Viture Vonder Smart Glasses: స్మార్ట్ గ్లాసెస్ అనగానే సాధారణంగా కెమెరా, కళ్ల ముందు కనిపించే డిస్ప్లే గుర్తుకు వస్తాయి. కానీ వీటికి పూర్తి భిన్నంగా, కెమెరా, డిస్ప్లే రెండూ లేకుండానే పనిచేసే కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను విచూర్ (VITURE) తీసుకొచ్చింది. ‘విచూర్ వాండర్’ పేరుతో రూపొందించిన ఈ గ్లాసెస్‌లో మనం మాట్లాడే మాటలు, వినే విషయాలను గుర్తుంచుకునే ఏఐ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్‌ను పదేపదే చేతిలోకి తీసుకోకుండానే ముఖ్యమైన సమాచారాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, రోజువారీ పనుల్లో వాయిస్ ద్వారా సహాయం పొందేలా వీటిని రూపొందించారు.
వాండర్‌లో కెమెరా, స్క్రీన్ రెండూ లేవు. అందువల్ల చుట్టూ ఉన్నవారికి తెలియకుండా చిత్రీకరించే అవకాశం ఉండదు. గ్లాసెస్ నిరంతరం రికార్డింగ్ చేయవు. యూజర్ బటన్ నొక్కినప్పుడు లేదా మీటింగ్ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆడియోను రికార్డ్ చేస్తాయి. రికార్డింగ్ జరుగుతున్నట్లు ఇతరులకు తెలియజేసేందుకు చిన్న లైట్ కూడా వెలుగుతుంది. రికార్డ్ చేసిన ఆడియోను వెంటనే టెక్స్ట్‌గా మార్చి, ఆడియో ఫైల్‌ను తొలగిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ గ్లాసెస్‌లో ‘పర్సనల్ మెమరీ గ్రాఫ్’ అనే ఏఐ సిస్టమ్ ఉంటుంది. మాట్లాడిన ముఖ్యమైన విషయాలు, నోట్స్ వంటి సమాచారాన్ని గుర్తుంచుకుని, అవసరమైనప్పుడు వాయిస్ కమాండ్ ద్వారా తిరిగి చెప్పగలదు. యాప్‌లో చాట్‌జీపీటీ, జెమిని, క్లాడ్ వంటి ఏఐ మోడళ్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఫోన్ చేతిలో లేకుండానే వాయిస్ కాల్స్ మాట్లాడటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
Also Read: ఎవరైనా మీ పేరు పిలిస్తే ఐఫోన్ అలర్ట్ చేస్తుంది.. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
వాండర్ బరువు సుమారు 30 గ్రాములు మాత్రమే. సాధారణ కళ్లజోడులా కనిపించే ఈ గ్లాసెస్‌కు వివిధ రంగుల ఫ్రేమ్‌లు అందుబాటులో ఉంటాయి. అవసరాన్ని బట్టి సైట్ అద్దాలు లేదా సన్‌గ్లాసెస్‌ను కూడా అమర్చుకోవచ్చు. రోజువారీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాటరీని రూపొందించారు. కేవలం 25 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
అమెరికాలో సెప్టెంబర్ 28 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ నుంచి డెలివరీలు మొదలవుతాయి. ప్రారంభ ధర రూ.25 వేల వరకు ఉంటుంది. ఇతర దేశాల్లో విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కెమెరా, డిస్ప్లే లేకుండా ఏఐ ఆధారిత స్మార్ట్ ఫీచర్లను అందించడం వల్ల, ఫోన్‌ను పదేపదే చూడకుండా రోజువారీ పనులు నిర్వహించాలనుకునేవారికి వాండర్ ఆసక్తికరమైన గాడ్జెట్‌గా మారనుంది.
మీటింగ్‌లో చెప్పిన ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడం, వెంటనే నోట్స్ తయారు చేసుకోవడం, రిమైండర్లు తెలుసుకోవడం వంటి సందర్భాల్లో వాండర్ ఉపయోగపడుతుంది. ప్రయాణాల్లో లేదా పని మధ్యలో ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరాన్ని తగ్గించడమే దీని ఉద్దేశం. ఏఐ ఆధారిత ఫీచర్లు సరిగ్గా పనిచేయడానికి యాప్, సేవలు అవసరం కావచ్చు. అలాగే భారత మార్కెట్‌లో ధర, లభ్యతపై కంపెనీ నుంచి సమాచారం రావాల్సి ఉంది. వినియోగదారుల డేటా ఎలా నిల్వ చేస్తుంది, భద్రత ఎలా ఉంటుంది అనే వివరాలను కొనుగోలు ముందు పరిశీలించడం మంచిది.
Also Read: రూ.16,999కే OnePlus ఫోన్.. 7,000mah బ్యాటరీతో వావ్ అనిపించే ఫీచర్లు!