Moser Lamp Trick: ప్లాస్టిక్ బాటిల్, కొద్దిగా నీరు ఉంటే ఇంట్లో చీకటిని తరిమికొట్టవచ్చంటే నమ్ముతారా? విద్యుత్ అవసరం లేకుండా, నయా పైసా ఖర్చు కాకుండా కేవలం సూర్యరశ్మితో ఇంటిలో వెలుగులు నింపొచ్చని ఊహించారా? కానీ ఇది ముమ్మాటికి నిజం. ‘మోజర్ ల్యాంప్’ (Moser lamp) ట్రిక్ ను ఉపయోగించి.. ఇంట్లో బల్బ్ లేకుండా అంతటి కాంతిని పొందొచ్చు. అది ఎలాగో ఈ కథనంలో చూద్దాం.
బ్రెజిల్‌లోని ఉబెరాబాకు చెందిన అల్ఫ్రెడో మోజర్ అనే మెకానిక్.. 2000ల ప్రారంభంలో ఈ వినూత్న దీపాన్ని కనుగొన్నారు. ఆ సమయంలో బ్రెజిల్‌లో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. దీనికి పరిష్కారంగా మోజర్ ఒక ప్లాస్టిక్ సీసాలో నీటిని నింపి, ఇంటి కప్పు గుండా సగం లోపలికి, సగం బయటికి ఉండేలా అమర్చారు. ఇది కరెంట్‌ను ఉత్పత్తి చేయదు కానీ.. పగటిపూట బయటి ఎండను గది లోపలికి నలువైపులా ప్రసరింపజేస్తుంది.
2011లో ఫిలిప్పీన్స్‌కు చెందిన మైషెల్టర్ ఫౌండేషన్ ‘లీటర్ ఆఫ్ లైట్’ పేరిట ఈ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ సాంకేతికత అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. మొదటి 20 నెలల్లోనే ఫిలిప్పీన్స్‌లోని 1,500,000 పైగా ఇళ్లకు, ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లోని 3,50,000 ఇళ్లకు ఇది విస్తరించింది. యునెస్కో లెక్కల ప్రకారం ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో ఈ ఉచిత వెలుగుల సీసాను ఉపయోగిస్తున్నారు.
పారదర్శకమైన ప్లాస్టిక్ సీసాలోని నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ‘కాంతి వక్రీభవనం’ (Refraction) జరుగుతుంది. నీరు కాంతిని ఒకే చోట కేంద్రీకరించకుండా గది నలుమూలలకూ సమానంగా వెదజల్లుతుంది. దీనివల్ల ఒక సాధారణ బల్బు వెలిగినంత కాంతి గదిలోకి వస్తుంది. అయితే ఇది కేవలం పగటిపూట మాత్రమే పనిచేస్తుంది. రాత్రిళ్లు సూర్యరశ్మి ఉండదు కాబట్టి దీని ద్వారా ఇంటిలోకి ఎలాంటి కాంతి ప్రసారం కాదు.
ప్లాస్టిక్ బాటిల్ లో పోసే నీటిలో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ ను కలుపుతారు. ఎందుకంటే నీటిలో పాచి పట్టి కాంతి తగ్గిపోకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల నీరు చాలా కాలం పాటు స్వచ్ఛంగా ఉండి కాంతి సరిగ్గా ఇంటి లోపలికి ప్రసారం అవుతుంది.
Also Read: ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!
ఈ ప్లాస్టిక్ బాటిల్ ల్యాంప్ తయారు చేయడం సులభమే అయినా ఇంటి కప్పుకు రంధ్రం చేసి అమర్చడం కాస్త జాగ్రత్తతో కూడుకున్న పని. బాటిల్ చుట్టూ వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా పక్కాగా సీల్ (Waterproofing) చేయాలి. పైకప్పు దెబ్బతినకుండా చూసుకోవడం, స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా బాటిల్‌ను గట్టిగా అమర్చడం చాలా ముఖ్యం. మెుత్తంగా ఈ మోజర్ ల్యాంప్ మానవ మేధస్సుకు తేలికైన సాంకేతికతకు ఒక చక్కటి ఉదాహరణగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Also Read: రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!