఇన్వర్టర్‌పై అనవసరమైన లోడ్ వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కరెంట్ పోయినప్పుడు కేవలం ఫ్యాన్లు, లైట్లు, వైఫై రూటర్ వంటి అత్యవసర పరికరాలు మాత్రమే వాడాలని హితవు పలుకుతున్నారు. ఫ్రిజ్, గీజర్ లేదా మిక్సీ వంటి ఎక్కువ పవర్ లాగే వస్తువులను ఇన్వర్టర్‌కు కనెక్ట్ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Also Read: వాషింగ్ మిషన్ కొంటున్నారా? రూ. 30 వేలలో ఇవే బెస్ట్.. మొండి మరకలైనా మాయం కావాల్సిందే!
వర్షాకాలంలో ఒకసారి టెక్నీషియన్‌ను పిలిపించి ఇన్వర్టర్ హెల్త్ చెక్ చేయించడం బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. వైరింగ్‌లో ఏవైనా లోపాలున్నా, బ్యాటరీ సామర్థ్యం తగ్గినా వారు ముందే గుర్తించి సరిచేస్తారని పేర్కొంటున్నారు. దీనివల్ల కరెంట్ పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా పవర్ బ్యాకప్ పొందొచ్చని చెబుతున్నారు.
Also Read: యువతకు BSNL బంపరాఫర్.. సొంత ఊరిలో ఉంటూ.. నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్!