Redmi Note 17 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి (Xiaomi) భారత మార్కెట్లోకి సరికొత్త ఫోన్ ను తీసుకొచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో ‘రెడ్‌మి నోట్ 17 5జీ’ (Redmi Note 17 5G) మెుబైల్ ను ఫోన్‌ను గురువారం (ఆగస్టు 6) అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చిన రెడ్‌మి నోట్ 15 5జీ కి సీక్వెల్‌గా ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. భారీ బ్యాటరీ, అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లే, మెరుగైన ప్రొటెక్షన్ వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.
రెడ్‌మి నోట్ 17 5జీ ఫోన్.. పాలికార్బోనేట్ బాడీతో రూపొందింది. వినియోగదారుల కోసం స్టార్‌లైట్ పర్పుల్, డార్క్ నైట్, ఆర్కిటిక్ బ్లూ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది. ఇక డిస్‌ప్లే భద్రత కోసం ముందుభాగంలో ‘కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i’ ప్రొటెక్షన్‌ను అందించారు. దీంతో పాటు దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను దీనికి అందించారు.
ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.9-అంగుళాల ఫుల్-HD+ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అమర్చారు. ఇది 2396 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ స్క్రీన్ కిందే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు హైడ్రోటచ్ 2.0, కంటి రక్షణ కోసం ‘TUV ఐ ప్రొటెక్షన్’ వంటి సాంకేతికతలను అందించారు.
రెడ్ మీ లేటెస్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మెరుగైన గ్రాఫిక్స్ కోసం అడ్రినో జీపీయు ఇచ్చారు. ఇది 8GB ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ షావోమీకి చెందిన సరికొత్త ‘హైపర్‌ఓఎస్ 3’ (HyperOS 3) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 50 MP ప్రైమరీ కెమెరాను అందించారు. ఇందులో ప్రో మోడ్, స్లో మోషన్, పనోరమా, టైమ్-లాప్స్ వంటి రకరకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఫిక్స్ చేశారు. ముందు, వెనుక కెమెరాల ద్వారా 1080p క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల (30fps) చొప్పున వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
ఇక ఈ ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఈ డివైజ్‌లో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా వేరే పరికరాలను ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉండటం విశేషం. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, 5జీ నెట్‌వర్క్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది.
Also Read: చావుదెబ్బ కొట్టిన Airtel.. మీకిష్టమైన బడ్జెట్ ప్లాన్ డిలీట్.. తెరపైకి మరో చౌకైన రీఛార్జ్!
భారత్‌లో రెడ్‌మి నోట్ 17 5జీ ప్రారంభ వేరియంట్ (8GB RAM + 128GB) ధరను రూ. 28,999గా నిర్ణయించారు. అలాగే 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 తక్షణ డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ సేల్స్.. ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అమెజాన్ తో పాటు షావోమీ అధికారిక వెబ్ సైట్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
Also Read: బయటకొచ్చిన వైసీపీ కాక్రోచ్‌లు.. రోడ్లపై నిరాహార దీక్షలు.. ఎక్కడో కొడుతోంది శీనా..!