Motorola Razr Fold: యాపిల్ ఎకోసిస్టమ్‌లో ఉండే AirDrop ఫీచర్ గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ డివైజ్‌ల మధ్య ఫైల్స్ చాలా వేగంగా షేర్ అవుతాయి. అయితే, గూగుల్ గతేడాది తమ Quick Share ఫీచర్‌ను యాపిల్ ఎయిర్‌డ్రాప్‌తో కనెక్ట్ చేస్తూ కీలక అప్‌డేట్ తెచ్చింది. పిక్సెల్ 10 సిరీస్‌తో మొదలైన ఈ సదుపాయం ఇప్పుడు మోటరోలా లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Razr Fold యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
తాజా నివేదికల ప్రకారం.. మోటరోలా రేజర్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ క్విక్ షేర్ ద్వారా యాపిల్ ఎయిర్‌డ్రాప్ సపోర్ట్‌ను పొందుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు కూడా నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ కొత్త అప్‌డేట్‌తో మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ నుండి మ్యాక్‌బుక్, ఐఫోన్ వంటి యాపిల్ డివైజ్‌లకు ఎలాంటి థర్డ్-పార్టీ యాప్‌లు లేదా క్లౌడ్ స్టోరేజ్ అవసరం లేకుండానే నేరుగా ఫైల్స్, యాప్స్, కాంటాక్ట్స్ పంపుకోవచ్చు. ఇప్పటివరకు యాపిల్ డివైజ్‌లకే పరిమితమైన ఈ సౌలభ్యం, ఇప్పుడు మోటో యూజర్లకు కూడా దక్కడం విశేషం.
Also Read: టీవీలు, లాప్‌టాప్‌లపై 80% వరకు తగ్గింపు.. రోజుకు రూ.99కే హోమ్ అప్లయెన్సెస్!
గూగుల్ సంస్థ గతంలోనే మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లకు ఈ ఎయిర్‌డ్రాప్ కనెక్టివిటీ రాబోతుందని హింట్ ఇచ్చింది. అన్నట్టుగానే.. ఈ ఫీచర్‌ను అందుకుంటున్న మొదటి మోటరోలా ఫోన్‌గా ‘రేజర్ ఫోల్డ్’ నిలిచింది. ఇప్పటికే పిక్సెల్ 9, పిక్సెల్ 10 సిరీస్‌లతో పాటు శాంసంగ్ గెలాక్సీ S26, వన్‌ప్లస్ 15, షియోమీ 17T ప్రో వంటి టాప్ ఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మోటరోలా కూడా ఈ లిస్ట్‌లో చేరడంతో ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్ల మధ్య ఫైల్ షేరింగ్ సమస్య తీరనుంది.
ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే.. మోటరోలా రేజర్ ఫోల్డ్ ఇటీవల భారత మార్కెట్లో రూ.1,49,999 ప్రారంభ ధరతో విడుదలైంది. ఇది 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీనిలో 6.6-ఇంచుల కవర్ డిస్‌ప్లేతో పాటు, లోపలి వైపు 8.1-ఇంచుల భారీ మెయిన్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అంతేకాకుండా.. 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6,000mAh బ్యాటరీని ఇందులో అమర్చారు.